పక్కాగా పంటల సర్వే

ABN , First Publish Date - 2022-08-22T05:37:36+05:30 IST

జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వానాకాలానికి సంబంధించి రైతుల వారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నెంబర్‌, సాగు విస్తీర్ణం, పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి తదితర వివరాలను నమోదు చేశారు.

పక్కాగా పంటల సర్వే
పంట వివరాల నమోదును పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి

- జిల్లాలో ముమ్మరంగా పంటల వివరాల నమోదు

- క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తున్న ఏఈవోలు

- ఈ నెలాఖరు వరకు పంటల నమోదు పూర్తయ్యేలా ప్రణాళిక

- ఇప్పటి వరకు 5 లక్ష ఎకరాలకు పైగా వివరాల సేకరణ


కామారెడ్డి, ఆగస్టు 21: జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. వానాకాలానికి సంబంధించి రైతుల వారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నెంబర్‌, సాగు విస్తీర్ణం, పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి తదితర వివరాలను నమోదు చేశారు. ఈ నెలాఖరు వరకు పంటల నమోదును పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

104 క్లస్టర్లలో పంటల వివరాల నమోదు

జిల్లా పరిధిలో 22 మండలాల్లో 104 ఏఈవో  క్లస్లర్‌లు ఉన్నాయి. ప్రతీ క్లస్టర్‌లో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. దీంతో అన్ని క్లస్టర్లలో ప్రతిరోజూ పంటల సాగు వివరాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. వానాకాలం ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు నమోదు చేస్తున్నారు. ప్రతీ సర్వే నెంబర్‌లోని సబ్‌ డివిజన్‌లలో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేసిన వివరాలు పక్కాగా సేకరిస్తున్నారు. ఆ వివరాలను రైతుబంధు ఆన్‌లైన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. కొన్ని పంటలకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఏఈవోలు రైతువేదిక వద్ద వెళ్లి ఫొటో దిగి తమ హాజరుకు సంబంధించి లాగర్‌యాప్‌లో అప్‌లోడ్‌ చేసి సంబంధిత రోజు పంటల నమోదు ప్రక్రియ చేపడుతున్నారా, ఇతర ఏ పనులు చేస్తారన్నది కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. కేవలం రైతువేదిక వద్ద దిగిన ఫొటోనే ఆప్‌లోడ్‌ చేయడం ద్వారానే సంబంధిత రోజు విధులకు హాజరైనట్లు గుర్తిస్తారు. అక్కడి నుంచి పంటల నమోదుకు ప్రతీ రైతుకు సంబంఽధించిన పొలం వద్దకు వెళ్లి పూర్తిస్తాయిలో వివరాలు సేకరిస్తున్నారు.

ప్రతీ గ్రామంలో 20 మంది రైతుల పంటల పరిశీలన

పంటల వివరాలను నమోదు చేసే ఏఈవోలు ప్రతిరోజూ తమ క్లస్టర్‌ పరిధిలో పంటలను పరిశీలించి నమోదు ప్రక్రియను మరింత వేగంగా, పక్కాగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రతీ వారంలో మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు తమ పరిధిలోని 2 గ్రామాల్లో, ప్రతీ గ్రామంలో 20 మంది రైతులకు సంబంధించిన పంటలను పరిశీలించి పంటల నమోదును పర్యవేక్షించాలి. జిల్లా వ్యవసాయాశాఖ అధికారి ప్రతీ వారం ఒక గ్రామంలోని 20 మంది రైతులకు సంబంధించిన పొలాలు సందర్శించడంతో పాటు పంటల వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. అందుకనుగుణంగానే జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ పక్కాగా సాగుతోంది. ఇప్పటికే పంటల సాగు పూర్తవడంతో వివరాల సేకరణను మరింత వేగవంతం చేశారు. ఆగస్టు నెలాఖరు వరకు పంటల వివరాల సేకరణ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

పూర్తి సమాచారంతో ప్రణాళిక

వానాకాలం సీజన్‌లో ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయి. వాటి దిగుబడి ఎంత వస్తుంనేది పక్కాగా అంచనా వేసేందుకు ఈ పంటల సాగు వివరాల సేకరణ దోహదపడుతోంది. పలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడంతో పాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం, కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి సేకరిస్తున్నారు. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థికవనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు ఖాళీ గన్నీ బ్యాగులు తెప్పించడం వంటివి చేయడానికి ఈ వివరాల సేకరణ చాలా ఉపయోగకరంగా మారుతోంది.


ఆన్‌లైన్‌లో పక్కగా నమోదు

- భాగ్యలక్ష్మీ, వ్యవసాయాధికారి, కామారెడ్డి

జిల్లా వ్యాప్తంగా పంటల సాగు వివరాల సేకరణ కొనసాగుతోంది. ఈ వానాకాలంలో 5లక్షల 36వేలలో వివిధ పంటలు సాగు చేయగా ఇప్పటి వరకు 104 క్లస్టర్‌లలో 5లక్షల 12 వేల ఎకరాలలో పంటల వివరాల సేకరణ పూర్తయింది. ఈ నెలాఖరులోగా పంటల వివరాల నమోదు పూర్తిచేయడానికి నిర్ధేశించాం.

Updated Date - 2022-08-22T05:37:36+05:30 IST