ఈవీఎంల రాజ్యాంగబద్ధతపై పిల్... పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం...

ABN , First Publish Date - 2022-01-19T23:43:36+05:30 IST

దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను వాడటంలో

ఈవీఎంల రాజ్యాంగబద్ధతపై పిల్... పరిశీలనకు సుప్రీంకోర్టు అంగీకారం...

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లను వాడటంలో రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరపడం గురించి పరిశీలించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ఈవీఎంలను వాడటాన్ని ప్రశ్నిస్తూ, బ్యాలట్ పేపర్లను ఉపయోగించేవిధంగా ఆదేశించాలని కోరింది. 


న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఉత్తర ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ శాసన సభ ఎన్నికలు జరుగుతున్నందువల్ల తన పిటిషన్‌పై విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. ఈ ఎన్నికల్లో బ్యాలట్ పేపర్లను ఉపయోగించేవిధంగా ఆదేశించాలని కోరారు. ఈవీఎంలను ప్రవేశపెట్టేందుకు అనుమతిస్తున్న నిబంధనను పార్లమెంటు ఆమోదించలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 61ఏ ప్రకారం ఈవీఎంలను ఎన్నికల్లో ప్రవేశపెట్టారని, పార్లమెంటు ఆమోదించని ఈ సెక్షన్‌ను రుద్దకూడదని అన్నారు.  ఈ నిబంధన రాజ్యాంగవిరుద్ధం, శూన్యం అని ప్రకటించాలని కోరారు. 


దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, పిటిషన్‌ను పరిశీలిస్తామని చెప్పారు. దీనిని వేరొక ధర్మాసనానికి నివేదిస్తామని చెప్పారు. 

Updated Date - 2022-01-19T23:43:36+05:30 IST