లాక్‌డౌన్ లేదు: హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం

ABN , First Publish Date - 2021-04-20T22:11:12+05:30 IST

ప్రభుత్వ స్పందనా రాహిత్యాన్ని తప్పుపడుతూ, తక్షణ చర్యలు తీసుకోకపోతే వైద్య వ్యవస్థ కుప్పకూలుతుందని జస్టిస్ అజిత్ కుమార్, సిద్ధార్ధ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

లాక్‌డౌన్ లేదు: హైకోర్టు ఆదేశాలను నిలిపివేసిన సుప్రీం

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్ సహా నగరాల్లో ఏప్రిల్ 26 వరకు లాక్‌డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు సోమవారం సంచలన ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఆదేశాలను దేశ అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఆ ఐదు నగరాల్లో లాక్‌డౌన్ అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రం తలుపు తట్టింది. యూపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారించిన అనంతరం లాక్‌డౌన్ అవసరం లేదని తీర్పు చెప్పింది.


సోమవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ స్పందనా రాహిత్యాన్ని తప్పుపడుతూ, తక్షణ చర్యలు తీసుకోకపోతే వైద్య వ్యవస్థ కుప్పకూలుతుందని జస్టిస్ అజిత్ కుమార్, సిద్ధార్ధ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. ''ప్రభుత్వ ఆసుపత్రులలోని ఐసీయూల్లో చాలామటుకు వీఐపీల సిఫారసులతోనే పేషెంట్లను చేర్చుకుంటున్నట్టు మేము గుర్తించాం. రెమ్‌డిసివిర్ వంటి లైఫ్ సేవింగ్ యాంటీ వైరల్ డ్రగ్స్‌ సైతం వీఐపీల సిఫారసుతోనే ఇస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి సైతం లక్నోలో ఐసొలేషన్‌లో ఉన్నారు'' అని న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్‌ నగరాల్లో లాక్‌డౌన్‌కు ఆదేశాలిచ్చింది.


కాగా, హైకోర్టు ఆదేశాల్ని పాటించలేమని యోగి ప్రభుత్వం తేల్చి చెప్పింది. లాక్‌డౌన్ విధించ లేమని, కఠిన ఆంక్షలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. అనంతరం హైకోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ యోగి ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

Updated Date - 2021-04-20T22:11:12+05:30 IST