ఎన్ఎల్‌యూ స్టూడెంట్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుకు గడువు 2 నెలలు

ABN , First Publish Date - 2020-07-08T20:45:00+05:30 IST

నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్‌యూ) స్టూడెంట్ 2017లో అనుమానాస్పద

ఎన్ఎల్‌యూ స్టూడెంట్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తుకు గడువు 2 నెలలు

న్యూఢిల్లీ : నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్ఎల్‌యూ) స్టూడెంట్ 2017లో అనుమానాస్పద స్థితిలో మరణించిన కేసులో దర్యాప్తును పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు 2 నెలలు గడువు విధించింది. ఈ కేసు దర్యాప్తులో రాజస్థాన్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. 


జోధ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ థర్డ్ ఇయర్ లా స్టూడెంట్ విక్రాంత్ నగాయిచ్ 2017 ఆగస్టు 14న రైల్వే ట్రాక్ వద్ద అసహజ స్థితిలో మరణించి కనిపించారు.  ఈ కేసుపై దర్యాప్తును రాజస్థాన్ పోలీసుల నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేయాలని విక్రాంత్ తల్లి నీతు కుమార్ నగాయిచ్ సుప్రీంకోర్టును కోరారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారిమన్ బుధవారం రాజస్థాన్ పోలీసులకు రెండు నెలల గడువు మంజూరు చేశారు. రెండు నెలల్లోగా ఈ కేసు దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. 


నీతు కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, తన కుమారుడు 2017 ఆగస్టు 14న మరణించారని, ఆయన మరణించిన 10 నెలల తర్వాత  రాజస్థాన్ పోలీసులు 2018 జూన్ 29న ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జోధ్‌పూర్‌లోని మండోర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. మూడేళ్ళు గడుస్తున్నా దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని ఆరోపించారు. ఇప్పటికీ అభియోగ పత్రాన్ని దాఖలు చేయలేదని తెలిపారు.  పలుకుబడిగల పెద్దల పాత్రను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపిస్తూ,  ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరారు. 



Updated Date - 2020-07-08T20:45:00+05:30 IST