కేంద్రంపై మరోసారి మండిపడిన Supreme Court

ABN , First Publish Date - 2021-05-07T17:36:17+05:30 IST

ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తీరును సుప్రీంకోర్టు మరోసారి

కేంద్రంపై మరోసారి మండిపడిన Supreme Court

న్యూఢిల్లీ : ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది. ఢిల్లీ రాష్ట్రానికి రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని తాను ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సమీక్షించే వరకు లేదా సవరించే వరకు కచ్చితంగా అమలు చేయవలసిందేనని తెలిపింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా విరుచుకుపడింది. 


సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయడం లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపింది. తన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని, నిర్బంధం విధించే ఆదేశాలను జారీ చేసే విధంగా తనను ప్రేరేపించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రోజుకు 700 మెట్రిక్ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలను పాటించాలని అధికారులను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 


కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.  కోవిడ్-19 రోగుల్లో కొందరు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తమకు సరిపడినంత ఆక్సిజన్‌ను సరఫరా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఢిల్లీ రాష్ట్రానికి రోజుకు కనీసం 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని ఆదేశించింది. దాచడానికి ఏమీ లేనట్లయితే, కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను రాష్ట్రాలకు ఏ విధంగా కేటాయింపులు, పంపిణీ చేస్తోందో పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పింది. 


Updated Date - 2021-05-07T17:36:17+05:30 IST