సర్వే మర్మమేంటి..?

ABN , First Publish Date - 2020-12-04T06:22:27+05:30 IST

నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది. సంక్షేమ పథకాల తీరు ఎలా ఉందంటూ అధికారపక్షం హఠాత్తుగా సర్వేకు దిగింది

సర్వే మర్మమేంటి..?

రంగంలోకి రహస్య బృందాలు

వైసీపీ హఠాత్‌ నిర్ణయంపై టెన్షన్‌ టెన్షన్‌

నరసాపురం లోక్‌సభ పరిధిలో మొదలైన ఆరా 

ఎన్నికలొస్తే గెలుపు గుర్రాలు ఎవరో పసిగట్టే యత్నం

ప్రతిపక్ష పార్టీల కన్వీనర్ల తీరుపైన పరిశీలన

ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలో ప్రశ్నల వర్షం

(ఏలూరు/తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంది. సంక్షేమ పథకాల తీరు ఎలా ఉందంటూ అధికారపక్షం హఠాత్తుగా సర్వేకు దిగింది. మూడోకంటికి తెలి యకుండా రెండు సర్వే సంస్థలను రంగంలోకి దించింది.  పార్టీలోవున్న అంతర్గత ధోరణి పసిగట్టేందుకు వీలుగా సర్వేకు దిగారా..? లేకుంటే ఉపఎన్నిక అనివార్యమైతే ‘ముందస్తు’ జాగ్ర త్తగా ప్రజానాడి పసిగట్టేందుకు ఆరా తీస్తున్నారా..? అనే సం దేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఇవాళో రేపో ఎన్నికలు జరగబో తున్నాయా అన్నట్లు అభ్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ వీరిలో గెలుపు గుర్రాలు ఎవరంటూ ప్రశ్నావళి రూపొందించారు. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాల్లో అక్కడ వైసీపీ కన్వీనర్లను బరిలోకి దించితే ఎలా ఉంటుందంటూ ఇంకొన్ని ప్రశ్నలు సంధించారు. హఠాత్తుగా సర్వేకు దిగడంపై సస్పెన్స్‌ నెలకొంది. నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలో అనూ హ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? రాజకీయ సమీకరణలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయా..? అనే సందే హాలు పుట్టుకొచ్చాయి. తెలుగుదేశం, బీజేపీ–జనసేన బలాబ లాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

అసలెందుకీ సర్వే ? 

ఇప్పటికిప్పుడు లోక్‌సభకు గాని, అసెంబ్లీ స్థానాలకు గాని ఎలాంటి ఉప ఎన్నికలు జరిగే సంకేతాలు లేవు. కానీ హఠాత్తు గా అధికారపక్షం నర్సాపురం లోక్‌సభను టార్గెట్‌గా చేసుకుని ముందస్తు హడావుడికి దిగుతోంది. నర్సాపురం సిట్టింగ్‌ ఎంపీ కనుమూరి రఘు రామకృష్ణంరాజు ఇప్పటికే చాలాకాలం నుంచి వైసీపీని రకరకాలుగా ఇరుకున పెడుతున్నారు. కీలక అంశాల్లో నిలదీస్తున్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరి ణామాలను దృష్టిలో పెట్టుకునే నర్సాపురం లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమైతే పరిస్థితి ఏమిటనే ముందు చూపుతోనే వైసీపీ సన్నద్ధం అవుతోందా? అనే సందేహం లేక పోలేదు. నర్సాపురం లోక్‌సభ స్థానం పరిధిలో రఘురామ కృష్ణంరాజుతోపాటు గాదిరాజు సుబ్బరాజు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గోకరాజు రంగరాజు పేర్లను నేరుగా సర్వే పత్రాల్లో ప్రస్తావించారు. వీరిలో ఒకవేళ పార్లమెంటు స్థానానికి ఎన్ని కలు వస్తే ఎవరైతే బావుంటుంది..? ఎవరికి గెలుపు అవకా శాలు మెండుగా ఉన్నాయనే దానిపైనా ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం పక్షాన శివరామరాజు పేరును ఈ సర్వేలో పొందుపర్చారు. వీటన్నింటిపైనా  ప్రజల  అభిప్రాయాన్ని సేకరిస్తూనే మరోవైపు వైసీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన, ఇతర పార్టీల బలాబలాలు, తీరు తెన్నులపైనా ప్రజానాడి తెలుసు కోనున్నారు. నర్సాపురం లోక్‌సభస్థానం నుంచి గతంలో తమ పార్టీ అభ్యర్థిగా రఘురామ గెలుపొందినప్పటికీ ఇంకోవైపు టీడీపీ, మరోవైపు జనసేన, కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అందుకనే ఇప్పుడు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు బరిలో ఉంటే ఏ మేరకు ప్రభావితం చేస్తారనేదానిపై వైసీపీ అధిష్ఠానం బాణం ఎక్కుపెట్టింది. ప్రత్యేకించి గాదిరాజు సుబ్బరాజు చాలాకాలంగా పార్టీకి అనుకూలంగాను, అత్యంత విధేయుడిగా కొనసాగుతున్నారు. అలాగే మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజును పార్టీలోకి తీసుకోవడమే కాకుండా రఘురామకృష్ణంరాజుకు చెక్‌ పెట్టేందుకు ఆయనను పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఇదే తరుణంలో తాజా సర్వేలో గోకరాజు రంగరాజు పేరును ప్రస్తావిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అన్నింటికంటేమించి నర్సాపురం లోక్‌సభ స్థానంలో కీలక రాజకీయ పరిణామాలు జరగబోతున్నాయన్న సంకేతాలను అధికారపక్షం దాదాపు లీక్‌ చేసినట్లుగా భావిస్తున్నారు. 

ఎమ్మెల్యేల పనితీరుపైనా ఆరా

నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అయితే ఉండిపైనే వైసీపీ దృష్టి పెట్టినట్లుగా కనబడుతోం ది. ఇక్కడ వైసీపీ కన్వీనర్‌గా పీవీఎల్‌ నరసింహరాజు కొనసాగుతున్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే తమ పార్టీ అభ్యర్థిగా నరసింహరాజు నిలబడితే బలాబలాలపైన సర్వే ద్వారా ముందస్తు సమాచారం రాబట్టబోతున్నారు. ఇదే తరుణంలో నర్సాపురం లోక్‌సభ స్థానం సిట్టింగ్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోకడలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణతో పాటు పార్టీలోని వాతావరణాన్ని అంచనా వేసేందుకేనని చెబుతున్నారు. పనిలోపనిగా ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును సర్వే ద్వారా ఆరా తీస్తున్నారు. దీంతోపాటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఎంది..? సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి ? ఎన్నికలంటూ వస్తే పోటీ చేసే అభ్యర్థుల్లో గెలుపు గుర్రా లేవి..? మిగతా పక్షాల్లో అభ్యర్థుల పరిస్థితి ఏమిటి అనే విషయాలను పూర్తిగా ఆరా తీయనున్నారు. అత్యంత గోప్యంగానే ఈ సర్వే నిర్వహించేందుకు ఇప్పటికే సర్వేల్లో ఆరి తేరిన రెండు ప్రముఖ సంస్థలకు వైసీపీ బాధ్యత అప్ప గించింది. ఇప్పటికే సర్వే బృందాలు కార్యరంగంలోకి దిగా యి. యువత, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, సామాజిక వర్గాల వారీగా ప్రజామోదాన్ని అంచనా కట్టబోతున్నారు. ఆ నోట ఈ నోట సర్వే అంశం పార్టీ కేడర్‌కు చేరింది. ప్రత్యేకిం చి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రధాన ప్రశ్న ఉండడంతో ఎమ్మె ల్యేల్లోనూ వారి అనుచరుల్లోనూ కలకలం రేగింది. సంక్షేమ పథకాల అమలు ఎలా ఉందని ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2020-12-04T06:22:27+05:30 IST