కష్టజీవులకు వెన్నుదన్ను

ABN , First Publish Date - 2021-10-03T05:36:15+05:30 IST

శ్రమనే పెట్టుబడిగా జీవనోపాధి పొందుతున్న పలు రంగాల కార్మికులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ‘ఈ-శ్రమ్‌’ పథకం ద్వారా సామాజిక భద్రత కల్పించనున్నది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కూలీలకు ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి గుర్తింపు తీసుకువచ్చి వారి వివరాలను భద్రపరచడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు ఈ-శ్రమ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

కష్టజీవులకు వెన్నుదన్ను

అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భరోసా
‘ఈ-శ్రమ్‌’తో భద్రత, జీవిత బీమా
కార్డుతో గుర్తింపు.. ప్రత్యేకంగా డేటాబేస్‌
నమోదు చేసుకుంటే పలు ప్రయోజనాలు
హనుమకొండ జిల్లాలో 6 లక్షల మందికి లబ్ధి
ప్రచారం లేక ముందుకురాని కార్మికులు
నెలరోజులవుతున్నా నత్తనడకగా నమోదు


శ్రమనే పెట్టుబడిగా జీవనోపాధి పొందుతున్న పలు రంగాల కార్మికులకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం ‘ఈ-శ్రమ్‌’ పథకం ద్వారా సామాజిక భద్రత కల్పించనున్నది. అసంఘటిత రంగంలో పని చేస్తున్న కూలీలకు ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడంతో చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి గుర్తింపు తీసుకువచ్చి వారి వివరాలను భద్రపరచడంతో పాటు బీమా సౌకర్యం కల్పించేందుకు ఈ-శ్రమ్‌ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

హనుమకొండ రూరల్‌, అక్టోబరు 2:  అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్‌ పథకం ప్రవేశపెట్టింది. ఆగస్టు 26వ తేదీన ప్రారంభమైన ఈ ప్రక్రియ డిసెంబరు 31 వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులందరినీ ఇందులో నమోదు చేయాలనే లక్ష్యంగా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే నెల రోజులు కావస్తున్నప్పటికీ సరైన ప్రచారం లేకపోవడంతో నమోదు చేసుకోవడానికి అసంఘటిత కార్మికులు పెద్దగా ముందుకు రావడం లేదు. జిల్లాలో వివిధ రంగాల్లో పని చేసేవారు లక్షల్లో ఉన్నా అవగాహన లేక ఈ-శ్రమ్‌ గురించి వారికి తెలియడం లేదు. ఈ పథకంలో చేరడానికి ఆదాయపు పన్ను పరిమితికిలోపు ఉన్నవారే అర్హులు.  హనుమకొండ జిల్లాలో 6 లక్షలకుపైగా అసంఘటిత రంగంలో పని చేస్తున్న కూలీలున్నారు.

ప్రత్యేక డాటాబేస్‌

అసంఘటిత కార్మికులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఇప్పటి వరకు సరైన వివరాలు లేవు. దీని ఫలితంగా ఇటీవల కరోనా సమయంలో వారికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదు. ప్రస్తుతం కార్మికుల పూర్తి వివరాలతో కూడిన డేటాబే్‌సను సేకరించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను రూపొందించి ఇందులో కార్మికుల వివరాలను నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఎదురైనా పథకాల అమలుకు వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అసంఘటిత రంగ కార్మికులై 18 నుంచి 59 యేళ్ల వయస్సు కలిగిన వారు ఈ-శ్రమ్‌ వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి అర్హులు. ఆదాయ పన్ను చెల్లించనివారు, ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐ వంటి సదుపాయాల పరిధిలోకి రాని వారు మాత్రమే దీనికి అర్హులుగా నిబంధనలు ఉన్నాయి.

నమోదు ప్రక్రియ ఇలా..
కామన్‌ సర్వీస్‌ సెంటర్లు (సీఎ్‌ససీ) మీ సేవా, ఎంపిక చేసిన కొన్ని పోస్టాఫీసులు, కార్మిక కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న వెంటనే యూఏఎన్‌తో కూడిన ఈ-శ్రమ్‌ కార్డు జారీ చేస్తారు. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నెంబరు, బ్యాంకుఖాతా వివరాలతో వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. హనుమకొండ జిల్లాలో 384 కామన్‌ సర్వీస్‌  సెంటర్లు ఉండగా ఇందులో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

ఇవీ ప్రయోజనాలు
ఈ-శ్రమ్‌ పథకంలో చేరే ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల గుర్తింపు కార్డు (యూఏఎన్‌) మంజూరు చేస్తారు. ఈ కార్డు ద్వారా అన్ని సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింప చేస్తారు. నమోదు చేసుకున్న కార్మికుడికి ఏడాదిపాటు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ 2లక్షల ప్రమాద, మరణ, అంగవైకల్య బీమా ఉచితంగా కల్పిస్తారు. అసంఘటిక రంగ కార్మికులకు అమలు చేసే పథకాలు, విధానాలను ఈ-డాటాబేస్‌ ప్రామాణికంగా తీసుకుంటారు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించేందుకు పరిశీలిస్తారు.

అసంఘటిత రంగ కార్మికులు వీరే..
వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఉపాధి పొందే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యానవనాలు, నర్సరీలు, పాడి పరిశ్రమలపై ఆధారపడి జీవించేవారు. భవన నిర్మాణం, ఎలక్ట్రిషియన్‌, వెల్డింగ్‌, ఇటుక, సున్నం బట్టీలు, కాంక్రీట్‌ మిక్సర్లు, బావుల తవ్వకం, టైలరింగ్‌, ఆటోమోబైల్‌, డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత, కుమ్మరి, స్వర్ణకార, రజకులు, క్షౌరవృత్తి, బావులు తవ్వడం, పూడిక తీసే కూలీలు, వీధి వ్యాపారులు, దుకాణాల్లో పని చేసే గుమాస్తాలు, చిరు తోపుడు బండ్ల వ్యాపారులు, వడ్రంగి, మత్స్యకారులు, ఉద్యానవనాల్లో పని చేసేవారు.

పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- కె.ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్‌ పథకాన్ని అసంఘటిత రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. తమ పేర్లను కామన్‌ సర్వీస్‌ కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేస్తారు. పేర్లు నమోదు చేసుకోవడానికి డిసెంబరు 31 వరకు సమయం ఉంది. ఈ-శ్రమ్‌ ద్వారా జారీ చేసిన కార్డు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

విధిగా పేర్లు నమోదు చేసుకోవాలి
- కుసుమ శ్యాంసుందర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగునాడు ట్రేడ్‌ యూనియన్‌ కౌన్సి
ల్‌

భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు ఎదురైనా పథకాల అమలుకు వీలుంటుంది. ఈ-శ్రమ్‌లో చేరిన కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబరు కేటాయిస్తారు. ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వ సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. అలాగే ఉచిత బీమా కూడా వర్తిస్తుంది. ప్రతి కార్మికుడు విధిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

Updated Date - 2021-10-03T05:36:15+05:30 IST