Abn logo
May 10 2021 @ 13:04PM

అమెరికా నుంచి భారత్‌కు రూ.3,671కోట్ల సాయం!

వాషింగ్టన్: కరోనా గుప్పిట్లో భారత్ కకావికలం అవుతోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి విరుచుకుపడటంతో దేశంలోని ఆసుపత్రిల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో ప్రాణ వాయువు అందక కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ప్రపంచ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి భారత్‌కు భారీ మొత్తంలో సాయం అందుతోంది. జో బైడెన్ ప్రభుత్వం భారత్‌కు అత్యవసర సాయంగా 100 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 744కోట్ల) ప్యాకేజీతో కలిపి ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఇండియాకు అందిన సాయం విలువ దాదాపు అర బిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 3,671.875కోట్ల)కు చేరినట్టు తెలుస్తోంది. 


భారత్‌లో నెలకొన్న పరిస్థితులను చూసి అగ్రరాజ్యంలోని దిగ్గజ టెక్, ఫార్మా కంపెనీలు, స్వచ్ఛంధ సంస్థలు, ఇండియన్ అమెరికన్‌ కమ్యూనిటీలు తమకు తోచిన విధంగా ఇండియాను ఆపన్న హస్తం అందిస్తున్నాయి. భారత్‌కు గూగుల్ రూ.135కోట్ల సాయాన్ని ప్రకటించగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా స్పందిస్తూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఇండియాను ఆదుకునేందుకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కరోనా‌పై భారత్‌ చేస్తున్న పోరుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అండగా నిలిచింది. కరోనా రోగుల చికిత్స కోసం 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.510 కోట్లు) విలువ చేసే ఔషధాలను అందిస్తామని ఆ కంపెనీ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. యూఎస్‌లోని ప్రముఖ 40కిపైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఒక టాస్క్‌ఫోర్స్‌గా ఏర్పడి కరోనా సంక్షోభంలో ఉన్న భారత్‌కు దాదాపు 30 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించాయి. అమెరికాలోని ప్రొక్టర్ మరియు గాంబుల్ ( 6.7 మిలియన్ డాలర్ల) మెర్క్ (5 మిలియన్ డాలర్లు), వాల్‌మార్ట్ (2 మిలియన్ డాలర్లు), సేల్స్‌ఫోర్స్ (2.4 మిలియన్ డాలర్లు), కేట్‌పిల్లర్(3.4 మిలియన్ డాలర్లు) తదితర సంస్థలు భారత్‌కు భారీ మొత్తాన్ని ప్రకటించాయి. డెలాయిట్ అనే సంస్థ కూడా 12వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తరలించేందుకు ముందుకొచ్చింది. 


ఇకపోతే.. ఇండియన్ అమెరికన్లు కూడా కష్టాల్లో ఉన్న మాతృభూమిని  ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వ్యాపారవేత్త ఇండియన్ అమెరికన్ వినోద్ ఖోస్లా ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కోసం 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.74కోట్లు) ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. మరో ప్రవాస భారతీయుడు జై శెట్టి 4 మిలియన్ డాలర్లను ప్రకటించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) (3.6 మిలియన్ డాలర్లు) ఇండియాస్పుర (2.5 మిలియన్ డాలర్లు) కూడా ఆపన్న హస్తాన్ని అందించాయి. సేవా ఇంటర్నేషనల్ ఆ సంస్థ చరిత్రలోనే మొట్టమొదటగా 15 మిలియన్ డాలర్లను విరాళాల రూపంలో సేకరించి ఇండియాకు అండగా నిలుస్తోంది. 


ఇలా ఇప్పటి వరకు అమెరికా నుంచి భారత్‌కు దాదాపు అర బిలియన్ డాలర్ల సాయం అందిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టనర్‌షిప్ ఫోరం (యూఎస్ఐఎస్‌పీఎఫ్) సభ్యుడు ముకేష్ ఆగీ మాట్లడుతూ.. ఈ నెల చివరి నాటికి అమెరికా నుంచి భారత్‌కు అందుతున్న సాయం విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొన్నారు. గత రెండు వారాలుగా అమెరికా ప్రభుత్వం, బిజినెస్ కమ్యూనిటీ, ఇండియన్ అమెరికన్లు, స్వచ్ఛంధ సంస్థల నుంచి భారత్‌కు లభిస్తున్న మద్దతుపట్ల యూస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) అధ్యక్షుడు నిషా దేశాయ్ బిస్వాల్ హర్షం వ్యక్తం చేశారు. 

తాజా వార్తలుమరిన్ని...