సుప్రీంలో ప్రత్యక్ష, వీడియో విచారణలు!

ABN , First Publish Date - 2021-10-22T09:16:41+05:30 IST

సుప్రీంకోర్టులో ప్రత్యక్ష విచారణలను పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ..

సుప్రీంలో ప్రత్యక్ష, వీడియో విచారణలు!

దీపావళి తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం: సీజే రమణ 

న్యూఢిల్లీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో ప్రత్యక్ష విచారణలను పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ గురువారం సమీక్షించారు. సీనియర్‌ న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబ్బల్‌, అభిషేక్‌ సింఘ్వీ, వికాస్‌ సింగ్‌, సుప్రీంకోర్టు అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్స్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మనోజ్‌ కుమార్‌ మిశ్రా తదితరులతో ఆయన దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ప్రస్తుతం బుధ, గురువారాల్లో పూర్తిగా ప్రత్యక్ష విచారణలు జరుగుతున్నప్పటికీ పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరు కావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యక్ష విచారణలతోపాటు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా దీపావళి సెలవుల తర్వాత పరిస్థితులను బట్టి ప్రత్యక్ష విచారణలను మిగతా రోజుల్లో కూడా ప్రారంభించే విషయంపై పరిశీలించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. నవంబరు 1 నుంచి నవంబరు 6 వరకు సుప్రీంకోర్టుకు  దీపావళి సెలవులు ప్రకటించారు.  ఈనెల 20 నుంచి విచారణలకు న్యాయవాదులు స్వయంగా హాజరు కావాలని, కోర్టు గదుల్లోనే విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. కోర్టు గదుల్లో కేవలం ఒకే న్యాయవాదిని అనుమతించడం సరైందికాదని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబ్బల్‌ బుధవారం ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ రమణ చెప్పారు.


ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై .. 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు సంబంధించి రూ.8లక్షల ఆదాయ పరిమితి నిబంధనను తిరిగి పరిశీలించే ఉద్దేశం ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని, రాజ్యాంగ నియమాలను పాటించారా లేదా అనేది నిర్ధారించుకోవడానికే ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. ఇదే అంశంపై విచారణ సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కేంద్రం అఫిడవిట్‌ దాఖలుచేయకపోవడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-10-22T09:16:41+05:30 IST