ఆర్వో ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలి

ABN , First Publish Date - 2021-06-22T06:44:09+05:30 IST

పెట్లూరులో ఆర్వో ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులు కైవసం చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని సర్పంచ్‌ పేర్కొన్నారు.

ఆర్వో ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలి
కలెక్టర్‌ను కలిసి వివరిస్తున్న ఎమ్మెల్యే స్వామి, సర్పంచ్‌లు

పొందూరులో అవినీతిపై విచారించాలి

కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే స్వామి, సర్పంచ్‌లు 

కొండపి/టంగుటూరు, జూన్‌ 21: పెట్లూరులో ఆర్వో ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులు కైవసం చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని సర్పంచ్‌ పేర్కొన్నారు.  ఈమేరకు సోమవారం సర్పంచ్‌ ఆరితోటి ఝాన్సీ ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి సమస్యను వివరించారు. ఈ ప్లాంట్‌ను గ్రామ పంచాయతీకి అప్పగించడం లేదని, న్యాయం చేయాలని కోరారు. రెండేళ్లుగా ప్రైవేటు వ్యక్తులు ఆర్వో ప్లాంటులోని తాగునీటిని విక్రయించుకుంటూ కనీస మరమ్మతులు కూడా చేయలేదని వివరించారు. గ్రామ సర్పంచ్‌ వచ్చాక ఆర్వో ప్లాంటును గ్రామ పంచాయతీకి అప్పగించాలని పాలకవర్గం తీర్మానించినా అధికారులు స్పందించడం లేదన్నారు. గ్రామ పంచాయతీకి ఆర్వో ప్లాంటు అప్పగించేలా చర్యలు తీసుకుంటానని  కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

పొందూరు గ్రామ పంచాయతీలో అవినీతి..

టంగుటూరు, జూన్‌ 21: పొందూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌.జ్యోతి  దుర్వినియోగం చేసిన నిధులపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌ పిల్లి కోట్లింగం, ఉప సర్పంచ్‌ కాట్రగడ్డ అనిల్‌కుమార్‌ కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్స్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి పని చేసిన కాలంలో దాదాపు రూ.20 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ వినతిపత్రంలో పేర్కొన్నారు. న్యాయం చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-06-22T06:44:09+05:30 IST