సాగు చట్టాలపై సుప్రీం స్టే

ABN , First Publish Date - 2021-01-13T07:19:32+05:30 IST

వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలన్నింటినీ పక్కకు పెట్టిన కోర్టు- చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించి సమస్యకు ఓ

సాగు చట్టాలపై   సుప్రీం స్టే

  • నలుగురితో కమిటీ ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థానం
  • ఎమ్మెస్పీ విధానం కొనసాగాల్సిందే
  • ఏ రైతు భూమినీ లాక్కోడానికి వీల్లేదు
  • రైతు సంఘాలన్నీ చర్చల్లో పాల్గొనాలి
  • 2 నెలల్లో నివేదిక ఇవ్వాలి: సుప్రీం
  • కమిటీని తిరస్కరించిన యూనియన్లు
  • సభ్యులు చట్టాలను సమర్థించిన వారే
  • వారితో చర్చలు వృథా.. వెళ్ళం: నేతలు
  • ఆందోళనలో ఖలిస్థానీ ఉగ్రవాదులు
  • స్టేకు మేం వ్యతిరేకం.. 
  • అయినా అందరికోసం సమ్మతి
  • కేంద్ర ప్రభుత్వం వివరణ 


సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్ఠంభన మరింత బిగుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రకటించినట్లుగానే ఈ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఓ నలుగురితో కమిటీ వేసింది. ఆ నలుగురూ చట్టాలను సమర్థిస్తున్నవారే. దీంతో రైతు నేతలు ఆ కమిటీ ఎదుట తమ వైఖరి వెల్లడించడానికి ససేమిరా కుదరదని చెప్పేశారు. తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. తటస్థత లేని ఈ కమిటీల వల్ల న్యాయం ఎలా జరుగుతుందని విపక్షాలూ ప్రశ్నించాయి. అటు స్టే ను వ్యతిరేకించిన ప్రభుత్వం మాత్రం- అందరి సమ్మతి కోసం కమిటీని ఒప్పుకొంటున్నామని, కమిటీ నిష్పక్షపాతమైన నిపుణులతో కూడినదని చెప్పుకొచ్చింది. తాజా పరిణామాలు 48 రోజులుగా సాగుతున్న నిరసనను చల్లార్చే దిశగా సాగడం లేదని, పరిస్థితిలో మార్పు లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి..


న్యూఢిల్లీ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):  వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలన్నింటినీ పక్కకు పెట్టిన కోర్టు- చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించి సమస్యకు ఓ పరిష్కారం సాధించేందుకు నలుగురు నిపుణులతో ఓ కమిటీని వేసింది. ప్రభుత్వంతో పాటు ఆందోళన చేస్తున్న లేదా చేయని రైతు సంఘాలన్నింటితో సంప్రదింపులు జరిపి రెండు నెలల్లోగా ఓ నివేదిక ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం  ఆదేశాలిచ్చింది. ఏదో ఒకటి తేలేదాకా, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా చట్టాలను అమలు చేయరాదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.


మాజీ సీజే ఆర్‌ఎం లోధా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని భావించినా ఆయన నిరాకరించా రు. కమిటీ సభ్యుల పేర్లను జస్టిస్‌ బోబ్డే చదివి వినిపించారు. వీరు వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ అశోక్‌ గులాటి, భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షుడు భూపిందర్‌సింగ్‌ మాన్‌, దక్షిణాసియా ఆహార విధాన సంస్థ డైరెక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ జోషి, మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్‌ అధ్యక్షుడు అనిల్‌ ఘన్వత్‌ .




సుప్రీం బెంచ్‌ ఉత్తర్వుల్లో ముఖ్యమైనవి.. 

‘‘తదుపరి ఉత్తర్వుల దాకా ఏ రాష్ట్రంలోనూ చట్టాల అమలు జరగరాదు. చట్టాలకు ముందున్న కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగాలి. ఈ చట్టాల కింద తీసుకునే ఏ చర్య వల్లనైనా ఏ రైతూ భూమి కోల్పోకూడదు. ప్రభుత్వం గానీ, ప్రైవేటు సంస్థ లు గానీ రైతుల భూములను లాక్కోడానికి వీల్లేదు. మేం రైతు భూములను పరిరక్షిస్తాం. నలుగురితో ఏర్పాటయ్యే కమిటీ పది రోజుల్లోగా తొలిసారి సమావేశమవ్వాలి. రైతు సంఘాలతో చర్చలకు ప్రదేశాన్ని ప్రభుత్వమే ఏర్పాటుచేయాలి. కమిటీకి సిబ్బందిని, ఇతర సౌకర్యాలను కల్పించాలి. చట్టాలను వ్యతిరేకిస్తున్న, సమర్థిస్తున్న వారంతా అన్ని రాష్ట్రాల వారూ ఈ సంప్రదింపుల్లో పాల్గొనాలి. కమిటీకి సూచనలు అందజేయాలి. కమిటీ 2 నెలల్లోగా నివేదికను మాకు సమర్పించాలి’’


సమరీతిగా వ్యవహారం

‘‘కమిటీ ఏర్పాటు అసాధారణ నిర్ణయం. సమస్యపై సమరీతిన వ్యవహరించేందుకు మేం ఎన్నుకున్న పద్ధతి. మా ఈ యత్నాన్ని అర్థం చేసుకుని రైతులు స్వస్థలాలకు వెళ్లాలి. జీవ నం, ఆరోగ్యం ఈ రెండింటి కోసం రైతులకు సంఘాల నేతలు నచ్చజెప్పాలి’ అని బోబ్డే అన్నారు. అయితే రైతులు కమిటీ ఎదుట హాజరయ్యేది లేదంటున్నారని పిటిషనర్లలో ఒకరైన ఎంఎల్‌ శర్మ ప్రస్తావించగా ‘ఇలాంటివి మేం వినదలుచుకోలేదు. ప్రభుత్వంతో చర్చలకు వచ్చినవారు కమిటీ దగ్గరకు వెళ్లడానికి ఏంటి అభ్యంతరం? ఆందోళన లక్ష్యం సాధించాలంటే కమిటీ వద్దకు వెళ్లాలి’ అని జస్టిస్‌ బోబ్డే పేర్కొన్నారు. 


స్టేకు మేం వ్యతిరేకం: ప్రభుత్వం

సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టేను వ్యతిరేకిస్తున్న ట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘రైతుకు ఉపయోగపడుతున్న చట్టాలపై స్టే ఇవ్వొద్దన్నాం. దేశంలోని రైతాంగమంతా సమర్థిస్తున్నదనీ చెప్పాం. అయినా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కమిటీ కూడా వేసింది. కమిటీని స్వాగతిస్తున్నాం’ అని వ్యవసాయ శాఖ సహాయమంత్రి కైలాశ్‌ చౌధురి అన్నారు. చట్టాలపై రైతు ల్లో అపోహలు నెలకొన్నాయని, ఎంఎస్పీ వ్యవస్థ కొనసాగింపు, మండీల్లోనే ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి పాత పద్ధతి కొనసాగుతుందని, చట్టాలకు దానికి సంబంధం లేదని ప్రభు త్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే కోర్టులో వాదనలు వినిపించారు. 



కమిటీ అంతా ప్రభుత్వ ఏజెంట్లే: రైతు నేతలు

సుప్రీంకోర్టు కమిటీని రైతు సంఘాలు తిరస్కరించాయి. చట్టాల అమలుపై స్టేను స్వాగతించిన యూనియన్లు కమిటీ సభ్యులపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘‘ఈ కమిటీ సభ్యులంతా ప్రభుత్వానికి అనుకూలురు. చట్టాలు రైతులకెంత ఉపయుక్తమో చెబుతూ అనేక వ్యాసాలు రాసినవారు. టీవీ షోల్లో మాట్లాడిన వారు. వారిని ఎలా నమ్మగలం. వారంతా ప్రభుత్వ ఏజెంట్లు. మేం ఈ కమిటీ ముందు హాజరయ్యేది లేదు. మా ఆందోళన కొనసాగిస్తాం’’ అని రైతు నేతలు సింఘూ సరిహద్దు వద్ద మీడియాకు చెప్పారు.


‘ఇలా ఓ కమిటీని వేయమని మేమేమైనా సుప్రీంకోర్టును అడిగామా? ఈ కమిటీ ఏర్పాటు వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని రైతు నేత బల్బీర్‌సింగ్‌ రాజేవాల్‌ అన్నారు. ‘‘మా ఆందోళన నుంచి దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది’’ అని మరో నేత దర్శన్‌సింగ్‌ పాల్‌ అన్నారు. పార్లమెంటే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని, చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే ఈ నెల 15న ప్రభుత్వంతో జరిగే చర్చలకు హాజరవుతామని వారు చెప్పారు. 


నిష్పాక్షికత లేని కమిటీ : విపక్షాలు

కమిటీ ఏర్పాటులో నిష్పక్షపాత వైఖరి లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ‘తోమర్‌, పీయూశ్‌ గోయల్‌ల స్థానే ఈ కమిటీ సభ్యులు చర్చిస్తారు. దీని వల్ల రైతులకు ఏం న్యాయం జరుగుతుంది?’ అని కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. ఇదంతా ప్రభుత్వ గేమ్‌ ప్లాన్‌ అని టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, లెఫ్ట్‌ నేతలు దుయ్యబట్టారు.




సుప్రీం వ్యాఖ్యలివీ


 కమిటీని ఏర్పాటుచేయనివ్వకుండా ఏ శక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు. చట్టం అమలును నిలిపేసే అధికారం మాకు ఉంది


 ఇది జీవన్మరణ సమస్య. ఈ నిరసన వల్ల ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాల గురించే మా ఆందోళన. సమస్యను ఇంతవరకూ  మీరు (ప్రభుత్వం) పరిష్కరించలేకపోయారు. అందుకే మేం ప్రయత్నిస్తున్నాం. 


 ఈ కమిటీ అందరికీ చెందినది. సమస్య పరిష్కారం కావాలని నిజాయితీగా కోరుకునే వారంతా వచ్చి తమ వైఖరులను తెలియజేయాలి


 ప్రధాని నేరుగా రైతులతో చర్చలు జరపాలని మేం ఆదేశించలేం. ఆయన ఈ కేసులో భాగస్వామి కాదు. 


 




కమిటీ సభ్యులేమన్నారు?

సుప్రీంకోర్టు నియమించిన కమిటీలోని సభ్యులంతా ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను సమర్థించిన వారే. 

ఈ చట్టాలపై వారు గతంలో ఏమన్నారంటే...


వ్యవసాయరంగాన్ని పోటీకి అనుగుణంగా మార్చాలంటే ఇలాంటి సంస్కరణలు అత్యవసరం

- భూపిందర్‌సింగ్‌ మాన్‌


రైతులు పంటను అమ్ముకోడానికి, కొనుగోలుదారులు వీటిని కొనడానికి ఉద్దేశించినవీ చట్టాలు. మార్కెట్‌లో పోటీకి ఇవి దోహదం చేస్తాయి


- అశోక్‌ గులాటి


చట్టాల ఉపసంహరణ అనవసరం. ఈ చట్టాలు రైతులకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నాయి

- అనిల్‌ ఘన్వత్‌


చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దు. మారుతున్న పోటీకి అనుగుణంగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోడానికివి సహకరిస్తాయి.


- ప్రహ్లాద్‌ జోషి




ర్యాలీ ఆపితే 10వేల మంది మరణం

రైతు నేత తికాయత్‌ సంచలన వ్యాఖ్య


న్యూఢిల్లీ, జనవరి 12: ఈనెల 26వ తేదీ రిపబ్లిక్‌ దినోత్సవం నాడు రాజ్‌పథ్‌లో తాము జరపతలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో ఎలాంటి మార్పూ లేదని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ ప్రకటించారు. ‘‘ఈ ర్యాలీ ఆపాలని మాకెలాంటి నోటీసూ ఇంతవరకూ రాలేదు. నిజంగా ప్రభుత్వమే గనక మా ర్యాలీని అడ్డగిస్తే కనీసం 10వేల మంది రైతులు మరణించడం తథ్యం. అయినా- భారీ ప్రదర్శనలు జరిగితే వేలమంది మరణిస్తారని ప్రభుత్వమే చెప్పడం దారుణం.’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


కాగా, హరియాణ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టార్‌, ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌటాలా మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి మంతనాలు జరిపారు. ఈ ఆందోళనతో దుష్యంత్‌ నేతృత్వంలోని జేజేపీ ఆత్మరక్షణలో పడటం, ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని సంకేతాలివ్వడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  జేజేపీ వైదొలిగితే ఖట్టార్‌ సర్కార్‌ కుప్పకూలుతుంది. దీంతోతొందరపాటు నిర్ణయాలొద్దని దుష్యంత్‌కు అమిత్‌ షా చెప్పినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-01-13T07:19:32+05:30 IST