హద్దులు దాటారు!

ABN , First Publish Date - 2020-10-13T08:08:53+05:30 IST

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలపై భారత ప్రధాన

హద్దులు దాటారు!

జగన్‌పై చర్యలు తీసుకోండి

కోర్టుల ప్రతిష్ఠ దెబ్బతీసే యత్నం

సుప్రీం కోర్టులో పిటిషన్‌ 

జగన్‌పై చర్యలు తీసుకోండి

కోర్టుల ప్రతిష్ఠ దెబ్బతీసే యత్నం

సుప్రీం కోర్టులో పిటిషన్‌ 


న్యూఢిల్లీ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డేకు చేసిన ఫిర్యాదును బహిర్గతం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీనియర్‌ న్యాయవాది సునీల్‌ కుమార్‌ సింగ్‌ తరఫున అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ముక్తి సింగ్‌ సోమవారం ఈ పిటిషన్‌ దాఖలు చే శారు. జగన్‌పై తగిన చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాల్సిందిగా షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని, భవిష్యత్తులో  ఇలా విలేకరుల సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు.


‘‘దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను దిగజార్చేందుకు జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నం చేశారు. గౌరవనీయమైన న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణలు చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్న పరిమితులను అతిక్రమించారు. రాజ్యాంగంలోని 121, 211 అధికరణల కింద వివక్షాపూరితంగా అవినీతి ఆరోపణలు చేయడం నిషిద్ధం. సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ చర్చ జరగరాదని రాజ్యాంగం పేర్కొంది. 


రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణ కింద లభించిన భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్‌ స్వాతంత్ర్యానికి కూడా కోర్టుల ధిక్కారం, అప్రతిష్ఠకు సంబంధించి సహేతుక ఆంక్షలున్నాయి. నేటి సమాజంలో ఎటువంటి ప్రచారమైనా గంటల్లో వ్యాపిస్తోంది. దీని వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతినడమేకాక, న్యాయవ్యవస్థపై సాధారణ ప్రజానీకానికి విశ్వాసం పోతుంది’’ అని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామిక సమాజంలో ఒక కోర్టు ప్రజలకు ప్రేరణ కలిగించాలని, ఈ విశ్వాసాన్నే ప్రమాదంలో పడేస్తున్నారని ఆయన తెలిపారు.


రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన ఒక ముఖ్యమంత్రి న్యాయవ్యవస్థను గౌరవించక తప్పదని, ఒక  న్యాయమూర్తి న్యాయవ్యవస్థకు, ప్రజలకు  సుదీర్ఘకాలం  సేవ చేస్తున్న తరుణంలో ఆరోపణలు చేసేందుకు ఈ సమయాన్ని ఎంచుకోవడం తీవ్ర అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం దేశం ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిహద్దుల వెలుపలి నుంచి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యాతరహితంగా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం వ్యవస్థపైనే ప్రజానీకానికి నమ్మకం కోల్పోయేలా చేస్తుంది’’ అని పిటిషనర్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-13T08:08:53+05:30 IST