కాలం చెల్లిన ద్రోహం

ABN , First Publish Date - 2021-06-02T08:45:19+05:30 IST

‘రాజద్రోహం’ లెక్కతేలుస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. మీడియా వర్గాలు, న్యాయ నిపుణులు, రాజకీయ ప్రముఖులు

కాలం చెల్లిన ద్రోహం

అది బ్రిటిష్‌ పాలన అవశేషం..

మీడియాపై రాజద్రోహం చెల్లదు

అది పత్రికా స్వేచ్ఛకు విఘాతం

స్పష్టంగా నిర్వచించాల్సిందే!

న్యాయ నిపుణుల ముక్తకంఠం

సుప్రీంకోర్టు నిర్ణయంపై హర్షం

‘ఏబీఎన్‌’ కేసులో ఆదేశాలకు జాతీయ స్థాయి ప్రాధాన్యం

ప్రముఖంగా ప్రచురించిన పత్రికలు, ప్రసార సాధనాలు

వార్తలు ప్రసారం చేయడం రాజద్రోహం కాదు: రోహత్గీ


న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘రాజద్రోహం’ లెక్కతేలుస్తామన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. మీడియా వర్గాలు, న్యాయ నిపుణులు, రాజకీయ ప్రముఖులు సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు. బ్రిటిష్‌ కాలపు క్రూర చట్టమైన ఐపీసీ ‘124-ఏ’కు కాలం చెల్లిందని, దానికి పాతర వేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇక... తమకు గిట్టని వారితోపాటు, వారి అభిప్రాయాలు ప్రసారం చేసిన మీడియాపైనా రాజద్రోహం కేసు పెట్టడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తేల్చి చెప్పారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ఏపీ సీఐడీ పోలీసులు పెట్టిన ‘రాజద్రోహం’ కేసులో నిందితులుగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ5 చానళ్లను కూడా చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు చానళ్లు వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.


దీంతో... రాజద్రోహం సెక్షన్‌ 124(ఏ) పరిధి, పరిమితులను స్పష్టంగా నిర్వచిస్తామని జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా... వార్తలు, కథనాలు ప్రచురించి, ప్రసారం చేసే మీడియాకు ఉన్న భావప్రకటన స్వేచ్ఛ కోణంలో ఈ సెక్షన్‌లోని నిబంధనలకు భాష్యం చెబుతామని తెలిపింది. ఈ తీర్పు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ద హిందూ, హిందూస్థాన్‌ టైమ్స్‌ వంటి పలు ఆంగ్ల పత్రికలు మంగళవారం సంచికలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.  ఉత్తరాదికి చెందిన జనసత్తా, హిందుస్థాన్‌, నవభారత్‌ టైమ్స్‌ వంటి హిందీ పత్రికల్లోనూ మొదటి పేజీలో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించాయి. ‘‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతిపై రాజద్రోహం కేసు చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టంగానే చెప్పింది.


ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది’ అని దాదాపు జాతీయ మీడియా మొత్తం తెలిపింది. ఏపీ సర్కారు తమపై అనధికార నిషేధం విధించిందని ఆ రెండు చానళ్లు పేర్కొన్నట్లుగా ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేర్కొంది. మీడియా విమర్శించినంత మాత్రాన రాజద్రోహం కాదని సుప్రీంకోర్టు పేర్కొందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది. ఏది రాజద్రోహమో, ఏది కాదో తేల్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు చెప్పినట్లు హిందూస్థాన్‌ టైమ్స్‌, హిందూ పత్రికలు రాశాయి. ఇక... సెక్షన్‌ 124 (ఏ) బ్రిటిష్‌ కాలం నుంచి అమలవుతున్న తీరు గురించి హిందూస్థాన్‌ టైమ్స్‌ పత్రిక సుదీర్ఘ వార్తాకథనాన్ని ప్రచురించింది.


కదిలిన ‘న్యాయం’

‘రాజద్రోహం’ పరిధి, పరిమితిని నిర్వచిస్తామన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలకా్ట్రనిక్‌ మీడియాతోపాటు ప్రముఖ వెబ్‌సైట్లు తమ వీక్షకులకు ప్రముఖంగా అందించాయి. దాదాపు అన్ని జాతీయ టీవీ చానళ్లు ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చాయి. న్యాయ వ్యవస్థకు సంబంధించిన వార్తలను, కథనాలను అందించే  ప్రముఖ వెబ్‌సైట్లు లైవ్‌ లా, బార్‌ అండ్‌ బెంచ్‌, ఇండియా లీగల్‌ అలైవ్‌తోపాటు ద ప్రింట్‌, ద ఫస్ట్‌ పోస్ట్‌ వెబ్‌సైట్లు జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రముఖంగా ప్రచురించాయి.  ‘బార్‌ అండ్‌ బెంచ్‌’ పలువురు న్యాయ కోవిదుల అభిప్రాయాలను ప్రత్యేకంగా సేకరించింది. ‘‘బ్రిటిష్‌ పాలన మిగిల్చిన సెక్షన్‌ 124ఏ అనే అవశేషాన్ని వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. చానళ్లలో వార్తలు ప్రసారం చేయడం రాజద్రోహం కాదు. ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటుకు పిలుపునిస్తేనే రాజద్రోహమవుతుంది.


రాజద్రోహం పేరిట భావ ప్రకటనా స్వేచ్ఛను లేదా విమర్శలను అణచివేయడం తగదు. గత కొన్నేళ్లుగా రాజద్రోహానికి సంబంధించిన చట్ట నిబంధనలు పోలీసుల చేతిలో సరికొత్త అస్త్రాలుగా మారడాన్ని మనం చూస్తున్నాం’’ అని మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీడియాకు ఊరట కల్పించిందని ఎన్డీటీవీ చానల్‌ తెలిపింది. ఇదే అంశంపై టైమ్స్‌ నౌ, మిర్రర్‌ నౌ ప్రత్యేక చర్చలు నిర్వహించాయి. ఇందులో  మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు,  మాజీ సొలిసిటర్‌ జనరల్స్‌, ప్రముఖ న్యాయవాదులు పాల్గొన్నారు. సెక్షన్‌ 124 (ఏ)ను నిర్వచించడం అవసరమని... కానీ, సమస్యల్లా దాని అమలులోనే ఉందని జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఏ ఖాన్‌ అన్నారు. ఇలాంటి కేసులు పరిష్కరించడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుందని తెలిపారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిలాంటి వ్యక్తులను విమర్శించినంత మాత్రాన రాజద్రోహం కాదని కేదార్‌ నాథ్‌ సింగ్‌ కేసులో  సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని మాజీ సొలిసిటర్‌ జనరల్‌ వికాస్‌ సింగ్‌ గుర్తు చేశారు.


‘నీలి మీడియా’ వికృతానందం!

సుప్రీం ఆదేశాలకూ వక్రభాష్యం

అసలు విషయం వదిలి ఏబీఎన్‌కు చుక్కెదురని వార్త


సుప్రీంకోర్టు ఉత్తర్వులకూ ‘నీలి మీడియా’ తనకు నచ్చిన విధంగా వక్రభాష్యం చెప్పుకొంది. సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో దర్యాప్తు నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించిందని,  స్టేపై స్పందించలేదని... ఏబీఎన్‌ చానల్‌కు చుక్కెదురైందని వికృతానందం పొందింది. అసలు విషయం ఏమిటంటే... ఏబీఎన్‌పై పెట్టిన కేసు పత్రికా స్వేచ్ఛను హరించేలా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు... మొత్తం రాజద్రోహం సెక్షన్‌నే సమీక్షించేందుకు సిద్ధమైంది.


మీడియాపై పాలకులు విచణారహితంగా రాజద్రోహం కేసులు పెడుతున్నారన్న అభిప్రాయంతో... దీనికి పరిధులు, పరిమితులు నిర్వచిస్తామని తేల్చిచెప్పింది. దీంతో ఈ విషయానికి జాతీయ ప్రాధాన్యం లభించింది. దాదాపు జాతీయ మీడియా మొత్తం దీనిని కీలకంగా భావించి, ప్రముఖంగా ప్రచురించాయి. ‘నీలి మీడియా’ మాత్రం కీలకమైన అంశాలను నామమాత్రంగా ప్రస్తావిస్తూ... ‘స్టేపై సుప్రీం స్పందించలేదు’ అంటూ అసలు విషయానికి ముసుగు వేసింది.

Updated Date - 2021-06-02T08:45:19+05:30 IST