తిరుపతి ఉప ఎన్నికలో మోదీ హవా సాగదు: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-01-17T18:44:20+05:30 IST

ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికలో మోదీ హవా సాగదు: రామకృష్ణ

కడప: తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా సాగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగే ట్రాక్టర్ల ర్యాలీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రైతుల ఉద్యమానికి ప్రపంచ దేశాలు సైతం మద్దతు తెలుపుతున్నాయన్నారు.  ప్రధాని మోదీ కార్పొరేట్ల పక్షమా.. రైతుల పక్షమో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మండిపడ్డారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీజేపీ రాజకీయ పార్టీనా లేక కుల పార్టీనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముద్రగడ కాళ్ల దగ్గరకు తీసుకెళ్లాడన్నారు. ముద్రగడ ఫొటో పెట్టుకొనే బీజేపీ తిరుపతిలో ఓట్లు అడుక్కోవాల్సి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. బీజేపీకి తిరుపతి ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. దాడులు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ నిద్రపోతోందా అని ప్రశ్నించారు. డీజీపీ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రస్ఫుటం చేస్తోందని రామకృష్ణ విమర్శించారు. 

Updated Date - 2021-01-17T18:44:20+05:30 IST