ఢిల్లీ కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2021-11-29T17:36:44+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై

ఢిల్లీ కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రత పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ జారీ చేసిన ఆదేశాలన్నిటినీ తక్షణమే పాటించాలని ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాలు ఈ ఆదేశాలను పాటించడానికి సంబంధించిన నివేదికలను సమర్పించాలని, తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. 


మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ కోసం చెట్లను తొలగించడానికి ముందు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్‌ నుంచి అనుమతి పొందాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)ని ఆదేశించింది. 


ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో, మొక్కలు నాటడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి, 12 వారాల్లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. ఓవైపు కాలుష్యం పెరుగుతుండగా, కొత్తగా కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ బయటపడటం మరో సమస్య అని తెలిపింది. 


సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఢిల్లీ నగరంలో గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటగిరీలో ఉంది. ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 370 వద్ద ఉంది. 


Updated Date - 2021-11-29T17:36:44+05:30 IST