కేటాయింపుల ప్రకారం జీతాలివ్వండి: సుప్రీం

ABN , First Publish Date - 2020-04-09T09:28:18+05:30 IST

కేటాయింపుల ప్రకారం జీతాలివ్వండి: సుప్రీం

కేటాయింపుల ప్రకారం జీతాలివ్వండి: సుప్రీం

తెలంగాణ విద్యుత్‌ సంస్థల అభ్యంతరాలూ పరిశీలించాలని సూచన


అమరావతి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌ సంస్థలు ధర్మాధికారి కమిషన్‌ చేసిన కేటాయింపుల ప్రకారం ఉద్యోగులకు ముందు జీతాలు, పింఛన్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపుపై తెలంగాణ విద్యుత్‌ సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాల పరిశీలనకు ఈ ఆదేశాలు అడ్డంకి కావని, వాటిపై విడిగా పరిశీలన జరపాలని కూడా కోర్టు పేర్కొంది. ధర్మాధికారి కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తలెత్తిన వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన ఆదేశాల్లో 655 మంది ఉద్యోగులను ఏపీ విద్యుత్‌ సంస్థలకు... 584 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు ఈ కమిషన్‌ కేటాయించింది. తమకు కేటాయించిన వారిని తీసుకోవడానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు ఆమోదం తెలపగా... తెలంగాణ విద్యుత్‌ సంస్థలు మాత్రం ఈ కేటాయింపును ఒప్పుకోకుండా అభ్యంతరాలను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో ధర్మాధికారి కమిషన్‌ సుప్రీం కోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేసింది. తాము చేసిన కేటాయింపుల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలకు సంబంధిత ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో అందచేస్తే ఆ ప్రకారం అవి ఆ ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కమిషన్‌ కోరింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత ఇరు వైపులా ఈ ఉద్యోగుల కేటాయింపు, చేరికల ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషన్‌ పేర్కొంది. దీనికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపి ఆ మేరకు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2020-04-09T09:28:18+05:30 IST