కమిటీ సభ్యులను కించపరుస్తారా?

ABN , First Publish Date - 2021-01-21T06:17:32+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నియమించిన కమిటీ స

కమిటీ సభ్యులను కించపరుస్తారా?

  • రైతు సంఘాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం 


న్యూఢిల్లీ, జనవరి 20: కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నియమించిన కమిటీ సభ్యులపై కొన్ని రైతు సంఘాలు నిందలు వేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీని తామే నియమించామని, ఆ కమిటీకి ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని తెలిపింది. అలాంటి వారిని కించపరిచేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ సభ్యులు రైతు సంఘాల ఆందోళనలను తెలుసుకొని, తమకు నివేదిక మాత్రమే ఇస్తారని స్పష్టం చేసింది. కమిటీ సభ్యుడైన భూపీందర్‌సింగ్‌ మాన్‌ ఇప్పటికే కమిటీ నుంచి వైదొలగగా.. మిగిలిన  ముగ్గురిని కూడా తొలగించాలని కోరుతూ రాజస్థాన్‌కు చెందిన రైతు సంఘం కిసాన్‌ మహాపంచాయత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కమిటీ సభ్యులు కొత్త వ్యవసాయ చట్టాలకు అనుకూలమంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది సమర్పించిన వివరాలన్నీ మీడియా కథనాల ఆధారంగా పేర్కొన్నవేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కిసాన్‌ మహాపంచాయత్‌ వేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా గణతంత్ర దినోత్సవం రోజున రైతు సంఘాలు నిర్వహించతలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ర్యాలీకి అనుమతివ్వాలా? వద్దా? అనేది పోలీసులు తేల్చాల్సిన అంశమని, దీనిపై తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేంద్రం పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. మరోవైపు ట్రాక్టర్ల ర్యాలీకి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్న ఢిల్లీ పోలీసుల సూచనను రైతు సంఘాల నేతలు వ్యతిరేకించారు. 

Updated Date - 2021-01-21T06:17:32+05:30 IST