Jul 23 2021 @ 19:16PM

ఓ పక్క కత్తి.. మరోపక్క న్యాయవాద వృత్తి!

హీరో సూర్య ‘జై భీమ్‌’, ‘ఎతారుక్కుమ్‌ తున్నిందవన్‌’, ‘వాడివాసల్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు సినిమాల్లో ఆయనే పోషిస్తున్న పాత్రల గురించి వెల్లడించారు. ‘ఎతారుక్కుమ్‌ తున్నిందవన్‌’ చిత్రం మోషన్‌ పోస్టర్‌తోపాటు మూడు లుక్‌లను విడుదల చేశారు.  పోస్టర్‌ చూసే కత్తి చేతబట్టి ప్రత్యర్థులను వేటాడి, వెంటాడి చంపే వ్యక్తిగా ఆయన నటిస్తున్నారని తెలుస్తోంది. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి భిన్నమైన కథాంశంతో ‘జై భీమ్‌’ రూపొందుతోంది. ఇందులో బడుగు–బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా... కులవృత్తులే జీవనోపాధిగా బతుకుతున్న ప్రజల పక్షాన పోరాడే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించున్నారు.  2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థా.సే. జ్ఞానవేల్‌ దర్శకుడు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాల భాషల్లో ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.