Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్షణం పరిహారం పంచండి!

  • రాష్ట్రాలు మానవత్వంతో వ్యవహరించాలి
  • కొవిడ్‌తో లక్ష మంది మరణిస్తే
  • ఒక్క కుటుంబానికీ పరిహారం అందలేదు మహారాష్ట్ర వైఖరి హాస్యాస్పదం: సుప్రీం


న్యూఢిల్లీ, డిసెంబరు 6: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, బెంగాల్‌, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున చెల్లించాలని గత అక్టోబరులోనే చెప్పినా ఈ మూడు రాష్ట్రాల్లో ఎలాంటి కదలిక లేదని మందలించింది. జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ బివీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ‘‘మహారాష్ట్ర ప్రమాణపత్రం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదు. రాష్ట్రం లో కొవిడ్‌తో లక్ష మందికి పైగా చనిపోతే కేవలం 37 వేల దరఖాస్తులు రావడం ఏమి టి? అందులో ఒకరికి కూడా ఇంతవరకు పరిహారం చెల్లించలేదు. ఇది హాస్యాస్పదంగా ఉంది’’ అని జస్టిస్‌ షా వ్యాఖ్యానించారు. పరిహారం పంపిణీ ప్రగతి మీద త్వరలో మరో ప్రమాణపత్రం వేస్తామని మహారాష్ట్ర తరఫు న్యాయవాది బదులిచ్చారు. ‘‘అక్కర్లేదు. జేబులో పెట్టుకొని వెళ్లి మీ సీఎంకు ఇవ్వండి’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తక్షణమే చెల్లింపులు మొదలెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. బెంగాల్లో 19 వేల మరణాలు సంభవిస్తే కేవలం 467 దరఖాస్తులు వచ్చాయని, 110 మందికి మాత్రమే పరిహారం అందిందని గుర్తు చేశారు.


డిసెంబరు 3న సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే పలు రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించడం మొదలు పెట్టాయని ప్రస్తావించారు. రాజస్థాన్‌లో 9 వేల మందికి పైగా మరణిస్తే 595 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ఇంతవరకు ఒక్కరికి కూడా పరిహారం అందలేదని ప్రస్తావించారు. కాస్త మానవత్వంతో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహార పథకం ఉందని పత్రికలు, టీవీల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేశారు. 

Advertisement
Advertisement