మద్దతు, మార్కెట్‌ భద్రతపై భరోసా!

ABN , First Publish Date - 2021-11-20T08:07:43+05:30 IST

కొత్తగా ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయటంతో ఏడాదికాలంగా రైతుల్లో నెలకొన్న అభద్రత భావానికి తెరపడింది.

మద్దతు, మార్కెట్‌ భద్రతపై భరోసా!

  • ఒకే దేశం- ఒకే వ్యవసాయ మార్కెట్‌ అనే ఆందోళనకు ఇక చెల్లుచీటీ.. 
  • కొనసాగనున్న వ్యవసాయ మార్కెట్‌ యార్డులు
  • ఈ- నామ్‌ ఎలకా్ట్రనిక్‌ ట్రేడింగ్‌ పద్ధతికి మళ్లీ పునరుజ్జీవం
  • వ్యవసాయోత్పత్తుల అమ్మకం, కొనుగోళ్లు ఇక నుంచీ ప్రభుత్వం చేతిలోనే 
  • నిత్యావసర సరుకుల నిల్వలపై కొనసాగనున్న ప్రభుత్వ నియంత్రణ


హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ప్రవేశపెట్టిన మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దుచేయటంతో ఏడాదికాలంగా రైతుల్లో నెలకొన్న అభద్రత భావానికి తెరపడింది. ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంతో రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు రక్షణ కవచంలా ఉన్న ‘కనీస మద్దతు ధర’(ఎమ్మెస్పీ) వ్యవస్థ కొనసాగుతుందనే ధైర్యం రైతు ల్లో ఏర్పడింది. వ్యవసాయమార్కెట్ల కొనసాగింపు ద్వారా రైతులకు పంట ఉత్పత్తులు అమ్ముకోవటానికి భరోసా ఉంటుందని, ఒకే దేశం- ఒకే మార్కెట్‌ అనే ఆందోళన తొలగిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  వరితోపాటు ఇతర ఆహారధాన్యాల కొనుగోలు బాధ్యత, నిత్యావసర సరుకుల నియంత్రణ ప్రభుత్వాల చేతిలో ఉం టుందనే ధీమా కలుగుతోంది. 


సజీవంగా వ్యవసాయ మార్కెట్లు

వ్యవసాయ మార్కెట్‌ చట్టంలో స్వేచ్ఛా వ్యాపారానికి దారులు తెరిచారు. రైతులు పండించిన పంటను రైతు లు రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ‘వ్యవసాయ మార్కె ట్‌కమిటీ’(ఏఎంసీ)ల్లో అమ్మాల్సిన అవసరంలేదని, దేశం లో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, పొందుపరిచారు. దీంతో వ్యవసాయమార్కెట్‌ వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఆం దోళన వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 189 వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీలు, 94 సబ్‌ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. చట్టాల రద్దుతో గతంలో మాదిరిగానే పంట ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగుతాయి. ఇది సన్న, చిన్నకారు రైతులకు భారీ ఉపశమనాన్ని కలిగిస్తుందని, ఒక ఎకరం, రెండు ఎకరాల్లో పంట పండించిన రైతులు... ఆ ఉత్పత్తు లను సమీపంలో ఉన్న మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకునేందుకు అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్‌ యార్డుల కొనసాగింపుతో ‘ఈ- నామ్‌’ అనే ఎలకా్ట్రనిక్‌ ట్రేడింగ్‌ పద్ధతి కూడా కొనసాగుతుంది.  


కనీస మద్దతు ధర కొనసాగుతుందనే ధైర్యం

కొత్త వ్యవసాయచట్టాల్లో ‘కనీస మద్దతు ధర’(ఎమ్మెస్పీ)కు చట్టబద్ధత కల్పించలేదు. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు ఉండవనే ఆందోళన ఇంతకాలం రైతుల్లో నెలకొంది. చట్టాల రద్దుతో ఇక ఎమ్మెస్పీ ఉంటుందనే ఽధైర్యం రైతుల్లో ఏర్పడింది. వానాకాలంలో 14 పంటలకు, యాసంగిలో 8 పంటలకు కేంద్రం ఎమ్మెస్పీ ప్రకటిస్తోం ది. ఎఫ్‌సీఐ, సీసీఐ, నాఫెడ్‌, ఎస్‌ఎ్‌ఫఏసీతోపాటు ఇతర కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌, హాకా లాంటి రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు... కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు ఆహారధాన్యా లు, పప్పు దినుసులు, నూనె గింజలు కొనుగోలు చేస్తాయనే ధైర్యం రైతులకు ఉంటుంది.  


ప్రభుత్వ నియంత్రణలోనే నిత్యావసర నిల్వలు

మార్కెట్‌ నిత్యావసర సరకుల సవరణ చట్టంతో బియ్యం, గోధుమ లు, జొన్నలు, రాగుల లాంటి ఆహార ధాన్యాలు, ముతక ధాన్యాలు, పప్పులు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, నూనెలను నిత్యావసర సరుకుల చట్టం నుంచి తొలగించటంతో ఆందోళన వ్యక్తమైంది. వ్యాపారులు, దళారు లు, కార్పొరేట్‌ సంస్థలు... గోదాము లు, శీతల గిడ్డంగులను తమ అధీనంలోకి తీసుకొని భా రీగా నిల్వ పెట్టుకొని బ్లాక్‌ మార్కెట్‌ చేస్తాయని, దీంతో ధరలు విపరీతంగా పెరుగుతాయని, వినియోగదారుల కు ఆహార ధాన్యాల కొరత, ఆహార భద్రతకు ముప్పు ఏ ర్పడుతుందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. చట్టం రద్దుచేయటంతో నిత్యావసర నిల్వలపై ప్రభుత్వ పెత్తన మే కొనసాగనుంది.  


కార్పొరేట్‌ సంస్థలతో తప్పిన ముప్పు

కాంట్రాక్టు ఫార్మింగ్‌ చట్టం రద్దుతో చిన్న, సన్నకారు రైతులకు కార్పొరేట్‌ సంస్థలతో పొంచిఉన్న ముప్పు తప్పిపోయింది. ఐదేళ్ల కాంట్రాక్టు సిస్టమ్‌ తోపాటు బయటి మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నా ఒప్పంద ధరకే అమ్మాలనే నిబంధన ఉండేది. దేశంలో 86 శాతం, రాష్ట్రంలో 90 శాతం చిన్న సన్నకారు రైతులే ఉన్న నేపథ్యంలో బడా సంస్థల చేతిలో చిన్న, సన్నకారు రైతులు బలిపశువులవుతారనే ఆందోళన వ్యక్తమైంది. ఈ చట్టం రద్దుతో కార్పొరేట్‌ కంపెనీలతో రైతులకు తలనొప్పులు ఉండవు. రైతులు తమకు నచ్చిన పంటలు సాగు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  


మక్కలు తదితర ఉత్పత్తులు కొనాల్సిందే

కేంద్రం ప్రకటించిన అన్ని పంటల ఉత్పత్తులను కొనుగోలుచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉం టుందని వ్యవసాయరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మొక్కజొన్నకు కేంద్రం ఏటా మద్దతు ధర ప్రకటిస్తోంది. కానీ నిరుటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న సాగుపై నిషేదం విధించింది. మార్క్‌ఫెడ్‌ ఉన్నప్పటికీ నిరుడు యాసంగి, ఈ వానాకాలం సీజన్‌లో మక్కలను రాష్ట్ర ప్రభుత్వం కొనలేదు కందులనూ కొన లేదు. ఎమ్మెస్పీ ప్రకటించిన జొన్నలు, సజ్జలు, రాగులు, పెసర్లు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సో యాబీన్‌, నవ్వుల లాంటి ఎమ్మెస్పీ ప్రకటిత పంటలతోపాటు పసుపు, ఎర్రజొన్న లాంటి ఎమ్మెస్పీ లేని పంటల ను కూడా ప్రభుత్వరంగ సంస్థతో కొనుగోలు చేయించాలనే డిమాండ్‌ రైతుల నుంచి, రైతుసంఘాల నుంచి వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కొనుగోలుచేయకపోయినా... ప్రభుత్వరంగ సంస్థ లు మార్కెట్‌లో ఉంటే ట్రేడర్లు, వ్యాపారులు కంట్రోల్‌లో ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


దాన్యం కొనుగోళ్లకు బేఫికర్‌

రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రధాన పంటగా వరి సాగుచేస్తున్నారు. వానాకాలం, యాసంగిలో కలిపి కోటి ఎకరాలకు పైగా వరి సాగుచేస్తున్నారు. కేంద్రం పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలతో పంట ఉత్పత్తుల బాధ్యతల నుంచి ప్రభుత్వం వైదొలుగుతుందనే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పటికే బాయిల్డ్‌ రైస్‌ వద్దన్నందుకు  కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. బాయిల్డ్‌ రైస్‌, రా రైస్‌ సమస్య పక్కనపెడితే దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం బియ్యం సేకరించటం తప్పదు. దీంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎదురయ్యే ప్రతిబంధకాలు తొలగిపోతాయి. 

Updated Date - 2021-11-20T08:07:43+05:30 IST