Abn logo
Oct 25 2021 @ 02:24AM

చట్టాలపై అవగాహన లేకే.. పేదలు న్యాయం పొందలేకపోతున్నారు

  • సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ లలిత్‌
  • గ్రామాల్లో న్యాయసేవలపై ప్రచారం చేయండి
  • సామాన్యులకు న్యాయం అందేలా చూడండి


సంగారెడ్డి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘వంద క్రిమినల్‌ కేసులు కోర్టుకు వస్తే.. పేదలు అందులో కనీసం ఒక్కదాంట్లోనైనా న్యాయం పొందలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. వారికి చట్టాలపై అవగాహన లేకపోవడమే..! అందుకే.. చట్టాలపై అందరికీ అవగాహన అవసరం. న్యాయసేవలపై వారికి అవగాహన కల్పించండి. గ్రామాల్లో తిరిగి ప్రచారం చేయండి. ప్రభుత్వ కార్యాలయాలకు నేరుగా వెళ్లగలుగుతున్న ప్రజలు.. న్యాయ సేవా సంస్థలకు ఎందుకు రావడం లేదు? ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే వాతావరణాన్ని న్యాయ సేవా కేంద్రాల్లోనూ కల్పించండి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ అన్నారు. ఆదివారం ఆయన సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో జరిగిన మెగా న్యాయ విజ్ఞాన సదస్సును ప్రారంభించి మాట్లాడారు. దేశంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో కోర్టుల్లో న్యాయం పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఉచితంగా న్యాయవాదిని ఇచ్చి, వారి కేసులను వాదించేందుకు 25 ఏళ్ల క్రితం న్యాయ సేవా సాధికార సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.


ఈ సంస్థ రజతోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న 45 రోజుల కార్యక్రమాల్లో భాగంగా కనీసం మూడు సార్లయినా గ్రామాలకు వెళ్లి.. ప్రజలకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలన్నారు. యువ న్యాయవాదులు ఉచిత న్యాయసేవలకు సిద్ధమవుతున్నారని, ఇది మంచి పరిణామమని అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ప్రదర్శించిన రెండు వీడియో గేయాలు(తెలుగు) జస్టిస్‌ లలిత్‌ను ఆకట్టుకున్నాయి. వాటిని అన్ని భాషల్లో రీమేక్‌ చేసి, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాలని ఆయన సూచించారు. అంతకు ముందు ఆయన 12 మంది దివ్యాంగులకు ఎలక్ట్రిక్‌ ట్రై-స్కూటర్లు, ఇద్దరికి ల్యాప్‌టా్‌పలు, ఒకరికి ఫోన్‌ను అందజేశారు. ఆస్తి పంపకం కేసులో బాధితురాలు పద్మ కుటుంబానికి రూ.కోటి చెక్కు అందజేశారు.

క్రైమ్ మరిన్ని...