వికాసోద్యమ స్ఫూర్తి సురమౌళి

ABN , First Publish Date - 2020-03-20T08:36:49+05:30 IST

ఇప్పటి తరానికి అంతగా తెలియక పోవచ్చు గాని ఒక 60-70 ఏండ్ల కింద తెలంగాణ అంతటికీ బాగా పరిచయమైన పేరు సురమౌళి. కథకుడిగా, సంపాదకుడిగా, సోషలిస్టు పార్టీ నేతగా, నాటక కర్తగా...

వికాసోద్యమ స్ఫూర్తి సురమౌళి

తెలంగాణ, తెలుగు సమాజం శ్రేయస్సు కోసం, వికాసం కోసం సురమౌళి దాదాపు నాలుగు దశాబ్దాలు నిస్వార్థంగా పనిచేసిండు. నాస్తికోద్యమం, హేతువాద ఉద్యమం, కుల నిర్మూలన గురించి ఎవ్వరూ ఆలోచించని కాలంలోనే ఆయన వాటిని నడిపించిండు. సామాజిక, సాహిత్య, రాజకీయ రంగాల్లో రెబెల్‌గా ఉంటూ ఎక్కడా విలువల పట్ల కాంప్రమైజ్‌ కాకుండా ఆద్యంతం పోరాటం చేసిన స్ఫూర్తి మంతుడు సురమౌళి.


ఇప్పటి తరానికి అంతగా తెలియక పోవచ్చు గాని ఒక 60-70 ఏండ్ల కింద తెలంగాణ అంతటికీ బాగా పరిచయమైన పేరు సురమౌళి. కథకుడిగా, సంపాదకుడిగా, సోషలిస్టు పార్టీ నేతగా, నాటక కర్తగా, రచయితగా, నాస్తికోద్యమ నిర్మాతగా, కులనిర్మూలన సంఘ స్థాపకుడిగా, నక్సలైట్‌ ఉద్యమ అధ్యయన శీలిగా ఆయన రాణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. జర్నలిస్టుగా, గ్రంథాలయ స్థాపకుడిగా, అనువాదకుడిగా, అడ్వకేటుగా, రేడియో ప్రయోక్తగా, సహకార సంఘ ప్రచారకుడిగా తెలంగాణ వికాసోద్యమంలో తన వంతు పాత్ర పోషించిండు. తెలంగాణలో హేతువాద ఉద్యమాలకు పునాదులేసిండు.


సురమౌళి 1949లో 14 ఏళ్ళ వయసులోనే వేములవాడ (ఈ పట్టణానికి సమీపంలోని విలాసాగరమే ఆయన కన్న ఊరు) పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ‘ఎథియిస్ట్‌ బాయ్స్‌ క్లబ్‌’ (ఎబిసి)ను ఏర్పాటు చేసి దాని తరపున నాస్తిక కార్యక్రమాలు చేపట్టిండు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అదీ వేములవాడ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో నాస్తిక కార్యక్రమాలు చేపట్టిం డు. బహుశా తెలంగాణలో నాస్తికోద్యమానికి ఆయనతోనే పునాదులు పడ్డాయంటే తప్పుకాదు. విజయవాడలోని గోరా ప్రభావంతో హేతువాద ఉద్యమాన్ని కరీంనగర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రచారంలో పెట్టిండు.


సోషలిస్టు పార్టీ కార్యకర్తగా, నేతగా ఎన్నో సభలు, సమావేశాలు సురమౌళి నిర్వహించాడు. ఆ పార్టీ స్వర్ణోత్సవాల సంచికను తన సంపాదకత్వంలో సర్వసమగ్రంగా రూపొందించిండు. అందులో తెలంగాణలో సోషలిస్టు పార్టీ పుట్టుక దాని వికాసం గురించి వివిద వ్యాసకర్తలు వివరంగా రాసిండ్రు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తర్వాత ఆనాడు ఎక్కువ బలంగా ఉన్న పార్టీ సోషలిస్టు పార్టీ. తొలి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఈ పార్టీ తరపున ఎంపీలు, ఎమ్మేల్యేలు ఎన్నికయిండ్రు. (అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ పిడిఎఫ్‌ రూపంలో ఉండింది) 1970ల వరకు బద్రివిశాల్‌ పిట్టీ లాంటి వారు ఆ పార్టీ ఎమ్మేల్యేలుగా కొనసాగిండ్రు. సోషలిస్టు పార్టీ తరపున రామ్ మనోహర్‌ లోహియా రచనలను సురమౌళి తెలుగు పాఠకులకు అందించిండు. కులాల సమస్య, భాషా సమస్యపై లోహియా రాసిన పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేసిండు. వీటిని తెలుగు అకాడెమీ ప్రచురించింది. అట్లాగే అంబేడ్కర్‌ గురించి తెలుగులో ఒకటి రెండు పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉన్న సమయంలో సురమౌళి మహారాష్ట్రకు చెందిన సోషలిస్టు నాయకుడు మధులిమాయె రాసిన పుస్తకాన్ని ‘సాంఘిక విప్లవ రథసారథి డాక్టర్ బి.ఆర్‌.అంబేడ్కర్‌’ పేరిట అనువాదం చేసిండు. ఈ పుస్తకం 1992లో అచ్చయింది. ఈ అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డుని కూడా ప్రకటించింది. 


జర్నలిస్టుగా సురమౌళి వివిధ పత్రికల్లో పనిచేసిండు. ‘ఆంధ్రభూమి’, ‘బహుజన’ పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేసిండు. అలాగే ‘పంచాయత్‌’, ‘ఆంధ్రజనత’, ‘నవయుగ’ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు. 1970వ దశకంలో నెల్లూరు నుంచి ఒక దినపత్రికను నడిపించేందుకు సం పాదకుడిగా వెళ్ళాడు. అక్కడే ఒక్క ఏడాది పాటు ఉండి పత్రికకు సంబంధించిన వివిధ అడ్మినిస్ట్రేటివ్‌ పనుల్లో నిమగ్నమయిండు. అయితే చివరి నిమిషంలో పత్రికను తీసుకురావాలనుకున్న వాళ్ళు వెనక్కి తగ్గడంతో పత్రి క రాకుండానే ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చిండు. ఆ తర్వాత అసెంబ్లీలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిండు. దాంతో పాటు రేడియోలో ప్రయోక్తగా, న్యూస్‌ రీడర్‌గా పనిచేసిండు. నిజానికి ‘వార్తలు చదువుతున్నది సురమౌళి’ అనే పదం ఇప్పటికీ అనేక మంది పాతతరం వారు నెమరు వేసుకుంటూ ఉంటారు. తన మిత్రుడు చినవెంకటరెడ్డితో కలిసి నాటకాలు రాసి ప్రచురించిండు. ఈ చిన వెంకటరెడ్డి ఆలిండియా రేడియోలో ‘ఎల్లయ్య మామ’గా సుప్రసిద్ధుడు. 


తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాషను చిరస్మరణీయంగా రికార్డు చేసిన వాడు సురమౌళి. 1952-60 మధ్య కాలంలో ముప్పయికి పైగా కథలు రాసిండు. దాదాపు ఈ కథలన్నింటిలో సమకాలీన (అప్పటి) తెలంగాణ జీవితం, భాష రెండూ చిత్రితమయ్యాయి. ‘ముక్కోటి బలగమోయి’ అనే కథలో తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాలు కలవడం వల్ల ఆంధ్రాధిపత్యం పెరుగుతుందని రాసిండు. తర్వాతి కాలంలో అదే నిజమయింది. ‘అంగుడుపొద్దు’, ‘రక్తపూజ’ తదితర కథలు సురమౌళిని చిరస్థాయిగా సాహిత్యంలో నిలబెడతాయి. 1950వ దశకంలో తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాషను రాయడమంటే సాహసంగానే చెప్పాలి. అయినా ఆ సాహసాన్ని సమర్ధంగా చేసినవాడు సురమౌళి. ఆయన రాసిన కథలు నేను ‘సురమౌళి కథలు’ పేరిట పుస్తకంగా తీసుకొచ్చాను. అందులో మొత్తం 16 కథలున్నాయి. ‘నిరుద్యోగి’, ‘ఒట్టు’, ‘తమ్ముడు’, ‘అరటి తొక్క’, ‘అసలే బాధామయ జీవితం’ తదితర కథలు ఇంకా అలభ్యాలుగానే ఉన్నాయి. వీటితో పాటు టాల్‌స్టాయ్‌ నవలను ‘పిల్లలే నయం’ పేరిట తెలుగులోకి తీసుకొచ్చాడు. ఇది ఆనాటి తెలుగుదేశం పత్రికలో సీరియల్‌గా అచ్చయింది. ఇది కూడా ఇవాళ అలభ్యం. ఈయన జానపద బాణీలను పోలిన పాటలను కథల్లో భాగంగా చేర్చడంతో ఆనాటి జీవితం కండ్లకు కట్టినట్టు చిత్రితమయ్యిందంటే అతిశయోక్తి కాదు.


హైదరాబాద్‌లో కులాంతర వివాహాలను ప్రోత్సహించడమే గాకుండా ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి దానికి విస్తృత ప్రచారం కల్పించేవాడు. 1990వ దశకం ఆరంభంలో ప్రతి ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో లబ్ధప్రతిష్టులైన వ్యక్తుల చేత కుల నిర్మూలన అనే అంశంపై ఉపన్యాసలిప్పించేవాడు. ఇందులో పొత్తూరి వెంకటేశ్వరరావు, రత్నసభాపతి, జి.కృష్ణ, గౌతు లచ్చన్న తదితరులు పాల్గొని తమ అమూల్యమైన సందేశాలనిచ్చేవారు. ఇది తర్వాతి కాలంలో ఎంతో మందికి స్ఫూర్తి నిచ్చింది. సురమౌళి స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రస్తుతం ఈ సంస్థ బాధ్యతలను వాహిద్‌ నిర్వహిస్తున్నాడు.


వేములవాడలో రవీంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిండు. హైదరాబాద్‌ వచ్చిన తర్వాత తెలంగాణ రచయితల సంఘం సహాయ కార్యదర్శిగా పనిచేసిండు. కొన్ని రోజులు సారస్వత పరిషత్తులో కూడా ఉద్యోగం జేసిండు. ఆ తర్వాత వరంగల్‌, హైదరాబాద్‌ల్లో అడ్వకేటుగా ప్రాక్టీసు చేసిండు. వరంగల్‌లో ఉన్న సమయంలో కాళోజి నారాయణరావు ఆహ్వానం మేరకు మిత్రమండలి కార్యకలాపాల్లో తరచుగా పాల్గొనేవారు. 1990వ దశకంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, అడవుల్లోకి వెళ్ళి వివిధ వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి నక్సలైట్ల ‘హింసాకాండ’ను నిరసిస్తూ ‘హింసారాధన’ పుస్తకాన్ని రాసిండు. అయితే ఈ పుస్తకాన్ని అచ్చేయొద్దని కాళోజి నారాయణరావు సలహా ఇచ్చినా ససేమిరా అంటూ ఆ పుస్తకాన్ని కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం సహకారంతో అచ్చేసిండు. దీంతో నక్సలైట్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాగే కుల నిర్మూలన సంఘం పెట్టడమే గాకుండా, హేతువాద సంఘ కార్యకలాపాలు నిర్వహించడం, అంతకు ముందు నాస్తిక సంఘం పనులు నిర్వహించడంతో సంప్రదాయ వాదులూ ఆయన్ని వ్యతిరేకించారు. ఇట్లా తన వ్యవహార శౖలి కారణంగా అటు లెఫ్టిస్టులూ, ఇటు రైటిస్టులూ ఇద్దరూ ఆయన్ని దూరం పెట్టారు. దీంతో ఆయనకు సామాజిక కార్యకలాపాల్లోనూ, సాహిత్య రంగంలోనూ న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ఆయన రచనలన్నీ అభ్యుదయ దృక్పథంతో ఉండేవి. టాల్‌స్టాయ్‌ రచనలనూ అనువదించాడు. అయినా ఆయనను ఏ అభ్యుదయ, విప్లవ, ప్రగతిశీల సంస్థ ఓన్‌ చేసుకోలేదు. సోషలిస్టు పార్టీ తరపున వివిధ సభలు నిర్వహించిండు. మాజి ప్రధాని చంద్రశేఖర్‌, జార్జి ఫెర్నాండెజ్‌, మధులిమాయె తదితరులకు ఆయన ఆప్త మిత్రుడు. అయినప్పటికీ ఆయన అవసాన దశలో అద్దె ఇళ్లలోఉంటూ అసువులు బాసిండు.


తెలంగాణ, తెలుగు సమాజం శ్రేయస్సు కోసం, వికాసం కోసం సురమౌళి దాదాపు నాలుగు దశాబ్దాలు నిస్వార్థంగా పనిచేసిండు. తన డబ్బుని, సమయాన్ని అందుకోసం వెచ్చించాడు. నాస్తికోద్యమం, హేతువాద ఉద్య మం, కుల నిర్మూలన ఇప్పుడు కొత్తగా ప్రాచుర్యం పొందిన అంశాలు. అయితే వీటి గురించి ఎవ్వరూ ఆలోచించని కాలంలో తాను ముందుండి 1960వ దశకంలోనే వాటిని నడిపించాడు. కేవలం 14 ఏండ్ల వయసులో ‘ఎథియిస్ట్‌ బాయ్స్‌ క్లబ్‌’ని నిర్వహించాడు. ఇట్లా నిర్వహించడమూ, అదీ వేములవాడ లాంటి సుప్రసిద్ధ ధార్మిక కేంద్రంలో కార్యకలాపాలు జరపడమంటే అత్యంత సాహసోపేత కార్యక్రమమని వీటన్నింటిని దగ్గరి నుంచి చూసిన కథకులు గూడూరి సీతారామ్ ఈ రచయితతో చెప్పేవారు.


సామాజిక, సాహిత్య, రాజకీయ రంగాల్లో రెబెల్‌గా ఉంటూ ఎక్కడా విలువల పట్ల కాంప్రమైజ్‌ కాకుండా ఆద్యంతం పోరాటం చేసిన స్ఫూర్తి మంతుడు సురమౌళి. ఆయన స్ఫూర్తిని కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంత్యుత్సవాలను నిర్వహించాల్సిన అవసరమున్నది. ఇప్పటి తరానికి ఆయన త్యాగనిరతిని తెలియజెప్పాల్సిన సమయమిది.

సంగిశెట్టి శ్రీనివాస్‌

(ఇవ్వాళ సురమౌళి 25వ వర్ధంతి)

Updated Date - 2020-03-20T08:36:49+05:30 IST