ఆధ్యాత్మిక ఆశ్రమాలపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-01-20T20:24:42+05:30 IST

స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువులు నిర్వహించే ఆశ్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ

ఆధ్యాత్మిక ఆశ్రమాలపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువులు నిర్వహించే ఆశ్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొన్ని ఆశ్రమాల్లో కొందరిని, మరీ ముఖ్యంగా మహిళలను నిర్బంధిస్తున్నారని ఈ వ్యాజ్యం ఆరోపించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ వ్యాజ్యంపై స్పందిస్తూ, ఇటువంటి అంశాలపై విచారణ జరపలేమని తెలిపింది. దీంతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. 


తెలంగాణవాసి దుంపల రామిరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీనియర్ అడ్వకేట్ మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. నకిలీ బాబాల జాబితాను అఖిల భారతీయ అఖాడా పరిషత్ తయారు చేసిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ జాబితాను తాము ఎలా నమ్మగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంబంధితుల వాదనలను విన్న తర్వాత ఈ జాబితాను రూపొందించారా? లేదా? అనే విషయం తమకు తెలియదని పేర్కొంది. 


రామి రెడ్డి తన పిటిషన్‌లో, తన కుమార్తె ఢిల్లీలోని రోహిణి సమీపంలోని ఆద్యాత్మిక విద్యాలయ ఆశ్రమంలో నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఆశ్రమ వ్యవస్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్‌ 1999లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు 2017లో ఆరోపణలు వచ్చాయని, అప్పటి నుంచి దీక్షిత్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఇటువంటి నకిలీ బాబాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అనధికారిక ప్రదేశాల్లో చట్టవిరుద్ధంగా ఆశ్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వాలు అవకాశం ఇస్తున్నాయన్నారు. క్రిమినల్ రికార్డు ఉన్నవారు ఆశ్రమాలను నడపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అఖిల భారతీయ అఖాడా పరిషత్ రూపొందించిన నకిలీ బాబాల జాబితాలో దీక్షిత్ కూడా ఉన్నారని తెలిపారు. 



Updated Date - 2021-01-20T20:24:42+05:30 IST