మూసీ నదిపై నిఘా!

ABN , First Publish Date - 2021-01-18T09:29:04+05:30 IST

మూసీనదిపై అధికారులు నిఘా పెట్టారు. మూసీలో ఎక్కడ చెత్త వేసినా లేదా వ్యర్థాలు పారబోసినా ఇట్టే పసిగట్టేస్తారు. సంబంధిత వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు..

మూసీ నదిపై నిఘా!

పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు

త్వరలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

చెత్త వేయకుండా, కబ్జా కాకుండా కట్టడి


హైదరాబాద్‌ సిటీ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మూసీనదిపై అధికారులు నిఘా పెట్టారు. మూసీలో ఎక్కడ చెత్త వేసినా లేదా వ్యర్థాలు పారబోసినా ఇట్టే పసిగట్టేస్తారు. సంబంధిత వ్యక్తులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు.. మూసీనదిలో వివిధ ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలు పారబోస్తూ నదిని పూడ్చివేయడంతో పాటు కబ్జాకు యత్నిస్తున్న అక్రమార్కులపైనా ఓ కన్ను వేశారు. ఇందులో భాగంగా తూర్పున ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి పశ్చిమాన ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఉన్న మూసీనది వెంట సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటన్నింటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి నిఘాను పెంచనున్నారు.


మూసీనదిలో వివిధ ప్రాంతాల్లో అడ్డగోలుగా చెత్తవేస్తున్నారు. హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లతో పాటు పలు వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు చెందిన వ్యర్థాలన్నీ రాత్రి సమయంలో మూసీనదిలో వదులుతున్నారు. దాంతో సమీప ప్రాంతాలు దుర్గంధమవుతున్నాయి. దోమలకూ ఆవాసంగా మారుతోంది. మూసీనదిలో చెత్త వేయకుండా చూసేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా బ్రిడ్జిలున్న ప్రాంతాల్లో ఎత్తుగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి అక్కడే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలు పోసి కబ్జాలకు యత్నించకుండా ఆయా ప్రాంతాలను గుర్తించి అక్కడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. 


కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి ప్రస్తుతం మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీగానూ ఉన్నారు. దీంతో ఈవీడీఎం సిబ్బందిని కూడా మూసీనది వెంట వివిధ అవసరాలకు వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నారు. మూసీనది వెంట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని తార్నాకలోని ఎంఆర్‌డీసీఎల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. నిరంతర నిఘా వల్ల మూసీలో ఎవరైనా చెత్త వేసినా.. నిర్మాణ వ్యర్థాలను పారబోసినా వెంటనే పసిగట్టేస్తారు. ఈవీడీఎం సిబ్బందిని లేదా పోలీసులను అప్రమత్తం చేస్తారు. ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-01-18T09:29:04+05:30 IST