నిఘా నిందలు

ABN , First Publish Date - 2021-07-20T08:40:18+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు వెలుగుచూసిన ‘పెగాసస్‌’ నిఘా వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నది....

నిఘా నిందలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ఒకరోజు ముందు వెలుగుచూసిన ‘పెగాసస్‌’ నిఘా వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతున్నది. దీని సమయం సందర్భాన్ని బట్టి విపక్షాల దురుద్దేశం విస్పష్టంగానే అర్థమవుతున్నదనీ, అసత్యాలూ అభాండాలతో ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయడానికే ఈ కుట్రజరిగిందని ప్రభుత్వం వాదిస్తున్నది. ఐటీ మంత్రి తీవ్ర ప్రతిదాడి తరువాత ఆయన పేరుకూడా జాబితాలో ఉన్నట్టుగా బయటపడటం మరో విశేషం. నలభైమందికి పైగా పాత్రికేయులు, ముగ్గురు విపక్షనేతలు, మోదీ సర్కారులోని ఇద్దరు మంత్రులు, భద్రతాసంస్థల అధిపతులు, వ్యాపారవేత్తలు మొత్తంగా ఓ మూడువందలమంది పెగాసస్‌ నిఘాలో ఉన్నారంటూ ‘ద వైర్‌’ వెలువరించిన తొలికథనానికి మరుసటి కథనం మరింత దన్ను చేకూర్చింది.


ఈ జాబితా వెనుక అంతర్జాతీయ మీడియా సంస్థల నెట్‌వర్క్‌, స్వచ్ఛంద సంస్థలు ఉన్నందున, భారతదేశంలో భాగస్వామిగా ఉన్న ‘ది వైర్‌’ మీద బీజేపీ నాయకుల విమర్శలకు విలువ చేకూరదు. జాబితాలో చోటుచేసుకున్నాయంటున్న పేర్లు సైతం ఆశ్చర్యం కలిగించేవి కావు. పాత్రికేయుల్లో అత్యధికులు ప్రభుత్వ వ్యతిరేక కథనాలకు ప్రసిద్ధులే. పేర్లతో పాటు వారు చేసిన చేసిన పరిశోధనలు, వేసిన నిఘా, రాసిన రాజకీయ కథనాలను వైర్‌ గుర్తుచేసింది. ఇక, రాహుల్‌గాంధీ, ప్రశాంత్‌కిశోర్‌, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ చోఖర్‌ వంటి పేర్లు, నిఘా కాలాలు అనుమానించడానికి వీల్లేని రీతిలోనే ఉన్నాయి. రాహుల్‌మీద సార్వత్రక ఎన్నికలకు ఏడాదిన్నర ముందునుంచే నిఘా అమలు జరిగిందనీ, ఆయన రెండు నెంబర్లతో పాటు, ఐదుగురు మిత్రులు మీద కూడా నిఘాపెట్టారని ఈ కథనం అంటున్నది. ఎన్నికల సమయంలో మాజీ కమిషనర్‌ అశోక్‌లావాసా నిరసన స్వరం తెలిసిందే. మొన్నటి బెంగాల్‌ ఎన్నికలు ఎంత కీలకమైనవో, అవి ఎలా జరిగాయో చూసిన తరువాత, మమత రాజకీయసలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌ ఫోనులోకి అదేసమయంలో నిఘా వైరస్‌ చొప్పించారనీ, ఆమ్నెస్టీ ల్యాబ్‌ ఫోరెన్సిక్‌ పరీక్షల్లో ఇది రుజువైందన్నదీ ఆశ్చర్యం కలిగించదు. పార్టీలోని కొందరు నాయకుల, మంత్రుల విశ్వాసాన్నీ, విధేయతనూ తూకం వేసి, పదవులు పంచడానికీ, పెంచడానికీ కూడా ఈ వైరస్‌ ఉపకరించినట్టు కనిపిస్తోంది. మొత్తంగా, గత మూడునాలుగేళ్ళకాలంలో అప్పటి అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాల్లోని కీలకమైన వ్యక్తుల ఫోన్లమీద పెగాసస్‌ పెత్తనం కొనసాగిందన్నది కథనం సారాంశం. 


పెగాసస్‌ నిఘాపై విపక్షాల రాద్ధాంతంలో కొంత రాజకీయం ఉండవచ్చు కానీ, వాటి వాదన, వేదన కొట్టిపారేయలేనిది. ‘మోదీ ప్రభుత్వం మీ పడగ్గది ముచ్చట్లు వింటున్నది జాగ్రత్త’ అంటూ పైకి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నా, ఈ తరహా నిఘా ఉన్నపక్షంలో రాజకీయంగా ఒక్క అడుగు కూడా వేయలేమని వాటికి బాగా తెలుసు. ఒక విదేశీ సంస్థకు ఇలా కీలకమైన డేటా ఇచ్చి కన్నేసి ఉంచమనడం, తెలిసింది పంచమనడం కంటే దేశద్రోహం ఉంటుందా అని అవి ప్రశ్నిస్తున్నాయి. ఏదో కన్సార్షియం ఓ యాభైవేల ఫోన్‌నెంబర్లను సంపాదించి, అవి హ్యాకయ్యాయని అంటే సరిపోతుందా అని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నది. భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికీ, వ్యవస్థలను అపఖ్యాతిపాల్జేయడానికీ ఒక భయంకరమైన కుట్ర జరుగుతోందని అంటోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు భారత వ్యతిరేక ఎజెండా ఉన్నదని ఆరోపిస్తోంది. 


‘నిఘా సాఫ్ట్‌వేర్‌ను మేం ప్రభుత్వాలకు, అది కూడా ఉన్నతమైన లక్ష్యాలకోసమే విక్రయిస్తాం’ అని పెగాసస్‌ ఇటువంటి కథనాలు వెలువడినప్పుడల్లా అదే పాటపాడుతోంది. భారతప్రభుత్వం ఈ వ్యాఖ్యల ముసుగులో, తాను సదరు స్పైవేర్‌ను వినియోగిస్తున్నదీ లేనిదీ చెప్పకుండా జాగ్రత్తపడుతోంది. రాజ్యాంగవ్యతిరేక చట్టాలు, చట్టవిరుద్ధమైన అరెస్టులు ఉండగా, చట్టవిరుద్ధమైన నిఘా మనదేశంలో అసాధ్యమన్న ప్రభుత్వ వాదన నమ్మశక్యంగా ఉండదు. ఈ దేశ ప్రజల వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛ, గౌరవాలకు విఘాతం కలిగించే ఇటువంటి దుశ్చర్చకు పాల్పడలేదని తగిన ఆధారాలు, సరైన వివరణలతో ప్రభుత్వం రుజువుచేసుకోవడం అవసరం.

Updated Date - 2021-07-20T08:40:18+05:30 IST