భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-27T20:47:05+05:30 IST

వీథుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు

భిక్షాటన నిషేధంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : వీథుల్లో భిక్షాటనను నిషేధించేందుకు ఉన్నత వర్గాలకు అనుకూలంగా పక్షపాత ధోరణిని తాను ప్రదర్శించలేనని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. విద్య, ఉపాధి లేకపోవడంతో కనీస జీవనోపాధిని పొందడం కోసం బిచ్చమెత్తుకోవడానికి వీథుల్లోకి వస్తున్నారని తెలిపింది. ఇది సాంఘిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. జస్టిస్  డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వీథుల్లో తిరిగి బిచ్చగాళ్ళకు, నిరాశ్రయులకు వ్యాక్సిన్లు వేయించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 


పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ చిన్మయ్ శర్మను ఉద్దేశించి జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, వీథుల్లోకి బిచ్చగాళ్ళు రాకుండా నిరోధించాలని మీరు కోరారని అన్నారు. వీథుల్లోకి వచ్చి ఎందుకు బిచ్చమెత్తుకుంటున్నారని ప్రశ్నించారు. పేదరికం వల్ల వారు ఈ పని చేస్తున్నారన్నారు. అత్యున్నత న్యాయస్థానంగా తాము పక్షపాతంతో ఉన్నత వర్గాలకు అనుకూల దృక్పథాన్ని అనుసరించలేమని తెలిపారు. వారికి వేరే అవకాశాలేవీ లేవన్నారు. బిచ్చమెత్తుకోవాలని ఎవరూ కోరుకోరన్నారు. వీథులు, బహిరంగ స్థలాలు, ట్రాఫిక్ జంక్షన్ల నుంచి బిచ్చగాళ్ళను తొలగించాలని తాము ఆదేశించలేమని చెప్పారు. ప్రభుత్వం స్పందించవలసిన, సాంఘిక సంక్షేమ విధానానికి సంబందించిన విషయమని తెలిపారు. ‘‘మా కళ్ళ ముందు నుంచి వారిని దూరంగా ఉంచండి’’ అని తాము ఆదేశించలేమని తెలిపారు. ఈ మానవ సమస్యను పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.


ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అడ్వకేట్ కుశ్ కల్రా దాఖలు చేశారు. ట్రాఫిక్ కూడళ్లు, మార్కెట్లు, బహిరంగ స్థలాల్లో భిక్షాటనను నిరోధించాలని, బిచ్చగాళ్ళు, యథేచ్ఛగా సంచరించేవారిని తొలగించాలని కోరారు. 


Updated Date - 2021-07-27T20:47:05+05:30 IST