వరికి మద్దతు రూ.1,940

ABN , First Publish Date - 2021-06-10T08:30:54+05:30 IST

నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రకాల పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థి

వరికి మద్దతు రూ.1,940

క్వింటా ధర రూ.72 పెంపు.. వరి గ్రేడ్‌-ఏ రకం ఎమ్మెస్పీ 1,960

క్వింటా పత్తికి రూ.211, కందికి 300 పెరిగిన కనీస మద్దతు ధర

2021-22 పంటకాలానికి 14 ఖరీఫ్‌ పంటలకు పెంచిన కేంద్రం

పప్పులు, నూనె గింజలు, తృణధాన్యాలకు గణనీయంగా పెంపు

రూ.25 వేల కోట్ల అంచనా వ్యయంతో రైల్వేకు 5 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌


న్యూఢిల్లీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న వేళ రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రకాల పంటల కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లను ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) 2021-22 పంట కాలానికి (జూలై-జూన్‌) 14 ఖరీఫ్‌ పంటలకు పెంచిన ఎమ్మెస్పీకి ఆమోదం తెలిపింది. ఈ ధరల ఆధారంగా రైతులకు ఏ పంటలను సాగు చేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. వరి క్వింటా కనీస మద్దతు ధరను రూ.72 పెంచారు. దీంతో వరి ధాన్యం సాధారణ రకం ధర రూ.1,868 నుంచి రూ.1,940కి పెరిగింది. గ్రేడ్‌ ఏ రకం ధరను కూడా రూ.72 పెంచడంతో రూ.1,888 నుంచి రూ.1,960కి చేరింది. పప్పులు, నూనె గింజలు, తృణధాన్యాలకు ఎమ్మెస్పీని గణనీయంగా పెంచారు.


వాణిజ్య పంటల విషయానికి వస్తే పత్తి కనీస మద్దతు ధర (మీడియం స్టేపుల్‌)ను క్వింటాకు రూ.211 పెంచడంతో దీని ధర రూ.5,726కు చేరింది. లాంగ్‌ స్టేపుల్‌ రకం పత్తి క్వింటా ధరను రూ.200 పెంచినందున ధర రూ.6,025కు పెరిగింది. అత్యధికంగా క్వింటా నువ్వులకు రూ.452 పెంచారు. క్వింటా మొక్కజొన్నకు రూ.20, కందులకు రూ.300, మినుములకు రూ.300 చొప్పున, జొన్నకు రూ.118, పెసళ్లకు రూ.79, పొద్దుతిరుగుడుకు రూ.130, సజ్జకు రూ.100 పెంచారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా కొన్ని పంటలను ప్రోత్సహించడానికి నువ్వులు, కందులు, మినుము, వేరుశనగ, నల్లనువ్వులకు ధరలను ఎక్కువ పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. డిమాండ్‌-సరఫరా మధ్య సమతుల్యత కోసం ఇతర పంటలకు రైతులు మళ్లడానికి వీలుగా నూనెగింజలు, పప్పుధాన్యాలు వంటి పంటలకు గత కొంత కాలంగా ఎమ్మెస్పీని ఎక్కువగా పెంచుతున్నామని పేర్కొంది.


ఎమ్మెస్పీ కొనసాగుతుంది : కేంద్రం 

కేబినెట్‌ సమావేశం తర్వాత కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విలేకరులతో మాట్లాడారు. కనీస మద్దతు ధరను పెంచడం వల్ల పంటల ఉత్పత్తి వ్యయంపై రైతులు 50 శాతం నుంచి 85 శాతం వరకు అధిక రాబడిని పొందుతారని తెలిపారు.  పార్లమెంట్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు ఆమోదం లభించిన తర్వాత ఎమ్మెస్పీకి సంబంధించి ఆందోళనలు వ్యక్తమయ్యాయని, ఆ సమయంలో ప్రధానితోపాటు తాను ఎమ్మెస్పీ విధానం ఉందని, భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని హామీ ఇచ్చామన్నారు. ప్రభుత్వం రబీ, ఖరీఫ్‌ పంటలకు ఎమ్మెస్పీని నిర్ణయిస్తోందని, ఎఫ్‌సీఐ ద్వారా గోధుమలు, ధాన్యం.. ఇతర ఏజెన్సీల ద్వారా పప్పులు, నూనె గింజల సేకరణ జరుగుతోందని చెప్పారు. ‘‘ఆందోళన అవసరం లేదు. ఎమ్మెస్పీ ఉంది. ఎంఎస్పీతో సేకరణ కొనసాగుతోంది. ఎమ్మెస్పీని పెంచుతున్నాం. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగుతుంది’’ అని తోమర్‌ పేర్కొన్నారు. 


ఉచితంగా పప్పుధాన్యాల విత్తనాలు

ప్రత్యేక ఖరీఫ్‌ వ్యూహంలో భాగంగా అంతర్‌పంటలు, సోల్‌ క్రాప్‌ పద్ధతిలో పలు పంటల సాగును ప్రోత్సహించడానికి అధిక దిగుబడి రకాల విత్తనాలను ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం కోసం ఈ ఏడాది ఖరీ్‌ఫలో అమలు చేయడానికి వీలుగా ప్రత్యేక ఖరీఫ్‌ వ్యూహాన్ని రూపొందించామని తెలిపింది. కందులు, పెసలు, మినుము పంటల సాగు విస్తరణ, ఉత్పాదకతను పెంచడానికి సమగ్ర ప్రణాళికను రచించామని వివరించింది. ఈ పంటలకు సంబంధించిన అధిక దిగుబడి రకాల విత్తనాలు ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే నూనెగింజల సాగును ప్రోత్సహించడానికి కూడా ప్రణాళిక రూపొందించామని తెలిపింది. 


రైల్వేకు 5 మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌..

భారత రైల్వేస్‌ కమ్యూనికేషన్‌, సిగ్నలింగ్‌ వ్యవస్థలను మరింత మెరుగుపరిచేందుకుగాను 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌లో 5మెగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ తెలిపారు. ఇది ట్రాన్స్‌పోర్ట్‌ నెట్‌వర్క్‌పై ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందన్నారు. రూ.25,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ఐదేళ్లకాలంలో పూర్తికానుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైల్వేస్‌ తన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ కోసం ఆప్టికల్‌ ఫైబర్‌పై ఆధారపడుతోంది. అయితే తాజాగా స్పెక్ట్రమ్‌ కేటాయింపు వల్ల రియల్‌టైమ్‌ ప్రాతిపదికన హైస్పీడ్‌ రేడియో వినియోగానికి అవకాశం ఉంటుంది. ఇది రైల్వేస్‌ కమ్యూనికేషన్‌, సిగ్నలింగ్‌ నెట్‌వర్క్స్‌ వృద్ధికి దోహదపడనుంది. 

Updated Date - 2021-06-10T08:30:54+05:30 IST