అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు... రిలయన్స్, ఫ్యూచర్ షేర్లు పతనం

ABN , First Publish Date - 2021-08-06T18:57:54+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు శుక్రవారం దారుణంగా దెబ్బతిన్నాయి.

అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు... రిలయన్స్, ఫ్యూచర్  షేర్లు పతనం

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫ్యూచర్ గ్రూప్ షేర్లు శుక్రవారం దారుణంగా దెబ్బతిన్నాయి. అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపధ్యంలో... ఈ షేర్లు పతనం దిశగా కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 1.7 శాతానికి పడిపోయి...  రూ. 2,098.75 కు చేరుకుంది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్, ఫ్యూచర్ కన్స్యూమర్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్, ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ సప్లై చైన్ అన్నీ కూడా... ఒక్కొక్కటి 10 శాతానికి పడిపోవడం గమనార్హం. మూడు దిగ్గజ కంపెనీల మధ్య జరుగుతున్న పోరులో సుప్రీం తీర్పు... ఈ రెండు కంపెనీలకు చుక్కలు చూపించింది.


ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, రిలయన్స్, ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్‌కు సంబంధించి రూ. 24,731 కోట్ల విలువ చేసే ఆస్తులను రిలయన్స్ సంస్థలో కలిపేయాలన్న ఆలోచనను అమెజాన్ తప్పుబడుతూ తమకు న్యాయం చేయాల్సిందిగా సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంోల... అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. కాగా...  తాము ఎలాంటి తప్పూ చేయలేదని ఫ్యూచర్ రీటైల్ సంస్థ సుప్రీంకోర్టుకు విన్నవించుకుంది. అమెజాన్ 2019 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్లలో 49 % వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఆ సమయంలో సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. తమ అనుమతి లేకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 29 ఇతర సంస్థలతో ఎలాంటి పొత్తూ పెట్టుకోకూడదన్న షరతుతో ఫ్యూచర్ గ్రూప్ నుంచి అమెజాన్ వాటాను కొనుగోలు చేసింది. అయితే ఈ నిబంధనను కాదని... ఫ్యూచర్ గ్రూప్... ఇటీవల రూ. 24,731 కోట్ల విలువైన ఆస్తులను రిలయన్స్ సంస్థలో కలిపేయడానికి సిద్ధమైంది. దీంతో అమెజాన్ సుప్రీంను ఆశ్రయించింది.  

Updated Date - 2021-08-06T18:57:54+05:30 IST