అత్యాచార కేసుపై న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు.. విధుల నుంచి తొలగింపు!

ABN , First Publish Date - 2021-11-16T16:45:09+05:30 IST

ఓ అత్యాచార కేసుపై తీర్పు చెబుతూ మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి

అత్యాచార కేసుపై న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు.. విధుల నుంచి తొలగింపు!

ఓ అత్యాచార కేసుపై తీర్పు చెబుతూ మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు సత్వరమే స్పందించి ఆమెను విధుల నుంచి తొలగించింది. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 2017లో జరిగిన ఓ అత్యాచార కేసుపై న్యాయమూర్తి బేగమ్ మొసమ్మత్ కమ్రునహర్ ఈ నెల 11న తీర్పు వెలువరించారు. ఆ తీర్పు సందర్భంగా ఆమె.. అత్యాచారం జరిగి 72 గంటలు దాటిపోతే పోలీసులు కేసు నమోదు చేసుకోకూడదని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 


2017లో ఢాకాలోని అప్‌స్కేల్ హోటల్‌లో ఇద్దరు విద్యార్థినులపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన కేసుపై బేగమ్ మొసమ్మత్ ఈ నెల 11న తీర్పు వెలువరించారు. ఇద్దరు యువతులూ తమ ఇష్టప్రకారమే యువకులతో శృంగారంలో పాల్గొన్నారని, అనంతరం వారిపై తప్పుడు కేసు బనాయించారని విచారణలో తేలింది. దీంతో యువకులను నిర్దోషులుగా పేర్కొన్న న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. `పోలీసులు ఎంతో సమయం వృథా చేశారు. అత్యాచారం జరిగిన 72 గంటల లోపు అయితేనే పోలీసుల కేసు నమోదు చేసుకోవాల`ని వ్యాఖ్యానించారు. 


ఈ వ్యాఖ్యలపై అభ్యంతరాలు రావడంతో బంగ్లాదేశ్ న్యాయ విభాగం, సుప్రీం కోర్టు స్పందించాయి. న్యాయమూర్తిని వెంటనే విధుల నుంచి తప్పించాయి. సదరు వ్యాఖ్యలపై విచారణ ఇవ్వాల్సిందిగా ఆదేశించాయి. `తీర్పుపై నేనేం స్పందించను. కానీ, అత్యాచారం జరిగిన 72 గంటల లోపు అయితేనే పోలీసుల కేసు నమోదు చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించడం రాజ్యంగ విరుద్ధం` అని బంగ్లాదేశ్ న్యాయ మంత్రి అన్షుల్ హక్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-16T16:45:09+05:30 IST