ప్రాణాలు తీసిన వలస

ABN , First Publish Date - 2021-10-25T05:19:22+05:30 IST

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని విలియంకొండ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ప్రాణాలు తీసిన వలస

  1. కొత్తకోట సమీపంలో ట్రాక్టర్‌ బోల్తా
  2. ఇద్దరు కూలీల మృతి.. పలువురికి గాయాలు


కౌతాళం/కొత్తకోట, అక్టోబరు 24: తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని విలియంకొండ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద,  పెద్దకడబూరు మండలం కల్లుకుంట, రంగాపురం గ్రామాలకు చెందిన 30 మంది కూలీలు సంగారెడ్డి జిల్లాలో కూలీ పనులకు ట్రాక్టర్‌పై శనివారం రాత్రి బయలు దేరారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో విలియంకొండ శివారులో వారు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటన స్థలంలోనే దీపిక (18) అనే యువతి మృతి చెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో నాగవేణి (23) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎర్రన్న, సుజాతకు తీవ్ర గాయాలు కావడంతో, మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మిగతా వారు వనపర్తిలోనే చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొత్తకోట ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపారు.  


పేద కుటుంబాల్లో విషాదం


కౌతాళం, పెద్దకడబూరు మండలాల్లో వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. స్థానికంగా ఉపాధి లేక వందలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. ఈ క్రమంలో వలస బతుకు ఇద్దరి ప్రాణాలు తీసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


ఉరుకుంద గ్రామానికి చెందిన హుసేనప్ప అలియాస్‌ విజయ్‌కుమార్‌, ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు. పెద్దకొడుకు, కూతురు దీపికను వలసకు వెంట తీసుకువెళ్లారు. చిన్నకొడుకు చదువుకుంటున్నాడు. దీంతో బంధువుల ఇంట్లో వదిలి వెళ్ళారు. ప్రమాదంలో ఒక్కగానొక్క కూతరు దీపిక ప్రాణాలు కోల్పోయింది. 


పెద్దకడబూరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన తిక్కయ్య, నాగవేణి దంపతులు వలస వెళ్ళారు. నాగవేణి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. 

Updated Date - 2021-10-25T05:19:22+05:30 IST