జిల్లాలో సత్ఫలితాలిస్తున్న నిఘా నేత్రాలు

ABN , First Publish Date - 2021-12-02T04:23:02+05:30 IST

జిల్లాలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. మూడు నెలల్లో కీలక చోరీలు జరుగగా వీటిని పరిష్కరించడాన్ని కాగజ్‌నగర్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

జిల్లాలో సత్ఫలితాలిస్తున్న నిఘా నేత్రాలు

-విగ్రహాల దొంగ పట్టివేత

-మెయిన్‌ మార్కెట్‌లో రూ.4లక్షల చోరీ కేసుకు తెర

-అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలు పెట్టేందుకు ఏర్పాట్లు

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 1: జిల్లాలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. మూడు నెలల్లో కీలక చోరీలు జరుగగా వీటిని పరిష్కరించడాన్ని కాగజ్‌నగర్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న కోదండ రామాలయంలోని రెండు ఉత్సవ విగ్రహాల చోరీ కేసును పరిష్కరించేందుకు పక్కా ప్రణాళికలను రూపొందించారు. ఈ దొంగతనం కేసులో పోలీసులు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద సీసీ ఫుటేజీల ద్వారా పక్కా ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాలను పరిశీలించి తాండూరు మండలానికి చెందిన తోడేటిశేఖర్‌గా నిర్ధారణకు వచ్చారు. మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే మాదిరిగా ఆలయంలో చోరి చేసినట్టు నిర్ధారణకు కావడంతో పోలీసులు పకడ్బందీగా శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపడంతో చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ కేసును కూడా సీసీ కెమెరాలకు చిక్కిన చిత్రాలతోనే పోలీసులు ఛేదించారు. అలాగే కాగజ్‌నగర్‌లో రద్దీగా ఉండే ఇందిర మార్కెట్‌లో నెలరోజుల క్రితం చిరు వ్యాపారి ప్రమీల వద్ద రూ.4లక్షలు చోరీ చేసిన ఘటనను కూడా పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదించారు. మార్కెట్‌లో చోరీ జరిగిన తర్వాత సీసీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా మంచిర్యాల్లో కూడా ఇదే తరహాలో జరగడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచిర్యాల పట్టణానికి చెందిన చునార్కర్‌ దేవాజీని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం అతనిని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇలా సీసీ కెమెరాలతో కేసులు పక్కాగా పరిష్కారమవుతుండడంతో పోలీసులు జిల్లాస్థాయిలో వాటిని ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా కాగజ్‌నగర్‌లోని వ్యాపారస్థులతో నెల రోజుల క్రితం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు వ్యాపారులు కూడా తమ దుకాణాల ఎదుట ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పుకున్నారు. అలాగే పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రధానంగా ఉండే దారుల్లోని ఇన్‌, ఔట్‌లకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సీసీ కెమెరాలను పూర్తిగా కాగజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి అనుసంధానం చేసేట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా అంతటా ఏర్పాటు చేసేందుకు చర్యలు..

-ఎస్పీ, వైవీఎస్‌ సుదీంద్ర 

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించాం. వీటి ద్వారా నేరాలను నియంత్రించవచ్చు.  వ్యాపార సంస్థల ఎదుట ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని యజమానులకు సూచిస్తున్నాం. అలాగే ప్రధాన వీధుల్లో కూడా ఇన్‌, ఔట్‌ దారులకు కూడా సీసీ కెమెరాలు బిగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 

సీసీ కెమెరాలతో త్వరితగతిన విచారణ..

-కరుణాకర్‌, డీఎస్పీ, కాగజ్‌నగర్‌

సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకోవడం సులభవమవుతుంది. పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా, ఇందిరా మార్కెట్‌, రైల్వే ఓవర్‌ బ్రిడ్జిపైన కెమెరాలను బిగించాం. ప్రధాన మార్కెట్‌లో కూడా ఇలాంటి సీసీ కెమెరాలను అమర్చుకోవాలని యాజమానులకు సూచించాం. మెయింటేనెన్స్‌ కోసం ప్రత్యేక నిపుణులను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందరూ తమ దుకాణాల వద్ద, కాలనీ సమీ పాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచింది.

Updated Date - 2021-12-02T04:23:02+05:30 IST