Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్యాన్సర్‌ చికిత్సలో సర్జరీల పాత్ర!

ఆంధ్రజ్యోతి(11-01-2021)

క్యాన్సర్‌ చికిత్సలు... వయసు, దశ, గ్రేడింగ్‌, ఇతర ఆరోగ్య లక్షణాల మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు, పెద్దల్లో క్యాన్సర్‌ చికిత్సలు భిన్నంగా ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి కూడా చికిత్సలు మారుతూ ఉంటాయి. కొన్ని క్యాన్సర్లు మందులు, రేడియేషన్‌తో అదుపులోకి రావచ్చు. కొన్నిటికి పని చేయకపోవచ్చు. రొమ్ము, ప్రోస్టేట్‌ క్యాన్సర్లకు సర్జరీ, రేడియేషన్‌, కీమోథెరపీలతో పాటు హార్మోన్‌ థెరపీకి కూడా ప్రాధాన్యం ఉంటుంది. క్యాన్సర్‌కు నేడు సెల్‌ టార్గెటెడ్‌ థెరపీ, ఫోటో డైనమిక్‌, లేజర్‌ థెరపీ, మాలిక్యులర్‌ టార్గెటెడ్‌ థెరపీ అనే కొత్త చికిత్సా విధనాలు అందుబాటులోకొచ్చాయి. 


చికిత్సలో భాగంగా క్యాన్సర్‌ను అదుపులో ఉంచడానికీ, నయం చేయడానికే కాకుండా చాలా ఆలస్యంగా అడ్వాన్స్‌డ్‌ దశల్లో కనుగొన్నప్పుడు, నొప్పి, బాధ తగ్గడానికి పాలియేటివ్‌ చికిత్సా విధానాలను అనుసరిస్తూ ఉంటారు. క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగా ఉండడం అవసరం. కాబట్టి, వైద్యుల సూచనల ప్రకారం రక్తపరీక్ష, ఇతరత్రా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాన్సర్‌  చికిత్సలో సర్జరీల అవసరం కూడా ఉంటుంది. ఆ సర్జరీలు ఏవంటే...


శస్త్రచికిత్స: రక్తానికి సంబంధించిన క్యాన్సర్‌ మినహా మిగతా అన్ని కేన్సర్లలో సర్జరీకి ప్రాధాన్యం ఎక్కువ. క్యాన్సర్‌ను నయం చేయడానికీ, నివారించడానికీ సర్జరీలను ఎంచుకుంటారు. చిన్న కోతతో, ఒక్క రోజులోనే రోగిని ఇంటికి పంపే డే కేర్‌ ప్రొసిజర్లు చేయగలుగుతున్నారు.


ప్రివెంటివ్‌ సర్జరీ: పెద్ద పేగు చివరి భాగంలో పాలిప్‌ కనిపించినప్పుడు క్యాన్సర్‌ లక్షణాలతో పని లేకుండా దాన్ని తొలగిస్తారు. కుటుంబ చరిత్రలో రొమ్ము క్యాన్సర్‌ ఉంటే, జీన్‌ మ్యుటేషన్‌లో కేన్సర్‌ ముప్పును ముందే తెలుసుకుని, రొమ్ములను తొలగిస్తారు. పాప్‌స్మియర్‌ పరీక్షలో తేడాలున్నప్పుడు, గర్భాశయాన్ని తొలగిస్తారు. 


క్యురేటివ్‌ సర్జరీ: తొలి దశ క్యాన్సర్‌లో రేడియేషన్‌, కీమో, సర్జరీ తర్వాత ఇతర థెరపీలతో కలిపి చేసే సర్జరీలివి. కొన్ని సందర్భాల్లో సర్జరీ చేసే సమయంలోనే రేడియేషన్‌ కూడా ఇవ్వడం జరుగుతుంది.


పాలియేటివ్‌ సర్జరీ: క్యాన్సర్‌ను చివరి దశలో కనుగొన్నప్పుడు కణితి పరిమాణాన్ని తగ్గించి, నాణ్యమైన జీవితం గడిపేలా ఈ సర్జరీ ఎంచుకుంటారు. ఇతర చికిత్సలకు అనుకూలంగా ఉండేందుకు కూడా ఈ సర్జరీని ఎంచుకుంటూ ఉంటారు. 


రెస్టోరేటివ్‌ సర్జరీ: చికిత్సలో ప్రధానంగా క్యాన్సర్‌ సోకిన భాగంతో పాటు, చుట్టూ ఉన్న లింఫ్‌నోడ్స్‌నూ, కణజాలాన్నీ తొలగిస్తారు. రొమ్ము, హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్లలో, ఆ అవయవాల పనితీరును మెరుగుపరచడం కోసం, ఆత్మన్యూనతకు లోనవకుండా ఉండడం కోసం, రోగి శరీరం నుంచి సేకరించిన ఎముకలు, కణజాలానికి ప్రోస్థటిక్స్‌ను జోడించి, రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీలు చేస్తారు. వీటిని వెంటనే లేదా చికిత్స పూర్తయిన తర్వాత చేయవచ్చు.


కీమోథెరపీ: ఈ థెరపీతో దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ, అవి చికిత్స తదనంతరం పూర్తిగా తగ్గిపోతాయి. పిల్స్‌, లిక్విడ్స్‌, రక్తనాళంలోకి ఇచ్చే మందులు, ఇంజెక్షన్లు, చర్మం మీద రుద్దే మందులు, వెన్నులోకి, పొట్టలోకి ఇచ్చే ఇంజెక్షన్లు.. ఇలా అనేక రకాలుగా ఉంటాయి. రోజులు, వారాలు, నెలల నిడివితో సాగే కీమోథెరపీ చికిత్సను కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా తీసుకోవలసి ఉంటుంది. 


రేడియేషన్‌ థెరపీ: త్రీ డైమెన్షనల్‌, స్టీరియోటాక్టిక్‌, బ్రాకీ థెరపీ వంటి రేడియేసన్‌  చికిత్సలు తక్కువ దుష్ప్రభావాలతో, తక్కువ వ్యవధిలోనే ముగుస్తాయి. ఈ కొత్త చికిత్సలతో క్యాన్సర్‌ సోకిన ప్రదేశం మీదే నేరుగా ప్రభావం పడుతుంది. 


డాక్టర్‌ పాలంకి సత్య దత్తాత్రేయ

డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఆఫ్‌ మెడికల్‌ ఆంకాలజీ సర్వీసెస్‌,

రెనోవా సౌమ్య కేన్సర్‌ సెంటర్‌,కార్ఖానా, సికింద్రాబాద్‌.

సంప్రదించవలసిన నంబరు: 7799982495

Advertisement
Advertisement