కొంత మంది అగ్ర హీరోలకు చిన్న నిర్మాతలు కనిపించడం లేదు. ఇండస్ట్రీ పెద్దలుగా తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వెళ్లి సంవత్సరంలో 180 చిత్రాలు తీస్తున్న చిన్న నిర్మాతలకు చాలా అన్యాయం చేశారు. వాళ్లకు కావాల్సినవి వాళ్లు లాబీయింగ్ చేసుకున్నారు’’ అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ యేలూరు సురేందర్‌రెడ్డి ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం కురిపించిన వరాల జల్లులో చిన్న నిర్మాతల విజ్ఞప్తులను పక్కన పడేశారని ఆయన అన్నారు. ఇంకా యేలూరు సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘ఏడాదిలో 200 చిత్రాలు వస్తుంటే... అందులో 20, 30 మాత్రమే భారీ బడ్జెట్ చిత్రాలు. మిగిలినవి చిన్న చిత్రాలే. ఆ చిత్రాల నిర్మాతల నోట్లో మట్టి కొట్టారు. మేం మూడు విషయాలు అడిగాం. ఒకటి... థియేటర్లలో రెండు గంటల మ్యాట్నీ షో కంపల్సరీగా చిన్న చిత్రాలకు కేటాయించమని. రెండు... లొకేషన్లు ఫ్రీగా ఇవ్వమని. మూడు... థియేటర్లలో సినిమా ప్రదర్శనకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వారానికి రూ. 12 వేలు అన్యాయంగా తీసుకుంటున్నారు, ఆ సమస్యను పరిష్కరించమని అడిగితే వీటిని పక్కన పడేశారు. రూ. 10 కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలను చిన్న చిత్రాలు అంటారా? రెండు మూడు కోట్ల బడ్జెట్ లోపు చిత్రాలనే చిన్న చిత్రాలు అంటారు. పెద్ద హీరోలకు లీజుకి థియేటర్లు ఉన్నాయి. లాబీయింగ్ చేసి వాళ్లకు కావాల్సింది వాళ్లు చేసుకున్నారు’’ అన్నారు.
యేలూరు సురేందర్‌రెడ్డి