వీడిన ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-01-26T05:48:20+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఓకే చెప్పడం, ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ సోమవారం మరో షెడ్యూలు జారీ చేసింది.

వీడిన ఉత్కంఠ

పంచాయతీ పోరుకు సుప్రీంకోర్టు గ్రీనసిగ్నల్‌

ఎన్నికల కసరత్తు వేగం పెంచిన ఎస్‌ఈసీ 

నాలుగో విడతగా తొలి విడత షెడ్యూలు

29 నుంచి పల్లెపోరు షురూ

తాజాగా నాలుగు విడతల షెడ్యూలు జారీ 

ధర్మాసనం తీర్పుపై రాజకీయ పక్షాలు హర్షం

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెట్టు దిగి వచ్చేనా..?


 పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు ప్రకారం నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా వ్యాక్సినేషన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని, హైకోర్టు తీర్పును రద్దు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని ద్విసభ్య ధర్మాసనం సోమవారం తోసిపుచ్చింది. ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదంటూ తేల్చి చెప్పింది. మరోపక్క రాష్ట్ర ఎన్నికల సంఘం వేగం పెంచింది. సోమవారం ప్రారంభం కావాల్సిన తొలి విడత ఎన్నికల నోటిఫికేషన జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు జారీ చేయకపోవడం.. ఎన్నికల ఏర్పాట్లు కూడా చేయకపోవడం వల్ల తొలి విడత ఎన్నికలను నాలుగో విడతకు మార్పు చూస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో ఈనెల 29న తొలి విడత ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. సుప్రీం ధర్మాసనం తీర్పుపై రాజకీయ పక్షాలు సర్వత్రా హర్హం వ్యక్తం చేశాయి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఈ తీర్పు గట్టిపునాది వంటిందని అంటున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పట్టువీడి ఎన్నికలకు సహకరిస్తుందా..? అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. 


(కడప-ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఓకే చెప్పడం, ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ సోమవారం మరో షెడ్యూలు జారీ చేసింది. దీంతో జిల్లా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం నోటిఫికేషన జారీ కావాల్సిన కడప, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 13 మండలాల్లో 220 పంచాయతీల ఎన్నికలు తాజా షెడ్యూల్‌ ప్రకారం నాలుగో విడతగా ఫిబ్రవరి 10వ తేదీకి మార్చారు. 29న మొదలు కావాల్సిన ఫేజ్‌-2ను ఫేజ్‌-1గా, ఫిబ్రవరి 2న మొదలు కావాల్సిన ఫేజ్‌-3 ఫేజ్‌-2గా, ఫిబ్రవరి 6న మొదలు కావాల్సిన ఫేజ్‌-4ను ఫేజ్‌-3గా మార్పు చేశారు. ఈనెల 23న నోటిఫికేషన జారీ చేయాల్సి ఉన్న ఫేజ్‌-1 ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 10న ఫేజ్‌-4గా జరిపేలా షెడ్యూలులో మార్పులు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన జారీ చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం జిల్లాలో ఈనెల 29న జమ్మలమడుగు డివిజనలో 5, కడప డివిజనలో ఒకటి, రాజంపేట రెవెన్యూ డివిజనలో 8 మండలాలు కలిపి 14 మండలాల్లో తొలి విడత ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. 


ప్రభుత్వం సహకరిస్తుందా..?:

స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిందే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిందుకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎన్నికల నిర్వహణపై వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం తొలి విడత ఎన్నికల ప్రక్రియ జమ్మలమడుగు, కడప డివిజన్లలో 13 మండలాల పరిధిలో 220 పంచాయతీల్లో స్థానిక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నోటిషికేషన జారీ చేయాల్సి ఉండేది. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాలు సహాయ నిరాకరణతో ఒక్క పంచాయతీలో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు. నోటిఫికేషన జారీ చేయలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి మండలం కేంద్రం చక్రాయపేట పంచాయతీలో తమ అభ్యర్థితో నామినేషన వేయించేందుకు వెళితే.. నామినేషన పత్రాలు రాలేదు, రిటర్నింగ్‌ అధికారిని నియమించలేదు, ఎన్నికల ప్రక్రియ మొదలే కాలేదని మండల అధికారులు చెప్పడంతో ఆయన వెనుదిరిగారు. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం గౌరవించి ఎన్నికల నిర్వహణకు సహకరిస్తుందా..? 29న తొలి విడత నోటిఫికేషన జిల్లా రిటర్నింగ్‌ అధికారి జారీ చేస్తారా..? మళ్లీ కొర్రీలు పెట్టి సహాయ నిరాకరణ చేస్తారా..? ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ప్రభుత్వం పట్టువీడి ఎన్నికల నిర్వహణకు జై కొడితే కడప గడపన పల్లెపోరు ఆసక్తికరంగా మారనుంది. 


నాలుగు విడతల్లో ఎన్నికలు జరిగే మండలాలు ఇవే

తొలి విడత రెండోవిడత మూడో విడత నాలుగో విడత

జమ్మలమడుగు డివిజన కడప డివిజన రాజంపేట డివిజన జె.మడుగు డివిజన

----------------------- --------------- ------------------------ ----------------------

చాపాడు రాయచోటి రైల్వే కోడూరు పులివెందు

మైదుకూరు గాలివీడు ఓబులవారిపల్లె సింహాద్రిపురం

దువ్వూరు చిన్నమండెం చిట్వేలి తొండూరు

ప్రొద్దుటూరు సంబేపల్లి పెనగలూరు వేంపల్లి

రాజుపాలెం లక్కిరెడ్డిపల్లె పుల్లంపేట వేముల

కడప డివిజన రామాపురం రాజంపేట లింగాల

------------------ కమలాపురం సిద్ధవటం జమ్మలమడుగు

ఖాజీపేట వీఎనపల్లె ఒంటిమిట్ట కొండాపురం

రాజంపేట డివిజన పెండ్లిమర్రి నందలూరు ముద్దునూరు

--------------------- సీకేదిన్నె కడప డివిజన మైలవరం

బద్వేలు వల్లూరు ------------------ పెద్దముడియం

అట్లూరు చెన్నూరు టి.సుండుపల్లె కడప విడిజన

బి.కోడూరు -- వీరబల్లి ------------------

గోపావరం -- -- చక్రాయపేట

పోరుమామిళ్ల -- -- ఎర్రగుంట్ల

కాశినాయన -- -- --

కలసపాడు -- -- --

బి.మఠం -- -- --


జిల్లాలో పంచాయతీలు, ఓటర్ల వివరాలు

మండలాలు 50

పంచాయతీలు 807

వార్డులు 7,900

ఓటర్లు 14,70,900

పురుషులు 7,27,498

మహిళలు 7,43,290

 ఇతరులు 112

పోలింగ్‌ కేంద్రాలు 7,896

సమస్యాత్మక కేంద్రాలు 831

అత్యంతసమస్యాత్మక కేంద్రాలు 943

ఎన్నికలకు కావాల్సిన సిబ్బంది 18,600


ప్రజాస్వామ్మ పరిరక్షణకు నిదర్శనం 

- ఆర్‌.శ్రీనివాసరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కడప

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనం. జగన లాంటి ప్రభుత్వాలు ఏర్పడి రాజ్యాంగంపై ప్రమాణాలు చేసి పదవిలోకి వచ్చాక రాజ్యంగ వ్యవస్థలపైనే ఎదురు దాడి చేస్తున్నారు. ఈ తీర్పు జగన సర్కారుకు చెంపపెట్టు లాంటిదే. రాజ్యంగ వ్యవస్థలను గౌరవించడం నేర్పుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాను. జిల్లాలో అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులను బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 


ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాలి 

- యల్లారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ తప్పక జరగాల్సిందే. తీర్పును గౌరవించి ఉద్యోగ సంఘాలు ఎన్నికల విధుల్లో పాల్గొనాలి. ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలలో ఉద్యోగులు పాల్గొంటున్నప్పుడు ఎన్నికల్లో పాల్గొంటే నష్టమేముండదు. అవసరమైన రక్షణ చర్యలు చేపట్టమని అడగవచ్చు. ఇప్పటికైనా జగన ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. 


తీర్పును గౌరవించాలి 

- నీలి శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు 

సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం, ఉద్యోగులు గౌరవించాలి. ధర్మాసనం ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. కరోనాను, ఉద్యోగులను అడ్డు పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయించాలని రాష్ట్రప్రభుత్వం చూస్తుంది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టువిడుపులకు పోకుండా ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా సహకరించాలి. 


రాజ్యంగ సంక్షోభం కోరి తెచ్చుకోవడం సరికాదు 

- ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి 

జగన ప్రభుత్వం కోరి రాజ్యాంగ సంక్షోభం తెచ్చుకుంటోంది. ఇది సరైంది కాదు. సుప్రీం కోర్టును గౌరవించి ఎన్నికలు నిర్వహించాలి. రాజకీయ పట్టుదలకు పోయి న్యాయస్థానాల్లో చీవాట్లు తింటున్నారు. ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఇచ్చిన తీర్పును అమలు చేయాలి.


రాష్ట్ర కమిటీ నిర్ణయమే శిరోధార్యం 

- కె.శివారెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు 

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ ఉద్యోగులుగా గౌరవించాల్సిందే. కరోనా వ్యాక్సినేషన ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలు జరిపి ఉంటే బాగుండేది. ఈ విషయంలో రాష్ట్ర కమిటీ తీసుకునే నిర్ణయం మేరకే ముందుకు వెళ్తాం. ఉద్యోగులకు కరోనా నుంచి భద్రత కల్పించే చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2021-01-26T05:48:20+05:30 IST