రైతులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-09-29T07:37:30+05:30 IST

రాష్ట్రంలో వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

రైతులను  ఆదుకోండి

కృష్ణా, గోదావరి వరదల్లో  పంటపొలాలు మునిగాయి

పేదలు జీవనోపాధి కోల్పోయారు

ముందు జాగ్రత్తలు, సహాయ చర్యలేవీ?

నష్టాల అంచనా కూడా మొదలెట్టలేదు

టీడీపీ అధినేత చంద్రబాబు ఆక్షేపణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాహ్నికి లేఖ

 

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరదల్లో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆమెకు లేఖ రాశారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, జీవనోపాధి కోల్పోయి పేదలు కూడా కష్టాలపాలయ్యారని పేర్కొన్నారు.


కృష్ణా పరివాహక ప్రాంతంలో వరదలు, గోదావరి ప్రాంతంలో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వరదలతో పంట పొలాలు మునకెత్తి పంటలు నీట మునిగాయని, ఇంత నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం వైపు నుంచి ముందు జాగ్రత్త చర్యలు గానీ... సహాయ చర్యలు గానీ లేవని విమర్శించారు. ఇంతవరకూ నష్టాలకు సంబంధించి అంచనాల తయారీనే మొదలు పెట్టలేదని ఆక్షేపించారు. నిరుటి వరదల పరిహారం ఇంతవరకూ రైతులకు ఇవ్వలేదని, జాప్యం సరికాదని వ్యాఖ్యానించారు.


నిరుడు రాష్ట్రంలో 1,029 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ పరిస్ధితులు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని.. తడిసిన ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని.. ఉల్లి, మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన పంటలూ కొనుగోలు చేయాలని కోరారు.


Updated Date - 2020-09-29T07:37:30+05:30 IST