లొంగిపోయిన మావోయిస్టు ముఖ్యనేత ఐతు

ABN , First Publish Date - 2021-08-28T00:40:15+05:30 IST

వృద్ధాప్యం, అనారోగ్య పరిస్థితుల కారణంగా మావోయిస్టు పార్టీ ముఖ్యనేత ఎక్కంటి సీతారాంరెడ్డి అలియాస్‌ ఐతు శుక్రవారం ఖమ్మం నగర

లొంగిపోయిన మావోయిస్టు ముఖ్యనేత ఐతు

ఖమ్మం: వృద్ధాప్యం, అనారోగ్య పరిస్థితుల కారణంగా మావోయిస్టు పార్టీ ముఖ్యనేత ఎక్కంటి సీతారాంరెడ్డి అలియాస్‌ ఐతు శుక్రవారం ఖమ్మం నగర పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ ఎదుట లొంగిపోయారు. 38ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన వృద్ధాప్యం, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకుని ఖమ్మం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. విద్యార్ధి దశలోనే పీపుల్స్‌వార్‌ ఆశయాలకు ఆకర్షితుడై రాడికల్‌ విద్యార్థి సంఘం నుంచి 1970లో పీపుల్స్‌వార్‌లో చేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చింతిర్యాల గ్రామానికి చెందిన సీతారాంరెడ్డి 1970లో పదోతరగతి పూర్తిచేసి హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో చేరారు. చదువుకునే సమయంలో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ) ప్రచార బాధ్యతలు నిర్వహించారు.


అదే క్రమంలో కొండపల్లి సీతారామరెడ్డి అలియాస్‌ సీతారామయ్యతో కలిసి సమావేశాల్లో పాల్గొన్నారు. 1981లో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ భద్రాచలం దళ సభ్యుడిగా చేరి.. 1982లో దళ కమాండర్‌గా శబరి, వెంకటాపురం, రంపచోడవరం దళంలో పనిచేశారు. 1985 ఏప్రిల్‌ 13న దోనెలంకపాలెం పోలీసులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. 1985నుంచి87వరకు జైలు జీవితం గడిపారు. 1988లో బెయిల్‌పై వచ్చి తన స్వగ్రామంలో భార్యపిల్లలతో 1991వరకు ఉన్నాడు. 1992లో తిరిగి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లోకి వెళ్లి రంగన్నదళం, మల్కన్‌గిరిలో మావోయిస్టు కార్యాకలాపాలు నిర్వహించాడు. 1999లో ఏరియా కమిటీ సభ్యుడిగా, పాములూరు దళ కమాండర్‌గా పనిచేశాడు. 2002లో ఐతు పాస్ట్‌ ఏరియా కమిటీ ఆంధ్రా-ఒడిస్సా (ఏవోబీ)బోర్డర్‌లో కార్యకలాపాలు సాగించాడు. 2008లో డివిజన్‌ కమిటీ సభ్యుడిగా మరియు ఏవోబీ సరిహద్దులోని స్పెషల్‌జోన్‌ కమిటీ ద్వారా మావోయిస్టు పార్టీ విస్తరణకు, కేడర్‌ బలోపేతానికి కృషి చేశాడు. 2008 నుంచి 2021వరకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తడం, వృద్ధాప్యం మీదపడటంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ రహస్య జీవితం గడుపుతున్న ఆయన శుక్రవారం ఖమ్మం నగర పోలీసుకమిషనర్‌ వద్ద లొంగిపోయాడు.

Updated Date - 2021-08-28T00:40:15+05:30 IST