‘అలలపై నిఘా, కలలపై నిఘా’

ABN , First Publish Date - 2021-11-03T06:03:17+05:30 IST

ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జి ఆర్వెల్ రాసిన ‘1984’ నవలలో ఓసియానా అనే సూపర్ దేశం ఒకటుంటుంది. ఆ దేశానికి సూపర్ బాస్ ఒకరుంటారు. అతడే బిగ్ బ్రదర్. మహాపురుషుడని, మహానుభావుడని...

‘అలలపై నిఘా, కలలపై నిఘా’

ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జి ఆర్వెల్ రాసిన ‘1984’ నవలలో ఓసియానా అనే సూపర్ దేశం ఒకటుంటుంది. ఆ దేశానికి సూపర్ బాస్ ఒకరుంటారు. అతడే బిగ్ బ్రదర్. మహాపురుషుడని, మహానుభావుడని అతడిని నిరంతరం ఊదరగొడుతూ అతడు లేకపోతే అంతా అల్లకల్లోలమవుతుందని ప్రచారంచేసే పార్టీ యంత్రాంగం ఒకటి ఉంటుంది. ఆ దేశంలో సర్వత్రా నిఘా ఉంటుంది. స్వతంత్ర ఆలోచనలను పసికట్టే పోలీసు యంత్రాంగం ఉంటుంది. 1949లో ఈ నవల రాసినప్పుడు, పెగాసస్ వంటి గూఢచర్యం చేసే ఆధునిక సాఫ్ట్‌వేర్ అనేది ప్రపంచంలో వినియోగానికి వస్తుందని, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొచ్చుకుపోతుందని ఆర్వెల్ ఊహించి ఉండరు. అయితే అంతటా టెలిస్క్రీన్లు, కెమెరాలు, మైక్రోఫోన్లను అమర్చి నిరంతరం జనంపై నిఘా వేసే రాజ్యాలు ఉంటాయని ఊహించారు. ‘అలలపై నిఘా, అలలు కనేకలలపై నిఘా, చిరుగాలి సితారా సంగీతంపై నిఘా, అలలపై కదిలే పడవలపై నిఘా, పడవల తెరచాపలపై నిఘా, తెరచాపల తెల్లదనంపై నిఘా’ అని ప్రముఖ కవి శివసాగర్ రచించిన కవిత్వం తాలూకు ప్రకంపనలు ఆర్వెల్ రచనలో మనకు కనిపిస్తాయి. అధికారిక వ్యవస్థ ఎవర్ని అనుమానించినా వారు వ్యక్తులుగా ఈ భూప్రపంచం నుంచి అదృశ్యమవుతారు. వారితో పాటు సాక్ష్యాలూ అంతమవుతాయి. నియంతృత్వ పోకడలు కనిపించినప్పుడల్లా ఆర్వెల్ కల్పించిన ఆసమాజం గురించి మేధావులు ప్రస్తావించడం పరిపాటి.


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ కూడా ఇజ్రాయిల్‌ సంస్థ ఎన్‌ఎస్‌ఓ సృష్టించిన పెగాసస్ స్పైవేర్‌కు సంబంధించి వెలువరించిన సంచలనాత్మకమైన తీర్పును ఆర్వెల్‌ తన 1984 నవలలో ప్రస్తావించిన వాక్యాలతో ప్రారంభించారు. ‘నీవు ఒక విషయాన్ని రహస్యంగా ఉంచాలంటే దాన్ని నీ నుంచి కూడా దాచుకోవాలి..’ అన్న వాక్యంతో ఈ తీర్పు ప్రారంభమవుతుంది. ‘మనం వినేది వాళ్లు వింటారు. మనం చూసేది వాళ్లు చూస్తారు. మనం చేసేది వారు పసికడతారు’ అని ఆర్వెల్ వెలిబుచ్చిన ఆందోళనలను పిటిషన్ దార్లు వ్యక్తం చేశారని జస్టిస్ రమణ వెల్లడించారు.


మనం ఆర్వెల్ సమాజంలో ఉన్నామా? మోదీ ప్రభుత్వంఎందుకు ఈ అనుమానాలను కలిగిస్తోంది? మీరెందుకు గూఢచర్యం చేశారు అన్న ప్రశ్నకు ప్రభుత్వం కనీసం అఫిడవిట్ కూడా దాఖలు చేసేందుకు ఎందుకు సిద్ధపడలేదు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో ఆర్వెల్ సమాజాన్ని గుర్తు చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ప్రజల వ్యక్తిగత జీవితాలు వారి ప్రైవేట్ ఆస్తులతో సమానమని పాశ్చాత్య దేశాల్లో ఉన్న భావనను ఆయన వివరించాల్సి వచ్చింది. ప్రతి మనిషి ఇల్లూ అతడికి ఒక భవనం లాంటిది. అతడి అనుమతి లేకుండా అందులో ప్రవేశించే హక్కు ఎవరికీ లేదన్న విషయాన్ని అమెరికా, బ్రిటన్‌లాంటి దేశాల్లో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ఆలంబనతో జస్టిస్ రమణ నొక్కి చెప్పాల్సి వచ్చింది. ‘ఒక సామాన్యుడు గుడిసెలో నివసిస్తున్నా, ఆ గుడిసె వర్షాలకూ, తుఫానుకూ శిథిలమైపోయినా, అందులో ప్రవేశించే హక్కు చక్రవర్తికి కూడా ఉండదు’ అని 18వ శతాబ్దంలో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న విలియం పిట్ అన్న వ్యాఖ్యల్ని ఆయన ఉటంకించారు. అంతే కాదు, భారత రాజ్యాంగం ప్రజల వ్యక్తిగత జీవితాలను ప్రైవేట్ ఆస్తుల కంటే ప్రాణ ప్రదంగా భావించిన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రజల ప్రైవసీ హక్కులను జీవించే హక్కులో భాగంగా పరిగణించిందన్న విషయాన్ని తెలిపారు. జీవించే హక్కు అంటే కేవలం జంతువులా జీవించడం కాదు, జీవించడం అంటే ఒక నాణ్యమైన, నిర్భయాత్మకమైన, స్వేచ్ఛగా ఊపిరి పీల్చగల జీవితం పొందడం అని సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు మోదీ ప్రభుత్వానికి జస్టిస్ రమణ చెప్పాల్సి వచ్చింది. సమాచార విప్లవ యుగంలో ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు టెక్నాలజీ ఉపయోగపడాలి కాని, వ్యక్తి పవిత్రమైన ప్రైవేట్ జీవితంలో చొచ్చుకురావడానికి కాదని బోధించడానికి ఆయన వెనుకాడ లేదు. చట్టబద్ధమైన పాలన కొనసాగాల్సిన ప్రజాస్వామిక ప్రపంచంలో విచ్చలవిడిగా వ్యక్తులపై గూఢచర్యం సాగించడం భావ వ్యక్తీకరణపై దాడి మాత్రమేకాక, ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు. జాతీయ భద్రత బూచి చూపించినంత మాత్రాన కోర్టు మౌన ప్రేక్షక పాత్ర వహించదని ఆయన స్పష్టం చేశారు.


స్వాతంత్ర్యం తర్వాత భారత న్యాయవ్యవస్థ వెలువరించిన కొన్ని చరిత్రాత్మక తీర్పుల జాబితాలో పెగాసస్ గూఢచర్యంపై జస్టిస్ రమణ వెలువరించిన తీర్పు చేరుతుందన్న విషయంలో సందేహం లేదు. ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి పోసిందని, న్యాయవ్యవస్థ గౌరవం నిలబెట్టిందని న్యాయ, రాజ్యాంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తుండగా అధికార యంత్రాంగంలో ఒక నీరవ నిశ్శబ్దం నెలకొన్నది.


ఈ తీర్పు వెలువడిన సమయంలోనే 1935 తర్వాత మొట్టమొదటిసారి ఇద్దరు జర్నలిస్టులకు నోబెల్ శాంతిపురస్కారాన్ని ప్రకటించారు. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతున్న సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛకోసం సాహసోపేత పోరాటం చేస్తున్నందుకు ఫిలిప్పీన్స్ జర్నలిస్టు మరియా రెస్సా, రష్యన్ జర్నలిస్టు డిమిట్రీ మురటోవ్ లకు ఈ పురస్కారాన్ని అందించాలని నిర్ణయించినట్లు నోబెల్ పురస్కార కమిటీ ప్రకటించింది. ‘రాప్లర్ డాట్ కామ్’ పేరిట డిజిటల్ మీడియా వేదికను స్థాపించి పరిశోధనాత్మక జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్న మరియా రెస్సా దశాబ్దాలకు పైగా సిఎన్‌ఎన్ వంటి సంస్థల్లో పనిచేశారు. తప్పుడు వార్తల్ని, ప్రత్యర్థులను వేధించడాన్ని, విద్వేష భావాలను ప్రచారం చేసి, విషయాలను వక్రీకరించి ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయడాన్ని ఆమె నిరంతరం వ్యతిరేకించారు. బూటకపుఖాతాల ద్వారా ఇంటర్నెట్ లో ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలను ఆమె ఎండగట్టారు.


‘నేతలు ప్రజాస్వామికంగా ఎన్నికవుతారు. హిట్లర్ కూడా ప్రజాస్వామికంగా ఎన్నికైన నేతే. కాని ఒకసారి అధికారం చేతికి చిక్కిన తర్వాత వారు ప్రజాస్వామ్యంతో చెలగాటం ఆడడం మొదలుపెడతారు..’ అని మరియా రెస్సా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు డుటెర్టే కూడా ప్రజాస్వామికంగా ఎన్నికైన నేతే. కాని ఆయన పాలనలో 19 మంది జర్నలిస్టులు, 63మంది న్యాయవాదులు, 400మందికిపైగా మానవ హక్కుల కార్యకర్తల్ని చంపారని ఆమె తెలిపారు. ‘ఒక నియంతను ఎలా ఎదుర్కోవాలి’ (హౌటూ స్టాండప్ టు ఎ డిక్టేటర్) అని రాసిన పుస్తకంలో మరియా రెస్సా ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా వివిధ దేశాల్లో నియంతలు పరిహాసమాడుతున్నారో వివరించారు. మనకు కనపడని అణుబాంబు ఇంటర్నెట్ ద్వారా మన స్వేచ్ఛల్ని భగ్నంచేస్తూ తప్పుడు సమాచార నెట్ వర్క్‌ను ఎలా విస్తరింపచేస్తోందో ఆమె చెప్పారు. ఫిలిప్పీన్స్‌లో మరియా రెస్సా చేసిన పనినే రష్యాలో మరో జర్నలిస్టు డిమిట్రీ మురటోవ్ చేశారు. క్రూరమైన చట్టాలు ప్రయోగించడం, వెబ్‌సైట్‌లను, ఇంటర్నెట్‌ను నిరోధించడం, అవినీతిని ప్రశ్నించిన వారిని హత్య చేయడం సాధారణమైన పరిస్థితుల్లో మురటోవ్ ‘నోవయా గెజె’టా పత్రికను స్థాపించి అనేక కుంభకోణాలను వెలికి తీశారు. ఈ పత్రికలో పనిచేసిన అనేకమంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారంటేనే ఆ పత్రిక ఎలాంటి సవాలుతో కూడిన వాతావరణంలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.


పలుదేశాల్లో ప్రజాస్వామ్యం అనేది ఒకప్రహసనంగా మారిపోయింది. ఇది వ్యవస్థలకు సంబంధించిన లోపం కానే కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైనా, అధ్యక్ష ప్రజాస్వామ్యమైనా దాన్ని ఉపయోగించుకునే నేతల తీరుతెన్నులకు సంబం  ధించిన అంశం. ఫిలిప్పీన్స్ లోనూ, రష్యాలోనూ అధ్యక్ష పాలనా వ్యవస్థే అమలులో ఉన్నది. భారత దేశంలో పూర్తిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థే అయినప్పటికీ అత్యధిక మెజారిటీ లభించిన తర్వాత నేతలు రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌నూ, ఇతర వ్యవస్థల్ని అపహాస్యం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణలో వేల కోట్లు వెదజల్లడం, ప్రజాస్వామికంగా ఎన్నికైన నేతలు ఇష్టారాజ్యంగా చట్టాలు చేయడం, తీవ్రమైన అవినీతికి పాల్పడడం, అధికారం ఉన్నది కదా అని ప్రత్యర్థులను భయభ్రాంతులను చేయడం కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛసూచికలో ఫిలిప్పీన్స్ 138వ స్థానంలో ఉండగా, రష్యా 150వ స్థానంలో ఉన్నది. భారత్ కూడా వీటికి ఏమీ తీసిపోకుండా 142వ స్థానం సంపాదించింది. సరైన విధంగా ఉద్యోగం చేయాలనుకునే జర్నలిస్టులకోసం భారత దేశం ప్రమాదకరమైనదేనని, పోలీసులు, రాజకీయ నాయకులు, నేరచరితులు, అవినీతి అధికారులనుంచి వారికి ప్రమాదం పొంచి ఉన్నదని ఈ సూచికను తయారు చేసిన ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది.


ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మన దేశంలో నాయకులు పదేపదే చెప్పుకుంటున్నప్పటికీ ఆ ప్రజాస్వామ్యం ఒక మేడిపండుగానే మిగిలిపోయిందని జస్టిస్ రమణ వంటి న్యాయమూర్తులు తీర్పులు చెప్పినప్పుడు, పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడిన జర్నలిస్టులు నోబెల్ బహుమతి పొందినప్పుడు మాత్రమే కాదు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మనకు అర్థమవుతుంది– మనం ఒక ఆర్వెల్ సమాజంలో ఉన్నామన్న విషయం తెలుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన కర్తవ్యం కేవలం న్యాయవ్యవస్థలకు మాత్రమే లేదు. అంతర్జాతీయంగా సుప్రసిద్ధుడైన జస్టిస్ రవీంద్రన్ వంటి న్యాయమూర్తి పర్యవేక్షణలో ఒక కమిటీ నియమించడం ద్వారా దేశంలో ప్రజల ప్రైవసీ హక్కులను కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన దిశానిర్దేశాన్ని చేయవచ్చు. కానీ ప్రభుత్వాలు పారదర్శకంగా పనిచేయడానికి సిద్ధపడకపోతే, ప్రత్యర్థులను అణచివేయడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించుకోవడం మానకపోతే కేవలం న్యాయ వ్యవస్థ మాత్రం ఏం చేయగలదు?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2021-11-03T06:03:17+05:30 IST