మోదీజాలంలో మద్దతు ధరలు

ABN , First Publish Date - 2021-11-25T06:34:12+05:30 IST

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 19న ప్రకటించడం స్వాగతించదగిన పరిణామం. ఇది, దేశంలో గత 15 నెలలుగా, గత ఏడాది నవంబరు 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం సాధించిన చరిత్రాత్మక విజయం....

మోదీజాలంలో మద్దతు ధరలు

కనీస మద్దతుధరల విషయంలో స్వతంత్ర భారత ప్రభుత్వాలకు మొదటి నుంచీ లక్ష్య నిబద్ధత లేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వమూ ఈ విషయంలో రైతులను మభ్యపెడుతోంది. మద్దతు ధరలకు చట్టబద్ధత కొరవడడంతో ఫలసాయాన్ని తక్కువ ధరలకు అమ్ముకోవలసిరావడం వల్ల రైతులు ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టపోతున్నారు. కనీస మద్దతుధరల హామీ చట్టంతో మాత్రమే ఈ అన్యాయాన్ని అరికట్టడం, అన్నదాతల ఆదాయాన్ని పెంపొందించడం సాధ్యమవుతుంది.


మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 19న ప్రకటించడం స్వాగతించదగిన పరిణామం. ఇది, దేశంలో గత 15 నెలలుగా, గత ఏడాది నవంబరు 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం సాధించిన చరిత్రాత్మక విజయం. రైతు ఉద్యమం మరో ముఖ్యమైన డిమాండ్‌ కనీస మద్దతు ధరల హామీ చట్టం. దీంతో సహా ఇతర డిమాండ్లను చర్చించి పరిష్కరించకుండా, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ‘సెలెక్టు కమిటీ’ వేస్తామని ప్రధాని మోదీ ఒక మొక్కుబడి ప్రకటన చేశారు. కనీస మద్దతు ధరల విషయంలో మోదీతో సహా, అన్ని ప్రభుత్వాలు గత 70 ఏళ్లుగా ద్రోహం చేస్తూనే ఉన్నాయి. అబద్ధాలు, తప్పుడు ప్రచారం చేయడంలో గత ప్రభుత్వాలను తలదన్నే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు.


ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ సబ్‌ కమిటీ’ సమావేశం స్వామినాథన్‌ కమిషన్ సిఫారసులను ఆమోదించి, దాని ప్రకారం, ఉత్పత్తి ఖర్చులపై 50 శాతం అదనంగా కలిపి, 2021–22 రబీ పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినట్లుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ లోక్‌సభలో 2020 సెప్టెంబర్ 21న ప్రకటించారు. ‘ప్రపంచ ఆహార సంస్థ’ (ఎఫ్‌ఏఓ) 42వ సమావేశంలో ‘మద్దతు ధరల వ్యవస్థ ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చలేనంత మెరుగ్గా ఉందనీ, పంటల సేకరణను భారతప్రభుత్వం తగిన సమయంలో చేస్తున్నదనీ, వ్యవసాయదారుల సంక్షేమానికి అది ఎప్పుడూ కట్టుబడి ఉంద’ని తోమార్ ఉద్ఘాటించారు. మోదీ ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో సాగిస్తున్న పచ్చి అబద్ధాల ప్రచారానికి ఇవి మచ్చుతునకలు మాత్రమే. మోదీ సర్కార్ అమలు చేస్తున్నది తాము సిఫారసు చేసిన సీ2+50 శాతం కాదనీ, కేవలం ఎ2+50 శాతం మాత్రమే అమలు చేస్తోందని స్వామినాథన్ అనేకసార్లు మీడియాకు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ, మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని మభ్యపెట్టి, మోసం చేయటానికి అదే తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఇతర దేశాల కంటే భారతదేశంలో మద్దతు ధరల వ్యవస్థ మెరుగ్గా ఉందన్న ప్రచారం పూర్తిగా బూటకం. 


2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా స్వామినాథన్‌ కమిషన్ సిఫారసు ప్రకారం కనీస మద్దతు ధరను 12 నెలల్లోపు కల్పిస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడంతో పాటు మోదీ దానిని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే గెలిచి అధికారంలోకి వచ్చింది మొదలు ఆయన మొండిచేయి చూపిస్తూనే ఉన్నారు. కనీస మద్దతు ధరను అమలు చేస్తే అది మార్కెట్ ధరను వక్రీకరిస్తుందని, అందువల్ల దాని అమలు సాధ్యంకాదని సుప్రీంకోర్టుకు 2015 ఫిబ్రవరి 20న తెలియజేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కొన్ని ఉత్పత్తి ఖర్చులు మినహాయించిన ఎ2+50 శాతం కనీస మద్దతు ధరను 2018–19 నుంచి అమలు చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులపై (భూమికి కౌలు, భూమిపై పెట్టిన పెట్టుబడి - బోరు బావి, షెడ్‌, ఫెన్సింగు- మొదలైనవి మినహాయించి) 50 శాతం అదనంగా మద్దతు ధర అనేది మోసపూరితమైనది. కనీసం పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా మద్దతు ధరలు పెంచడం లేదు. 2020–21లో ద్రవ్యోల్బణం 6.18 శాతం పెరిగితే వరిధాన్యం ధరను క్వింటాల్‌కు రూ. 1835 నుంచి రూ. 1888, (2.9 శాతం) పెంచింది. 2021–22లో గత 7 నెలలుగా టోకు ధరల సూచిక 10 శాతానికి పైగా, అక్టోబర్‌ నెలలో 12.5 శాతం పెరిగింది. అయితే ధాన్యం ధరను 1 క్వింటాల్‌కు 3.9 శాతం మాత్రమే మోదీ సర్కార్ పెంచింది. అనగా ఉత్పత్తి ఖర్చుల కంటే మద్దతు ధర తక్కువగా ఉంది. దాదాపు అన్ని పంటల పరిస్థితి అదే విధంగా ఉంది.


అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశంలో నిర్ణయిస్తున్న మద్దతు ధరలు (గత 2 దశాబ్దాలకు పైగా) తక్కువగా ఉంటున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ - ఈ ఏడాది అక్టోబర్‌ల మధ్య ఆహారధరల సూచిక 32.8 శాతం పెరిగిందని ఎఫ్‌ఏఓ పేర్కొన్నది. ప్రపంచ మార్కెట్లో ఆహారధరల సూచిక పెరుగుదలతో పోలిస్తే మన దేశంలో మద్దతు ధరల పెరుగుదల ఎంత తక్కువగా ఉందో ఎవరైనా అర్ధం చేసుకోగలుగుతారు.


స్వామినాథన్‌ కమిషన్ సిఫారసును దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఉత్పత్తి ఖర్చులు అంచనా వేసి, కేంద్రానికి పంపి, చేతులు దులుపుకుంటున్నాయి. తెలంగాణలో 1 క్వింటాల్ వరిధాన్యం పండించటానికి రూ. 2529లు అవుతుందని కేసీఆర్‌ ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి 50 శాతం అదనంగా కలిపితే, రూ. 3798లు అవుతుంది. అనగా 1 క్వింటాల్ ధాన్యంలో రూ. 1905చొప్పున ఒక ఎకరానికి సాధారణంగా అంచనా వేసినప్పటికీ, రూ. 40 నుంచి 50 వేల వరకు రైతు నష్టపోతున్నాడు. ఇదేవిధంగా అన్ని పంటల్లోనూ రైతుకు నష్టం జరుగుతోంది. అందువల్లనే, స్వామినాథన్‌ కమిషన్ సిఫారసు సి2+50 శాతం ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని రైతు ఉద్యమం కోరుతోంది.


ప్రభుత్వం ఉత్పత్తిఖర్చులు అంచనా వేయటంలోనూ, మద్దతు ధరలు నిర్ణయించడంలోనూ అమలు చేస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఈ విధానాల పరిశీలనకు యూపీఏ ప్రభుత్వం 2013 ఏప్రిల్ 1న రమేష్‌ చంద్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ 2015 మార్చిలో ఇచ్చిన నివేదికలో, మద్దతు ధరలు నిర్ణయించే పద్ధతులలోని అనేక లోపాలు గుర్తించి 23 సిఫారసులు చేసింది. వాటిలో ఒక్కటి కూడా నేటికీ అమలు కాలేదు. ఈ సిఫారసులు అమలు చేస్తే ఉత్పత్తిఖర్చులు 20 నుంచి 30 శాతం పెరుగుతాయని, ఆ మేరకు మద్దతు ధరలు కూడా పెరుగుతాయని ప్రొఫెసర్ ఆర్. రాంకుమార్ (‘టాటా సామాజిక శాస్త్రాల సంస్థ’లోని ‘అభివృద్ధి అధ్యయనాల విభాగం’లో ప్రధాన ఆచార్యుడు) పేర్కొన్నారు.ఉత్పత్తిఖర్చులు తక్కువగా అంచనా వేసి, పెరిగిన ద్రవ్యోల్బణం కంటే తక్కువగా నిర్ణయించిన కనీస మద్దతు ధరలు సైతం మార్కెట్లో రైతులకు లభించడం లేదు. కొన్ని రాష్ట్రాలలో, అది కూడా ముఖ్యంగా ధాన్యం, గోధుమలు, కొంత మేరకు పప్పులు, నూనెగింజలను ప్రభుత్వం సేకరిస్తోంది. కనీస మద్దతుధర గత ఐదేళ్ళలో దేశంలో ధాన్యం సగటుధర కంటే తక్కువగా ఉందనీ, 2020–21లో మొక్కజొన్న ధర 26.4 శాతం తక్కువగా ఉందని ‘వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్’ (సీఏపీపీ) తన 2020–21 ఖరీఫ్ నివేదికలో పేర్కొన్నది. మద్దతు ధరల కంటే తక్కువ ధరకు అమ్ముకోవటం వల్ల ఏడాదికి కనీసం రూ. 1 నుంచి రూ. 2 లక్షల కోట్లు రైతాంగం నష్టపోతున్నట్లు అంచనా.


అందువల్లనే, కనీస మద్దతు ధరల హామీ చట్టం తీసుకురావాలనేది 2020 నవంబర్ 26 నుంచి సాగుతున్న రైతు ఉద్యమ డిమాండ్లలో ఒకటిగా ఉంది. నిజానికి ఇలాంటి చట్టం చేయాలనే డిమాండ్‌ కొత్తదేమీ కాదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అది చర్చల్లో ఉంది. వాజపేయి ప్రభుత్వం 2000 నవంబర్ 17న ‘ఆహారధాన్యాల దీర్హకాల విధానం’పై ప్రొఫెసర్ అభిజిత్‌ సేన్‌ నేతృత్వంలో ఏర్పరిచిన ఉన్నతస్థాయి కమిటీ తన నివేదికను 2002 జూలైలో ఇచ్చింది. ఉత్పత్తిఖర్చులు సి2 ప్రాతిపదికగా సీఏసీపీ అంచనా వేయాలని, కనీస మద్దతుధరలకు దేశవ్యాప్తంగా చట్టబద్ధత కల్పించాలని, సీఏసీపీని చట్టబద్ధ సంస్థగా గుర్తించాలనీ ఆ నివేదిక సిఫారసు చేసింది. మోదీ ఆధ్వర్యాన 2010లో ఏర్పరచిన ‘వినియోగదారుల వ్యవహారాలపై వర్కింగ్ గ్రూపు’ 2011లో ఇచ్చిన నివేదికలో కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించి, ప్రభుత్వ సేకరణ కొనసాగాలని సిఫారసు చేసింది. పార్లమెంటులో ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. ‘సీఏసీపీ’ తన 2015–16 నివేదికలో, వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు అమ్మే హక్కుకు చట్టబద్ధత కల్పిస్తూ చట్టం తీసుకురావచ్చుననీ, మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే ధర తగ్గినప్పుడు, ఆ వ్యత్యాసాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చునని పేర్కొంది.


‘కనీస మద్దతు ధరల గ్యారంటీ’ చట్టాన్ని తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తోంది. కనీస మద్దతు ధరలు, ప్రభుత్వ సేకరణ కొనసాగిస్తామని మోదీ హామీ ఇస్తున్నారు. చట్టాల అమలుకే గ్యారంటీ లేనప్పుడు నాయకుల హామీలు నీటి మూటల్లాంటివి. చట్టం ఉంటేనే కనీస ఆదాయానికి గ్యారంటీ లభిస్తుంది.


అభివృద్ధి చెందిన దేశాలు 2020 సంవత్సరంలో తమ వ్యవసాయోత్పత్తుల విలువలో 18.1 శాతాన్ని వివిధ సబ్సిడీల రూపంలో అందించాయి. భారతదేశంలో కనీస మద్దతు ధరలు ప్రపంచ మార్కెటులో కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయని, మొత్తంగా చూచినప్పుడు సబ్సిడీ లేకపోగా ప్రతికూలంగా 7.6 శాతం ఉందని, దీనివల్ల కేవలం 2020లో రూ. 2.75 లక్షల కోట్లు నష్టపోయారని, గత 2 దశాబ్దాలకు పైగా ఈ విధంగా నష్టపోతూనే ఉన్నారని ఓఈసీడీ ‘వ్యవసాయ నివేదిక- 2017’ పేర్కొన్నది. ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత, ప్రత్యేకంగా గత 20 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగమే ఇప్పటికీ కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు.


కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తే కేంద్ర బడ్జెట్‌లో సగానికంటే ఎక్కువ దానికే కేటాయించాల్సివస్తుందనే వాదన ఒకటి ఉంది. ఇది తప్పుడు వాదన. రైతులు తమ కుటుంబ అవసరాలు, పశువుల దాణా, విత్తనాల కోసం పోగా మిగిలిందే మార్కెట్లో అమ్ముతారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు అవసరమైనవి ఎలాగూ సేకరించాలి. మార్కెట్లో ఒక వేళ ధరలు ఎక్కువ ఉంటే ప్రభుత్వ సేకరణ అవసరం లేదు. మార్కెట్లో ధరల స్థిరీకరణకు 1/4 నుంచి 1/8 వంతు సరిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఖజానాపై భారం దాదాపు రూ. 1 నుంచి రూ. 1 1/2 లక్షల కోట్లకు మించదు. ప్రతి ఏడాది అనేక లక్షల కోట్ల రూపాయలు పారు బకాయిల కింద ఆశ్రిత పెట్టుబడిదారులకు రద్దు చేస్తున్న ప్రభుత్వానికి దీనిని సర్దుబాటు చేయడం పెద్ద సమస్య అవుతుందా? కాదు కాక కాదు. దారిద్ర్య నిర్మూలనకు, నిరుద్యోగ సమస్య పరిషారానికి, దేశీయమార్కెట్ విస్తరణకు, వ్యవసాయంలో సంక్షోభాన్ని అధిగమించటానికి రైతుల ఆదాయాన్ని పెంచడమే ఏకైక సరైన మార్గం. అందుకు, కనీస మద్దతుధరల హామీ చట్టం తప్పనిసరి.


వేములపల్లి వెంకట్రామయ్య

జాతీయ అధ్యక్షుడు

అఖిల భారత రైతు-కూలీ సంఘం

Updated Date - 2021-11-25T06:34:12+05:30 IST