మీరేం చేస్తారు..?

ABN , First Publish Date - 2021-03-01T07:33:59+05:30 IST

కుటుంబ ఆర్థిక జీవన ప్రమాణాలు తెలుసుకుని

మీరేం చేస్తారు..?
ఖైరతాబాద్‌లో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

జిల్లాలో సాగుతున్న ‘ఆర్థిక గణన’


13 లక్షల మంది వివరాల సేకరణ

ఈ నెల 31 వరకు గడువు

ఏడు మండలాల్లో 80 శాతం పూర్తి

పాతబస్తీలో 20 శాతమే

వివరాలు చెప్పేందుకు కొందరి వెనకడుగు 


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కుటుంబ ఆర్థిక జీవన ప్రమాణాలు తెలుసుకుని భవిష్యత్‌లో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన ఆర్థిక గణన సర్వే జిల్లాలో మందకొడిగా సాగుతోంది. పేద, ధనిక వర్గాల ఆర్థిక స్థితిగతులు, వారు ఏయే వృత్తులు, వ్యాపారాలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఒక సమూహంలో ఎక్కువమంది ఎలాంటి ఉపాధిపై జీవిస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న సర్వేలో భాగస్వాములయ్యేందుకు చాలామంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎన్యూమరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర సాంకేతిక, సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక గణన శాఖ పర్యవేక్షణలో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎ్‌సఈ) బృందం ఈ సర్వే చేస్తోంది.  సర్వేలో వివరాలు వెల్లడించేందుకు కొందరు ఆసక్తి చూపుతుండగా, మరికొందరు వెనకంజ వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 2013లో ఆరో ఆర్థిక గణనను నిర్వహించారు. అప్పుడు దాదాపు 14 లక్షల కుటుంబాలను సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు.  గతేడాది మార్చి నుంచి డిసెంబర్‌ 31లోగా ఏడో విడత గణనను పూర్తి చేయాలని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా కరోనా నేపథ్యంలో దాదాపు 9 నెలలపాటు వాయిదా పడింది. 


25 బ్లాకులుగా సర్వే..

కలెక్టర్‌ శ్వేతామహంతి ఆదేశాల మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి డాక్టర్‌ సురేందర్‌ పర్యవేక్షణలో డిసెంబర్‌ 10 నుంచి జిల్లాలోని 13 మండలాల్లో సర్వే చేపడుతున్నారు. మొత్తం 1,421 మంది ఎన్యూమరేటర్లు, 198 సూపర్‌వైజర్లు, 266 ఇన్వెస్టిగేటర్‌ యూనిట్‌ (ఐవీటీ)లలో పర్యటిస్తున్నారు. ఒక్కో మండలాన్ని 25 నుంచి 30 బ్లాక్‌లుగా విభజించారు.  రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ రెసిడెన్షియల్‌ కేటగిరి కింద  కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఇంటి యజమాని చేసే వృత్తి, వ్యాపారం, తదితర వివరాలు సేకరిస్తున్నారు.  వాణిజ్య కేటగిరిలో భాగంగా ప్రైమరీ, మ్యానుఫ్యాక్చరింగ్‌, కమర్షియల్‌, ఎలక్ర్టిసిటీ, గ్యాస్‌, వాటర్‌ సరఫరా, ట్రేడింగ్‌, ఇతర సర్వీసులకు సంబంధించిన సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు, హాస్టళ్లు, ఫ్లాట్లు, గెస్ట్‌హౌజ్‌లు, ప్రభుత్వ బ్యాంకులు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన కార్పొరేషన్లు, వాటి అండర్‌ టేకింగ్‌ వివరాలన్నీ పరిగణలోకి తీసుకుని సర్వే చేపడుతున్నారు. సేకరించిన వివరాలను అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 


78 శాతం పూర్తి..

ఏడో ఆర్థిక గణన సర్వేలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 78 శాతం పూర్తయినట్లు సీఎ్‌సఈ జిల్లా మేనేజర్లు శివారెడ్డి, సామల గౌతం తెలిపారు. జిల్లాలో మొత్తం 17 లక్షల కుటుంబాలను గణన చేయాల్సి ఉండగా, ఫిబ్రవరి 26 వరకు 13,02,454 మందిని సర్వే చేసినట్లు వెల్లడించారు. మార్చి 31లోపు గణన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వివరించారు.  అయితే, సర్వేకు కొంతమంది సహకరించడంలేదని, పంజాగుట్టలో ఇటీవల ఒక ఎన్యూమరేటర్‌పై కొందరు అకారణంగా దాడికి పాల్పడ్డారని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామే తప్పా, వ్యక్తిగతంగా కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌, అమీర్‌పేట, బేగంపేట, పంజాగుట్ట, అంబర్‌పేట్‌, ఖైరతాబాద్‌లో దాదాపు 85 శాతం సర్వే పూర్తి చేశామని వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమకు విధించిన టార్గెట్‌ 17 లక్షల కంటే అధికంగా 30 లక్షల మందిని సర్వే చేస్తామని వారు పేర్కొన్నారు. 


పాతబస్తీలో తక్కువ 

ఆర్థిక గణనకు ఎక్కువగా నగరంలోని బస్తీలు, గల్లీల్లో నివాసముంటున్న ప్రజలు సహకరిస్తున్నట్లు ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. పాతబస్తీలోని చార్మినార్‌, బహదూర్‌పురా, యాకత్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, ఆసి్‌ఫనగర్‌ మండలాల్లో ఇప్పటివరకు 20 శాతం మంది వివరాలు మాత్రమే సేకరించినట్లు వారు పేర్కొంటున్నారు.  


సహకరించాలి

దేశ భూగోళిక సరిహద్దుల్లో ఉన్న అన్ని ఆర్థిక సంస్థల యూనిట్ల వివరాలను చెప్పడమే ఆర్థిక గణన లక్ష్యం. ఆర్థిక సంస్థ అంటే ఒకే స్థలంలో ఒక ఆర్థిక కార్యకలాపం నిర్వహిస్తూ ఉత్పత్తి చేస్తున్న సరుకులు, సేవల్లో కొంతమేరకైనా అమ్మేందుకు వినియోగించే వ్యవస్థ. ఆర్థిక గణనలో సేకరించిన సమాచారం ఆర్థిక వ్యవస్థలోని వివిధ శాఖలకు ఎంతో ఉపయోగపడుతాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఎ్‌సఈ బృందం సర్వేలో పాల్గొంటుంది. సర్వేతో ఎవరికీ నష్టం జరగదు. మార్చి 31లోపు నిర్ణీత టార్గెట్‌ను పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. జిల్లాలో చేపట్టిన ఏడో ఆర్థిక గణన సర్వేకు ప్రజలందరూ సహకరించాలి. 

-డాక్టర్‌ సురేందర్‌, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి

Updated Date - 2021-03-01T07:33:59+05:30 IST