లొంగుబాటు అనే మైండ్‌గేమ్!

ABN , First Publish Date - 2020-09-10T06:23:26+05:30 IST

సైకలాజికల్ మేనిప్యులేషన్ ద్వారా ఎదుటి మనిషిపై ఒక పట్టు సాధించే ప్రయత్నం మైండ్‌గేమ్. అంటే నిజాలు వేరుగా ఉంటే, వాస్తవం కాని విషయాన్ని చూపించి ఎదుటి...

లొంగుబాటు అనే మైండ్‌గేమ్!

మావోయిస్టుల సమస్యపై ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో వాగ్దానాలు చేసాయి. ఆయుధాలు వదిలి పెట్టమని విజ్ఞప్తి చేస్తూ పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వారి పునరావాసానికి వివిధ పథకాలను ప్రకటించాయి. ఆ ప్రతిపాదనలు, పథకాల విషయంలో పాలకుల చిత్తశుద్ధి ఎంత అనే విషయాన్ని అలా ఉంచితే కనీసం నియమాత్మకంగా అయినా, మావోయిస్టుల సమస్య పరిష్కారానికి షార్ట్ కట్స్ ఏవీ లేవు అని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని మనకు అర్థమవుతుంది.


సైకలాజికల్ మేనిప్యులేషన్ ద్వారా ఎదుటి మనిషిపై ఒక పట్టు సాధించే ప్రయత్నం మైండ్‌గేమ్. అంటే నిజాలు వేరుగా ఉంటే, వాస్తవం కాని విషయాన్ని చూపించి ఎదుటి మనిషిపై ప్రభావం నెరపే ప్రయత్నం అన్న మాట. ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు మావోయిస్టుల విషయంలో చేసింది అదే! ఎదుటి వాళ్ళ మీద ప్రత్యక్షంగా, క్షేత్రస్థాయిలో ముఖాముఖిగా పోరాడలేని సమయంలో ఇలాంటి మైండ్‌గేమ్స్ ఆడటం సాధారణ విషయమే. అయితే మావోయిస్టుల విషయంలో పాలకులు ఆడిన ఈ మైండ్‌గేమ్ మరీ డొల్ల గేమ్‌లా తయారయ్యింది. 


మావోయిస్టులకు, ప్రభుత్వానికి మధ్య జరుగుతోంది ఒక యుద్ధం. అంతకంటే కొంచెం తక్కువ అని వివరించే పదం లేదనుకుంటా. కొంతమంది పవర్ గేమ్ ఆడుతారు. మరికొంతమంది మొరాలిటీ గేమ్ ఆడుతారు. ఇంకొంత మంది సెంటిమెంటల్ గేమ్ ఆడుతారు. ఇలా అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఇంతకు ముందు చేసాయి. ఇప్పుడూ చేస్తున్నాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమంటే మైండ్ ‌గేమ్‌కు ఒక లైఫ్ ఉంటుంది. ఆ కాస్త ప్రాణం పోతే ఉన్న విశ్వసనీయత ప్రజలలో గంగపాలవుతుంది.


మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు గణపతితో పాటు, ఆ పార్టీకి చెందిన ఇంకో నలుగురు అగ్ర నేతలు లొంగిపోనున్నారని మీడియాలో ప్రకటనలు గుప్పించారు. విప్లవకారులపై నిర్బంధం విపరీతంగా ఉన్న సమయంలో, అందునా కరోనా వైరస్ చెలరేగిపోతున్న కాలంలో, మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రతినిధులు ఆ మీడియా ప్రకటనలకు రెండు రోజుల్లోనే ప్రతిస్పందించడం గమనార్హం. ‘మా అగ్రనాయకులు ఎవరూ లొంగిపోబోవడం లేదు. ఆ ప్రకటనలు పూర్తిగా ఒక డ్రామా’ అని మావోయిస్టు పార్టీ నుంచి విస్పష్టమైన ప్రకటన రావడంతో మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ మైండ్ గేమ్ ఉద్దేశం ‘ఇక మావోయిస్టుల పని అయిపోయింది, వారు మూటాముల్లె సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని ప్రజలు భావించాలనే కాదూ? ఊహకు భిన్నంగా మావోయిస్టులు కేంద్ర కమిటీ స్థాయి నుంచి జెట్ ‌స్పీడ్‌లో పత్రికా ప్రకటన విడుదల చేయడంతో, గణపతి తదితరుల సంభావ్య లొంగుబాటు ప్రకటనలు చేసిన వారి అసలు లక్ష్యానికి ఆదిలోనే దెబ్బ తగిలింది. అంత నిర్బంధం ఉన్నా, అన్ని చోట్లా భౌతిక చలనం ఆగిపోయినా, మావోయిస్టులు అలా ప్రతిస్పందించగలిగారంటే, వాళ్ళ నిర్మాణ శక్తి ఎంత ఉందో తెలుస్తోంది.


మావోయిస్టులకు వ్యతిరేకంగా ఇటువంటి ఎత్తుగడలను ప్రభుత్వం ఎందుకు ప్రేరేపిస్తోంది? ‘నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు’ అని మావోయిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయుధాలు పట్టారు. ‘మాకు సరి అయినదిగా తోచింది మేము చేస్తాం. మధ్యలో నువ్వు వచ్చి ఆయుధం పట్టుకుని ప్రశ్నించడం ఏమిటి’ అని ప్రభుత్వం పోలీసులను, సైన్యాన్ని బరిలోకి దింపింది. ఇదో యుద్ధ వాతావరణాన్ని సృష్టించాక, యుద్ధ నీతిని పాటించే నియమబద్ధత ప్రభుత్వానికి ఏమి లేకుండా పోయింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సమాజానికి కావాల్సింది ఏమిటి అన్న విషయాలు మరుగున పడ్డాయి. ఏ పార్టీ అధికారానికి వచ్చినా ‘నియమాలు లేవు’ అనే నియమాన్ని అంగీకరించి, ఆ నియమానుగుణంగా ప్రవర్తిస్తున్నది. మొత్తానికి ఇది ‘మైండ్‌లెస్‌గేమ్’గా తయారయ్యింది. మీరు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి చంపుతాం అని ప్రభుత్వం చెప్పే వాదన కరెక్ట్ అని కాసేపు అనుకుందాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా ‘అర్బన్ నక్సల్’ గురించి ప్రస్తావిస్తూ ‘ఆయుధాలు పట్టని’ వాళ్ళు కూడా నక్సల్స్ అని తీర్మానించి చట్టాలు చేయాలన్నారు. ఆయుధాలు పట్టినా నక్సల్ అవుతాడు, ఆయుధాలు పట్టకున్నా నక్సల్ అవుతాడు అన్నది ఆయన మాటల సారాంశం. మరి ఎలా ఉంటే నక్సల్ కాకుండా పోతాడు? అంటే-– ప్రభుత్వానికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వ్యవహరించే ఉద్యమకారులు, నక్సల్ అనే కేటగరీ కిందకు రానివాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. అర్బన్ నక్సల్స్ ఆయుధాలు పట్టినా, పట్టకున్నా హింసాత్మక విధానాలను ప్రోత్సహిస్తారనే వైఖరిని ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసాక, ఆయుధాలు పట్టుకున్నవాళ్ళు ఆయుధాలు వదిలేయాలని ఆలోచించాలా? ఆయుధాలతో ఉండడమే బెటర్ అని ఆలోచించాలా? ఒక పక్క చారిత్రక నిర్మాణాలు ధ్వంసం చేస్తూ, మరో పక్క రాజ్యాంగ సంస్థలను బలహీన పరుస్తూ ఉండే ప్రభుత్వానికి, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఇలాంటి ఎత్తుగడలను ప్రేరేపించడం తప్ప ఏమి మిగులుతుంది?!


ఇప్పుడు ఈ మైండ్‌గేమ్ ఆడటం వల్ల దండకారణ్యంలో ‘జనతన సర్కార్’ను నిర్వహిస్తున్న మావోయిస్టులు తాము నడుపుతున్న స్కూల్స్ మూసేశారా, సమష్టి వ్యవసాయం ఆపేసారా, లేకపోతే మూకుమ్మడిగా వందల సంఖ్యలో ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగిందా? ప్రభుత్వం ఏమన్నా ఆలోచించి సాధించాలనుకుంటే ఇవే అయి ఉండాలి! ఇవేవీ కాలేదు మరి. రాజ్యాంగబద్ధంగా పని చేయాల్సిన ప్రభుత్వం, చవగ్గా మైండ్‌గేమ్స్ ఆడుతుంటే - అసలు సమస్యకు పరిష్కారం ఎవరూ తేలేరనే విషయాన్ని ఒప్పుకున్నట్టు అర్థమౌతుంది. మన రాజ్యాం గంలో, రాజ్యాంగాన్ని ఎవరైనా గౌరవించకున్నా, పాటించకున్నా, వాళ్ళకు రాజ్యాంగాతీతంగా శిక్షలు విధించాలనో, దేశ బహిష్కరణ చేయాలనో రాసుకున్నామా? లేదు. రాజ్యాంగాన్ని గౌరవించినవారికీ, రాజ్యాంగాన్ని గౌరవించని వారికీ మన రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగానే ట్రీట్‌మెంట్ ఉంటుంది. మన అందరికీ ఒకటే రాజ్యాంగం; దాన్ని నమ్మని వాళ్ళకు ఒక సెపరేట్ రాజ్యాంగం రాసి పెట్టుకోలేదు. పాకిస్థాన్ నుంచి ఈ దేశానికి వచ్చి ఇక్కడ అమాయకుల ఊచకోతకు పాల్పడిన కసబ్‌ను కూడా మనం రాజ్యాంగబద్ధంగానే విచారించి శిక్ష వేశాం. ‘మా దేశం వాడివి కాదు నీకు రాజ్యాంగాతీతంగా శిక్ష వేస్తాం’ అని మనం శిక్ష వేయలేదు. మావోయిస్టులు క్లియర్‌గా చెప్పేసారు– ‘మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు. అది సూచించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు అని’. అంతమాత్రాన వాళ్ళకు ఈ దేశ రాజ్యాంగం వర్తించకపోయే సమస్యే లేదు. ఎందుకంటే మావోయిస్టులు ఈ దేశంలో పౌరసత్వం కలిగిన ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. 


అటువంటి రాజ్యాంగ విలువలు, ప్రమాణాలు ఉన్న మన ప్రజాస్వామ్యంలో ఆశాభంగ ఉద్యమాల (frustrating movements) తీరుతెన్నులను రాజ్యాంగబద్ధంగా తర్కించాలి. ఈ విషయంలో ఏ ప్రభుత్వానికీ ఆప్షన్స్ లేవు. ఒకవేళ ఉన్నా, మిగిలి ఉన్న ఒకే ఒక ఆప్షన్ -ఈ రాజ్యాంగం మీద మాకు నమ్మకం లేదు మేము రాజ్యాం గాన్ని తిరగరాస్తాం అని తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చెప్పుకుని, ఆ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమ్మతి సంపాదించి, పార్లమెంటులో రాజ్యాంగ సవరణ విధానాల ప్రకారం సవరించడమే! మనమింత వరకు ఉన్నతంగా ఎత్తిపట్టుకున్న రాజ్యాంగం సమున్న తత్వమే ఇది! ఇది వదిలేసి -తాత్కాలికమైన, చవక సమాధానాలు వెతికి ఒక దీర్ఘకాల సమస్యను పరిష్కరిద్దామనుకోవడం కచ్చితంగా ఆలోచనాలోపమే! ఇక లేదంటే మిలిటరీ పాలన విధించాలి. అప్పుడు బీజేపీ మిలిటరీ పాలన చేసినా, మావోయిస్టులు మిలిటరీ పాలన చేసినా తేడా ఏమీ లేని విషయమే!


అందుకే అంబేడ్కర్ రాజ్యాంగం రచిస్తున్నప్పుడు రాజ్యాంగ నైతికత (constitutional morality) రాజ్యాంగం కంటే గొప్పది అని అన్నాడు. ‘చెడ్డ రాజ్యాంగమైనా మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే, మంచిగా అమలు కాబడే అవకాశాలున్నాయి’ అని ఆయన అన్నాడు. ‘రాజ్యాంగ నైతికతకు విరుద్ధమే అయినప్పటికీ, తమకు ఏది కరెక్ట్ అని భావిస్తున్నామో దానినే అన్ని పార్టీలు కరెక్ట్ అనుకోవాలి’ అని అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వమూ అనుకుంటూ పోతే ఇక రాజ్యాంగం ఎందుకు? అయోధ్యలో రామజన్మ భూమి అనే స్థలంలో గుడి కట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి తీర్పు ఇవ్వడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమా కాదా అన్న విషయాన్ని అలా ఉంచుదాం. అయితే ఆ తీర్పు కనీసం రాజ్యాంగ నియమాలను అనుసరించి ఇచ్చిన తీర్పు అన్న వాస్తవాన్ని మనం పరిగణనలోకి తీసుకుని తీరాలి. ఇష్టమున్నా లేకున్నా అందరూ శిరసావహించాల్సిందే. అదే సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ నియమాలను అనుసరించి ‘కోర్టు తీర్పు వెలువడకుండానే మసీదును ఎందుకు పడగొట్టేసారు’ అని ప్రశ్న వేయకపోవడం రాజ్యాంగ నియమాలకు, రాజ్యాంగ నైతికతకు పొందిక లేని విషయం.


మావోయిస్టుల సమస్యపై ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో భీకరమైన వాగ్దానాలు చేసాయి. ఆయుధాలు వదిలి పెట్టమని విజ్ఞప్తి చేస్తూ పలు ప్రతిపాదనలను ముందుకు తెచ్చాయి. ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చిన వారి పునరావాసానికి వివిధ పథకాలను ప్రకటించాయి. ఆ ప్రతిపాదనలు, పథకాల విషయంలో పాలకుల చిత్త శుద్ధి ఎంత అనే విషయాన్ని అలా ఉంచితే కనీసం నియమాత్మకంగా అయినా, ఈ దీర్ఘకాల మావోయిస్టుల సమస్యకు షార్ట్ కట్స్ ఏవీ లేవు అని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని మనకు అర్థమవుతుంది. ఇలా మైండ్‌గేమ్స్ ఆడి తమ దగ్గర ఈ సమస్య పరిష్కారానికి పెద్ద ప్లాన్స్ లేవు అనే విషయాన్ని చెప్పకుండానే చెప్పుకోవడం ద్వారా ప్రజల్లో నిస్సత్తువను సృష్టించడం అవుతుంది. మైండ్‌గేమ్స్ ఎత్తుగడలు ఎవరికీ ఉపయోగపడని విషయాలు అన్నది స్పష్టం. హిట్లర్ మిలిటరీ క్రికెట్ టీమ్ పెట్టి బ్రిటీష్ వాళ్ళతో ఆడి గెలవలేక క్రికెట్ గేమ్ రూల్స్ మార్చాడట. అప్పుడు అది క్రికెట్ అవుతుందా? అవ్వదు. వేరే ఏదో గేమ్ అవుతుంది. ప్రజాస్వామ్యం కూడా అంతే!

పి. విక్టర్ విజయ్ కుమార్

ఇన్వస్ట్‌మెంట్ బేంకర్, రచయిత, విమర్శకుడు

Updated Date - 2020-09-10T06:23:26+05:30 IST