ఎన్డీయే పరీక్షకు మహిళలకు సుప్రీం అనుమతి

ABN , First Publish Date - 2021-08-18T19:12:12+05:30 IST

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు

ఎన్డీయే పరీక్షకు మహిళలకు సుప్రీం అనుమతి

న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు  తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. సెప్టెంబరు 5న జరిగే  ఈ పరీక్షకు సంబంధించిన ఈ ఆదేశాల ఉద్దేశం అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలని యూపీఎస్‌సీని ఆదేశించింది. తగిన విధంగా సవరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయాలని తెలిపింది. 


ఎన్డీయే పరీక్షకు హాజరయ్యేందుకు మహిళలను అనుమతించాలని కోరుతూ కుశ్ కల్రా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తాత్కాలిక ఆదేశాలను జారీ చేసింది. 


పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ చిన్మయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపిస్తూ, కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్‌ను ప్రస్తావించారు. ఎన్డీయేకు మహిళలను అనుమతించే విషయం పూర్తిగా విధానపరమైన నిర్ణయమని, దీనిలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, ఈ పరీక్షకు మహిళలను అనుమతించకపోవడం వల్ల వారి ప్రగతికి, కెరీర్‌కు  ఇబ్బందులేవీ ఉండబోవని కేంద్ర ప్రభుత్వం చెప్తోందన్నారు. 


దీనిపై జస్టిస్ కౌల్ స్పందిస్తూ అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఉద్దేశించి, ‘‘మీరు ఈ దిశలో ఎందుకు వెళ్తున్నారు? సైన్యంలో పర్మినెంట్ కమిషన్‌ను మహిళలకు వర్తింపజేస్తూ జస్టిస్ చంద్రచూడ్ తీర్పు చెప్పిన తర్వాత సైతం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఇది ఇక నిరాధారం! దీనిని అసమంజసంగా భావిస్తున్నాం’’ అని చెప్పారు. 


‘‘న్యాయపరమైన ఆదేశాలు జారీ అయితేనే సైన్యం స్పందిస్తుందా? లేకపోతే లేదా? దాన్ని మీరు కోరుకుంటే అలాగే చేస్తాం! తీర్పు వచ్చే వరకు సైన్యం దేనినీ తనంతట తాను ఏదైనా చేయడాన్ని నమ్మదనేది నేను హైకోర్టులో ఉన్నప్పటి నుంచి నా అభిప్రాయం’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. 


ఈ నేపథ్యంలో అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, సైన్యంలో మహిళలకు పర్మినెంట్ కమిషన్‌ను ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై జస్టిస్ కౌల్ మాట్లాడుతూ, ‘‘అందుకు మీకు ధన్యవాదాలు చెప్పేది లేదు. దాన్ని మీరు వ్యతిరేకిస్తూనే ఉన్నారు! ఆదేశాలు జారీ అయ్యే వరకు మీరు ఏమీ చేయలేదు! నావికా దళం, వాయు సేన చాలా ముందంజలో ఉన్నాయి! అమలు చేయకూడదనే పక్షపాతంతో సైన్యం ఉన్నట్లుంది!’’ అన్నారు. 


ఐశ్వర్య భాటి మాట్లాడుతూ, అలాంటిదేమీ లేదన్నారు. సైన్యంలో ప్రవేశించేందుకు మూడు పద్ధతులు ఉన్నాయన్నారు. ఆర్మీ-ఎన్డీయే, ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) ద్వారా సైన్యంలో ప్రవేశించవచ్చునన్నారు. ఓటీఏ, ఐఎంఏ ద్వారా మహిళలు సైన్యంలో ప్రవేశించేందుకు అనుమతి ఉందన్నారు. 


ధర్మాసనం స్పందిస్తూ కో-ఎడ్యుకేషన్ వల్ల సమస్య ఏమిటని ప్రశ్నించింది. ఏఎస్‌జీ ఐశ్వర్య మాట్లాడుతూ, మొత్తం వ్యవస్థ అలా ఉందన్నారు. ఇది విధానపరమైన నిర్ణయమని, దీనిలో జోక్యం చేసుకోలేమని చెప్పే ప్రయత్నం చేశారు. 


విధాన నిర్ణయం లింగ వివక్షపై ఆధారపడిందని ధర్మాసనం పేర్కొంది. నిర్మాణాత్మక దృక్పథాన్ని అనుసరించాలని ప్రతివాదులను ఆదేశించింది. ఆలోచనా ధోరణి మారడం లేదని మండిపడింది. పర్మినెంట్ కమిషన్‌కు సంబంధించిన కేసులో హైకోర్టు సమక్షంలో హాజరైన సొలిసిటర్ జనరల్ సైన్యాన్ని ఒప్పించలేకపోయారని పేర్కొంది. సుప్రీంకోర్టు అనేక అవకాశాలను ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది. మహిళలను క్రమబద్ధీకరించకుండా, ఐదేసి సంవత్సరాలు పని చేయించుకుని,  పర్మినెంట్ కమిషన్ ఇవ్వకుండా వదిలిపెడుతున్నారని దుయ్యబట్టింది. వాయు సేన, నావికా దళం ఉదారంగా ఉన్నాయని ప్రశంసించింది. స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు కల్పించే విశాలమైన సూత్రాలను అమలు చేయాలని తెలిపింది. 



Updated Date - 2021-08-18T19:12:12+05:30 IST