ఇంటికి వెళ్లకుండా సర్వే

ABN , First Publish Date - 2022-01-25T14:16:10+05:30 IST

ఇంటికి వెళ్లకుండా సర్వే

ఇంటికి వెళ్లకుండా సర్వే

నగరంలో తూతూమంత్రంగా..

బస్తీల్లో ఒకలా.. శివార్లలో మరోలా..

ఒకే రోజు 150కు  పైగా ఇళ్లల్లో

వెంటాడుతున్న సిబ్బంది కొరత


మంగళ్‌హాట్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న జ్వర సర్వే కొంత మంది సిబ్బంది తీరుతో అభాసుపాలవుతోంది. కేవలం ఫోన్ల ద్వారా, ఇతరులు ఇచ్చిన సమాచారంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ప్రస్తుతం ప్రతీ ఇంట్లో జ్వరం, దగ్గ, జలుబు తదితర లక్షణాలతో ఒక్కరైనా ఉంటున్నప్పటికీ వారిని పలకరించకుండానే సర్వే పూర్తి చేస్తున్నారు. దీంతో గ్రేటర్‌ సర్వేకు సైతం జ్వరం వచ్చిందని, సుస్తీ చేసిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 


సర్వేలో తేడాలు

ఆశా వర్కర్‌, జీహెచ్‌ఎంసీ వర్కర్‌ బృందంగా ఏర్పడి సర్వే చేస్తున్నారు. ఒక్కో బృందం రోజూ 40 నుంచి 45 ఇళ్లల్లో సర్వే చేసే అవకాశం ఉంది. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకలా, శివారు ప్రాంతాల్లో మరోలా సర్వే సాగుతోంది. శివారు ప్రాంతాల్లో ఒక్కో బృందం 150 నుంచి 180 ఇళ్లను సర్వే చేస్తున్నట్లు నివేదికలు సమర్పిస్తున్నాయి. కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో ఉన్న బహుళ అంతస్తులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న కుటుంబాల సమాచారం తీసుకొని సిబ్బంది వెనుదిరుగుతున్నారు. గోషామహల్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి ప్రాంతాల్లోని బస్తీల్లో ఆశా వర్కర్లు ఫోన్‌ ద్వారానే సమాచారం తెలుసుకుని, జ్వరం, జలుబు, దగ్గు ఉంటే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కిట్‌ తీసుకోవాలని సూచిస్తున్నట్లు బస్తీల ప్రజలు పేర్కొంటున్నారు.


హెల్త్‌ వర్కర్ల కొరత..

జ్వర సర్వేలో హెల్త్‌ వర్కర్లు అంతగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్‌ లాంటి ప్రాంతాల్లో 60 మంది నర్సులు ఉండాల్సి ఉండా, 20 మంది మాత్రమే ఉన్నారు. వ్యాక్సినేషన్‌, కరోనా టెస్టులు, మెడికల్‌ కిట్ల పంపిణీతో పాటు జ్వర సర్వేలో కూడా వీరే పాల్గొనాల్సి ఉంది. నర్సుల కొరతతో జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌, ఎంటమాలజీ విభాగాలకు చెందిన సిబ్బందిపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రభుత్వం భావించిన విధంగా సర్వే అనుకున్నంత సరిగ్గా జరగడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లోని కాలనీలు, అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండే వారిలో జ్వరం, జలుబు, దగ్గు ఇతర లక్షణాలు ఉన్నప్పటికీ సమాచారం ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు.  


తగ్గుతున్న బృందాలు

నగరంలో జ్వర సర్వేలో పాల్గొన్న సిబ్బందిలో 30 శాతం మంది కరోనా బారిన పడినట్లు సమాచారం. కింగ్‌ కోఠి క్లస్టర్‌ పరిధిలో మొదట 70 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 65కు చేరింది. దాదాపు 15 మంది కొవిడ్‌ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఎల్‌బీనగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గోషామహల్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో మిగిలిన సిబ్బంది నామమాత్రంగా సర్వే చేసి అధికారులు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-01-25T14:16:10+05:30 IST