సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ తొలి భేటీ ఈ నెల 19న

ABN , First Publish Date - 2021-01-18T01:23:18+05:30 IST

నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తొలి సమావేశం

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ తొలి భేటీ ఈ నెల 19న

న్యూఢిల్లీ : నూతన సాగు చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తొలి సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. ఈ చట్టాల అమలును సుప్రీంకోర్టు ఈ నెల 11న నిలిపేసి, ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్న రైతులు దాదాపు 50 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాలనాడు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. 


ఈ నెల 11న నూతన సాగు చట్టాల అమలును నిలిపేసిన సుప్రీంకోర్టు నలుగురు సభ్యులతో ఓ  కమిటీని నియమించింది. ఈ కమిటీ నుంచి భారతీయ కిసాన్ యూనియన్-మాన్ అధ్యక్షుడు బీఎస్ మాన్ వైదొలగారు. మరొక సభ్యుడు అనిల్ ఘన్వత్ ఆదివారం మాట్లాడుతూ, తమ కమిటీ తొలి సమావేశం ఈ నెల 19న జరుగుతుందని చెప్పారు. పూసా క్యాంపస్ (ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్)లో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. భావి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ సమావేశంలో కేవలం కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొంటారని తెలిపారు. సుప్రీంకోర్టు నియమించిన సభ్యుల్లో ఒకరు వైదొలగారని, ఆయన స్థానంలో మరొకర్ని సుప్రీంకోర్టు నియమించకపోతే, ప్రస్తుతం ఉన్న ముగ్గురు సభ్యులే ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. తమ కమిటీ నిర్వహించవలసిన విధి విధానాలు తమకు అందాయని, జనవరి 21 నుంచి కార్యాచరణను ప్రారంభిస్తామని చెప్పారు. నిరసన తెలుపుతున్న రైతులతో ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతుండటాన్ని విలేకర్లు ప్రస్తావించినపుడు ఘన్వత్ మాట్లాడుతూ, తమ కమిటీ కృషి వల్ల కానీ, ప్రభుత్వ చర్చల వల్ల కానీ ఓ పరిష్కారం లభించడం తమకు సమస్య కాదన్నారు. ‘‘ప్రభుత్వ చర్చలు కొనసాగనివ్వండి, మాకు అప్పగించిన బాధ్యతపై మేం దృష్టి పెడతాం’’ అన్నారు. 


ఈ కమిటీలో ప్రస్తుతం ఘన్వత్‌తోపాటు అశోక్ గులాటీ, ప్రమోద్ కుమార్ జోషీ ఉన్నారు. సాగు చట్టాలు, రైతుల నిరసనలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. ఈ సందర్భంగా ఈ కమిటీ నుంచి బీఎస్ మాన్ వైదొలగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలావుండగా దాదాపు 40 రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిసార్లు చర్చలు జరిపింది. అయితే ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతుండగా, రద్దు చేయడం మినహా, ఇతర సంస్కరణలను కోరాలని ప్రభుత్వం చెప్తోంది. 



Updated Date - 2021-01-18T01:23:18+05:30 IST