లాయర్‌ను రూ.25 లక్షలు డిపాజిట్ చేయమన్న సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2020-06-05T01:10:12+05:30 IST

వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడానికి సంబంధించిన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారంనాడు విచారణ..

లాయర్‌ను రూ.25 లక్షలు డిపాజిట్ చేయమన్న సుప్రీంకోర్టు

ముంబై: వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చడానికి సంబంధించిన ఓ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారంనాడు విచారణ జరిపింది. ట్రాన్స్‌పోర్టు ఖర్చు కింద రూ.25 లక్షలు డిపాజిట్ చేసేందుకు పిటిషనర్‌ను‌ అనుమతించింది. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన పలువురు వలస వలస కార్మికులను ఉత్తరప్రదేశ్‌ వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం మార్గం సుగమం చేసింది.


ఉత్తరప్రదేశ్‌లోని బస్తి, సంత్ కబీర్ నగర్‌కు చెందిన వలస కార్మికులను సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ట్రావెల్ ఏర్పాట్లు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ముంబై హైకోర్టు అడ్వకేట్ సఘీర్ అహ్మద్ ఖాన్ 15 రోజుల క్రితం కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం రూ.25 లక్షలు డిపాజిట్ చేసేందుకు కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. గురువారంనాడు ఈ పిటిషన్‌ విచారణకు రావడంతో... 'మీరు డిపాజిట్ చెల్లిచేందుకు సిద్ధంగా ఉన్నారా?' అని కోర్టు ప్రశ్నించింది. సిద్ధమేనని న్యాయవాది సమాధానమిచ్చారు. దీంతో ఎస్‌సీ రిజిస్ట్రీలో డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలని ఖాన్‌ను కోర్టు ఆదేశించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు చెల్లించేందుకు పిటిషనర్ సుముఖంగా లేనందున వారంలోగా ఆ మొత్తాన్ని ఎస్‌సీ రిజిస్ట్రీకి చెల్లించాలని  కోర్టు ఆదేశిస్తూ కేసును జూన్ 12కు వాయిదా వేసింది.


వలస కార్మికుల కోసం ఎందుకు ముందుకొచ్చానంటే...

వలస కార్మికులను ఆదుకునేందుకు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందో ఖాన్ వివరిస్తూ, మే 4 తర్వాత లాక్‌డౌన్‌ను పొడిగించడంతో అనేక మంది వలస కార్మికులు తనకు ఫోన్లు చేశారని చెప్పారు. 'నేను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించాను. ఏం చేయవచ్చనేది తెలుసుకునేందుకు యూపీ ప్రభుత్వ నోడల్ అధికారికి ఫోన్ చేశాను. సమాధానం ఇవ్వలేదు. టిక్కెట్ల ఖర్చులో 15 శాతం ఎవరు భరించాలనే విషయంలోనూ రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయి. టిక్కెట్ల ఖర్చు నిమిత్తం రూ.25 లక్షలు చెల్లిస్తానంటూ మే 9న యూపీ నోడల్ అధికారి, ముఖ్యమంత్రికి లేఖ రాశాను. హాస్యాస్పదమైన సమాధానాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ముంబై పోలీసు స్టేషన్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాను. వాళ్లు ఒక్కో వలస కార్మికుడికి చెందిన రెండేసి ఫోటోలు ఇమ్మన్నారు. దీంతో సుప్రీంకోర్టునే ఆశ్రయించాలని నిర్ణయించాను. మే 13న పిటిషన్ వేశాను. 15న విచారణకు వచ్చింది' అని ఖాన్ తెలిపారు. తనకు రాష్ట్ర ప్రభుత్వంపై అంతగా నమ్మకం లేదని,  సుప్రీంకోర్టుపై పూర్తి నమ్మకం ఉండటంతో కోర్టులో సొమ్ము డిపాజిట్ చేసేందుకు ముందుకు వచ్చానని చెప్పారు.

Updated Date - 2020-06-05T01:10:12+05:30 IST