ధాన్యం కొనుగోళ్లపై నిఘా

ABN , First Publish Date - 2022-04-30T06:11:13+05:30 IST

జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికార యంత్రాంగం పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి గతంలో ధాన్యం తెలంగాణలో విక్రయించారని నిఘా వర్గాలు తెలుపడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ధాన్యం కొనుగోళ్లపై నిఘా
మద్నూర్‌ మండలం మహారాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు

- పొరుగు రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు

- అంతరాష్ట్ర సరిహద్దులపై నిఘా పెట్టిన పోలీసు, రెవెన్యూ శాఖలు

- సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు

- జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

- ఇప్పటి వరకు 11వేల మెట్రిక్‌ టన్నులకు పైగా కొనుగోళ్లు

- ప్రారంభమైన 110 కొనుగోలు కే ంద్రాలు


కామారెడ్డి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై అధికార యంత్రాంగం పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి గతంలో ధాన్యం తెలంగాణలో విక్రయించారని నిఘా వర్గాలు తెలుపడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పొరుగు రాష్ట్రాల ధాన్యం తెలంగాణలో విక్రయించకుండా చూడాలని ఆయా జిల్లాల యంత్రాంగానికి గట్టి ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం సైతం ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా ఇతర రాష్ట్రాల నుంచి దళారులు ధాన్యాన్ని జిల్లాలో విక్రయించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అంతరాష్ట్ర సరిహద్దులపై పోలీసు, రెవెన్యూశాఖలు నిఘా పెట్టాయి. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా రైస్‌మిల్లుల్లోనూ ధాన్యం నిల్వలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిఘా పెట్టింది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 

సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను సరిహద్దులుగా కామారెడ్డి జిల్లా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి దళారులు, కొంతమంది వ్యాపారులు అక్రమంగా ధాన్యాన్ని జిల్లాకు తీసుకువచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారని నిఘా వర్గాలు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చూడాలని సరిహద్దు జిల్లాల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం పొరుగు రాష్ట్రాల సరిహద్దులపై నిఘా పెట్టి చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌, జుక్కల్‌, పిట్లం మండలాల్లోని కర్ణాటక బార్డర్‌లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రెవెన్యూ, పోలీసులు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే భారీ లోడ్లు గల వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా ధాన్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లుల్లోనూ నిఘా

రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైంది. జిల్లా యంత్రాంగం సైతం కొనుగోళ్ల ప్రణాళికలను రూపొందించి కొనుగోళ్లను చేపడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం కొనుగోలు కేంద్రాలతో పాటు ధాన్యం కేటాయించిన రైస్‌మిల్లులపై నిఘా పెట్టింది. జిల్లా వ్యాప్తంగా 341 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 84 రైస్‌మిల్లులకు అలాట్‌మెంట్‌ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో, రైస్‌మిల్లులో తరుగు తీయకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే రైతుల నుంచి సరైన ధ్రువపత్రాలు తీసుకోవడంతో పాటు కేంద్రాల నిర్వాహకులు వేబిల్లులు ఇవ్వడం అందులో పొందుపరిచిన ధాన్యం తూకం మిల్లులకు వెళ్లే సరికి సమానంగా ఉందా లేదా అనే దానిపై అధికారులు నిఘా పెట్టారు. ఇలా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా చూస్తున్నారు.

3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తారని అంచనా

ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.68లక్షల ఎకరాల్లో  రైతులు వరి పంటను సాగు చేశారు. ప్రధానంగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ దిగువన నిజాంసాగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, నస్రుల్లాబాద్‌, పోచారం ప్రాజెక్టు కింద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌ మండలాలతో పాటు మాచారెడ్డి, దోమకొండ, కామారెడ్డి మండలాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. ఈ లెక్కన యాసంగిలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని, వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేశారు. అయితే కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

110 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఈ యాసంగి సీజన్‌లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 341 కేంద్రాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 110 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు 61 కేంద్రాల్లో 1,418 మంది రైతుల నుంచి రూ.22 కోట్లు విలువ చేసే 11వేల 375 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో రూ.81లక్షలు ఆయా రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులను జమ చేశారు. యాసంగి సీజన్‌లో కొనుగోళ్ల కోసం 338 కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ఽధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్‌ల ద్వారా 314, ఐకేపీల ద్వారా 20, మార్కెట్‌ యార్డులు 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి ధాన్యం సేకరణకు  1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు అవసరమైన ప్యాడీ కీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. యాసంగి సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం గతంలోనే మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్‌ వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1,960, కామన్‌ గ్రేడ్‌ వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1,940ల మద్దతు ధరను కేటాయించింది. 


అక్రమాలు జరగకుండా చూస్తున్నాం

- చంద్రమోహన్‌, అదనపు కలెక్టర్‌, కామారెడ్డి

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలు కేంద్రాలపై, రైస్‌మిల్లులపై నిఘా పెట్టడమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు 61 కేంద్రాల్లో 14 వందల మంది రైతుల నుంచి 11 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. 

Updated Date - 2022-04-30T06:11:13+05:30 IST