Jul 24 2021 @ 19:04PM

తన తండ్రి నటించిన చిత్ర టైటిల్‌తో వస్తోన్న సూర్య

స్టార్‌ హీరో సూర్య తన 46వ పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. ఈ బర్త్‌డే స్పెషల్‌గా గురువారం సాయంత్రమే ఆయన నటించే 40వ చిత్రం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. 1976లో సూర్య తండ్రి, సీనియర్‌ నటుడు శివకుమార్‌ నటించిన ‘ఎదర్కుం తుణిందన్‌’ టైటిల్‌ను ఇపుడు సూర్య తన 40వ చిత్రానికి ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తుండగా, సూర్య సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 


తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చూడగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్ర కథాకథనాల విషయంలోనే కాకుండా, ఫస్ట్‌లుక్‌ విషయంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సూర్య చేతిలో ఖడ్గం పట్టుకుని నడుస్తున్న తీరు చూస్తుంటే ఈ చిత్ర కథా నేపథ్యమే భిన్నంగా ఉంటుందనే విషయం అర్థమవుతుంది. కాగా, ప్రస్తుతం సూర్య జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడివాసల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన మరో చిత్రంలో నటించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది.