మూడో ప్రభంజనానికి ఆక్సిజన్‌తో సిద్దంకండి : కేంద్రానికి సుప్రీం సలహా

ABN , First Publish Date - 2021-05-06T21:47:27+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందని హెచ్చరికలు

మూడో ప్రభంజనానికి ఆక్సిజన్‌తో సిద్దంకండి : కేంద్రానికి సుప్రీం సలహా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి మూడో ప్రభంజనం మరింత వికృతంగా ఉండబోతోందని హెచ్చరికలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అప్రమత్తం చేసింది. ఇప్పుడు సిద్ధమైతే రాబోయే ప్రభంజనాన్ని దీటుగా ఎదుర్కొనగలుగుతామని తెలిపింది. ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ పంపిణీ విధానాన్ని సమీక్షించుకోవాలని పేర్కొంది. ఢిల్లీ నగరానికి ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ సలహా ఇచ్చింది. 


ఢిల్లీలోని కోవిడ్ రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళికను సుప్రీంకోర్టు పరిశీలించింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించినప్పటికీ, తాము రోజుకు 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేశామని తెలిపింది. ఢిల్లీ నగరంలో తగినంత ఆక్సిజన్ నిల్వ ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైందని పేర్కొంది. 


సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను ఉపయోగించే ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో అధ్యయనం జరిగిందని, ఆసుపత్రుల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఆక్సిజన్ నిల్వ ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు. బుధవారం పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఢిల్లీ నగరానికి చేరిందని, దీనిని ఇంకా పంపిణీ చేయలేదని అన్నారు. అన్‌లోడింగ్‌కు ఎక్కువ సమయం పడుతోందన్నారు. 


జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఫార్ములాను పూర్తిగా మార్చవలసిన అవసరం ఉందన్నారు. ఈ ఫార్ములాను రూపొందించే సమయానికి ఆసుపత్రికి వెళ్ళిన ప్రతివారికీ ఐసీయూ కానీ, వెంటిలేటర్ కానీ అవసరం లేదని, ఆసుపత్రికి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ ఆక్సిజన్ బెడ్ అవసరం లేదని అన్నారు. ఇళ్ళ వద్దే ఉండాలని, తాత్కాలికంగా ఇంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలని  చాలా మందిని కోరిన సంగతిని గుర్తు చేశారు. ఢిల్లీకి అవసరమైనదానిని తక్కువగా అంచనా వేసినట్లు ఈ ప్రణాళిక వెల్లడిస్తోందన్నారు. ఆడిట్ అవసరమని అంగీకరిస్తామని, అయితే దీనిని లోతుగా పరిశీలించాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు కూడా సరైన ఫార్ములా అవసరమని తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. 


ఇప్పుడు మనం చేయవలసినది యావత్తు భారత దేశం అవసరాలకు తగిన ప్రణాళికను రూపొందించడమని చెప్పారు. ఆక్సిజన్ ఆడిట్ జరగాలని, ఆక్సిజన్ కేటాయింపుల కోసం ప్రాతిపదికను మరోసారి మదింపు చేయవలసిన అవసరం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఇప్పుడు మనం కోవిడ్-19 మహమ్మారి రెండో దశలో ఉన్నామని, రాబోయే మూడో దశ మరింత విభిన్నంగా ఉండవచ్చునని అన్నారు. మనం ఇప్పుడే సిద్ధమైతే మూడో దశను ఎదుర్కొనగలుగుతామని చెప్పారు. ఓ రాష్ట్రానికి ఆక్సిజన్‌ను కేటాయించడం గురించి మాత్రమే కాదని, సరైన రీతిలో ఆక్సిజన్ ఆడిట్ జరగడం కూడా ముఖ్యమైనదేనని చెప్పారు. ఆక్సిజన్ పంపిణీకి సరైన మార్గదర్శకాలను రూపొందించాలన్నారు. అందుకే మిగిలిన రాష్ట్రాల గురించి కూడా చూడాలని చెప్పానన్నారు. 


Updated Date - 2021-05-06T21:47:27+05:30 IST