మళ్లీ లాక్‌డౌన్‌ను పరిశీలించండి

ABN , First Publish Date - 2021-05-04T07:17:45+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది...

మళ్లీ లాక్‌డౌన్‌ను పరిశీలించండి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం సూచన
  • నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చూడండి
  • వైరస్‌ కట్టడికి తీసుకోబోయే చర్యలను చెప్పండి
  • భారీ సభలు, సూపర్‌ స్ర్పెడర్లను నిషేధించండి
  • అడ్మిషన్లపై జాతీయ పాలసీ రూపొందించండి
  • టీకా ధర విధానాన్ని పునఃపరిశీలించండి

న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని లాక్‌డౌన్‌ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సూచించింది. ఒకవేళ లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయిస్తే నిరుపేదలకు ఇబ్బంది లేకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. కొవిడ్‌ కాలంలో నిత్యావసర వస్తువులు, సేవలకు సంబంధించిన అంశాన్ని సుమోటోగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై 64 పేజీల తీర్పును సుప్రీం కోర్టు వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసింది. ‘‘కరోనా కేసుల కట్టడికి ఏమేం చర్యలు తీసుకున్నారో వివరించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేం గట్టిగా కోరుతున్నాం’’ అని పేర్కొంది. స్థానిక గుర్తింపు కార్డు లేదని  ఆస్పత్రి సౌకర్యం, మందులు అందకుండా ఏ రోగి మరణించే పరిస్థితి తలెత్తకుండా చూడాలని కోర్టు నిర్దేశించింది. ఆస్పత్రుల్లో అడ్మిషన్లపై 2 వారాల్లో జాతీయ విధానం రూపొందించాలంది.  రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ఆక్సిజన్‌ నిల్వలను పెంచాలని, అసాధారణ పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్‌ లభించేలా చూడాలని ఆదేశించింది. రెమ్‌డెసివిర్‌, టోసిలిజుమాబ్‌ వంటి మందులను అత్యధిక ధరలకు అమ్ముతున్నవారిని గుర్తించి, వారి పై చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.18-44 సంవత్సరాల వారి కి ఇచ్చే టీకా ధర విధానాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.  రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులు టీకా తయారీ కంపెనీలతోనే చర్చించుకోవాలని చెప్పడం గందరగోళానికి కారణమవుతుందని అభిప్రాయపడింది.


Updated Date - 2021-05-04T07:17:45+05:30 IST