సర్వే మాయ..

ABN , First Publish Date - 2022-01-29T05:04:26+05:30 IST

ఖిలావరంగల్‌ మండలం 43వ డివిజన్‌ రాంగోపాలపురం గ్రామంలో భూ వివాదం ముదురుతోంది. పదేళ్ల తర్వాత ఇళ్లను (రేకుల షెడ్‌లు) కూల్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

సర్వే మాయ..
రాంగోపాలపురంలో ఇళ్లను కూల్చిన స్థలంలో నిరసన తెలుపుతున్న బాధితులు

రాంగోపాలపురంలో ఎ.డి. సర్వే తీరుతో భూ వివాదం

పదేళ్ల తర్వాత ఇళ్ల కూల్చివేత 

న్యాయం కోసం బాధితుల పోరాటం


మామునూరు, జనవరి 28: ఖిలావరంగల్‌ మండలం 43వ డివిజన్‌ రాంగోపాలపురం గ్రామంలో భూ వివాదం ముదురుతోంది. పదేళ్ల తర్వాత ఇళ్లను (రేకుల షెడ్‌లు) కూల్చడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నాడు సర్వే చేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎ.డి.) సదరు స్థలాన్ని సర్వే నెం. 157/సీ, 257/డి లలో చూపిస్తే.. తాజాగా అదే స్థలాన్ని అదే ఎ.డి. సర్వే నంబర్‌ 280గా చూపించడం  వారి శాపంగా మారింది. దీంతో ఇండ్లు నిర్మించుకున్న అనుమతి పత్రాలతో బాధితులు న్యాయం కోసం పోరాడుతున్నారు. బాధితులు గుండారపు సంతోష్‌రావు, గుండారపు వెంకటేశ్వర్‌ రావు, ఎ.సమ్మక్క, కె.లింగమూర్తి, యాదగరి, సారంగపాణి, కనకచారి, రంగరాజు ప్రకాష్‌, బజ్జూరి నెలరాజు, జ్యోతి, భైరబోయిన తరుణ్‌, రాజేంద్ర ప్రసాద్‌, వెంకటేష్‌, కత్తెరశాల మధు, పదిలం శ్రీలత కథనం ప్రకారం...

పదేళ్ల క్రితం సర్వే నంబర్‌ 257లో భూమిని కొనుగోలు చేసి సుమారు 20 మంది కుటుంబాల వారు ఇళ్లు నిర్మించుకున్నారు.  2012లో  ప్రభాకర్‌ అనే  సర్వే  విభాగం ఎ.డి.తో 157/సీ, 257/డీలలో ఉన్న భూమిని సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వం నుం చి అన్ని రకాల అనుమతులు తీసుకోని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. ఇదే భూమిని సర్వే చేసిన ఎ.డి. ప్రభాకర్‌  వారం రోజుల క్రితం మాజీ కార్పొరేటర్‌కు, మరి కొందరికి సర్వే నంబర్‌ 280గా చూపించారు. దీంతో సర్వే నంబర్‌ 280లో అక్రమంగా ఇళ్లు నిర్మిం చారంటూ రెండు రోజుల క్రితం బాధితులను బెదిరించి మాజీ కార్పొరేటర్‌తో పాటు మరికొంతమంది వచ్చి ఇళ్లను నేల మట్టం చేశారు. 

 రెవెన్యూ శాఖ అధికారులు తప్పుడు లెక్కలు చూపి 257 సర్వే నంబర్‌ స్థానంలో 280 సర్వే నంబర్‌ భూమి ఉందని, ఇదే భూమిని కొందరు భూవ్యాపారులకు అంట గట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే 280 సర్వే నంబర్‌ ఎక్కడ ఉందో ఇంత వరకు అధికారులు తేల్చలేదని వారంటున్నారు. తాము ఇండ్లు నిర్మించుకున్న స్థలాన్ని తప్పుడు లెక్కలు చూపించి, పదేళ్ల తర్వాత వివాదం చేసి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

అన్ని రకాల అనుమతులతో ఇండ్లు నిర్మించుకున్నామని, తాము తప్పుడు సర్వేలో నిర్మించుకుంటే ఇన్నేళ్లు అధికారులు ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నిస్తున్నారు. తమ అన్యాయం జరిగిందని పోలీసులు మునిసిపల్‌ కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. ఇండ్లను నేల మట్టం చేసిన వారిపై ఉన్నతా ధికారులు చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తప్పుడు సర్వే చేసి తమను వీధిన పడేసిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-01-29T05:04:26+05:30 IST