సూర్యభేతాళం

ABN , First Publish Date - 2020-08-24T06:30:03+05:30 IST

పాటంటే ఆరుద్ర వేలి కుంకుమ లిపి పాటంటే వల్లంకి ముక్కున వొలికే వగరు రాగం పాటంటే భూమండలమెల్ల పరుసుకున్న...

సూర్యభేతాళం

పాటంటే ఆరుద్ర వేలి కుంకుమ లిపి

పాటంటే వల్లంకి ముక్కున వొలికే వగరు రాగం

పాటంటే భూమండలమెల్ల పరుసుకున్న అనుభూతుల మేలిమి నూలు కండె

సిక్కులనిప్పదీసి గుండెను రాట్నంచేసి వొడుపుగ నేయగల నేర్పు


కపాల కొలనులో విప్పారిన సోయగాల కాంతిరేఖలను మునివేళ్ళ తడిమి

నీకు నీవు మగ్గం గుంతలొ దిగేసుకుని కలనేతకు జరి అంచును పొదగడం

పనితనమున్న దర్జీ ఎవరో కత్తిరించి వదిలివేసిన రంగు రంగుల పీలికలను

గుమ్ములకింది కన్నంలొ జతచేసుకున్న ఎలుక పరుపు కాదు పాటంటే...


బహెరాముల, నవాబుల నజరాణలను రాళ్ళవలె విసిరికొట్టి 

సూఫీలు శూన్యంలోకి చేతులుసాచి తిప్పె జపమాల పాట


పాట ఏ ఒక్కరి సొంతం కాదు

అయినా పాటతో నీకేం సంబంధం

నీవు పాటగాడివై మిగలాలంటే నీ ఉనికి నీవు సమూలంగ చెరిపిపేసుకోవల్సిందే

ఎముకలతో సహ నీవు నేలలో ఇంకిపోతేగాని నీలో పాట మొలకెత్తదు

నీవు గాలివై పసరు ఈత కమ్మల్లో రాపిడయితేగాని 

జుమ్మున ఎగిసే తుమ్మెదనాదం నీ వెంటరాదు


కలిమి, మంగ, పలుసు, ఇరికి, పరికి ముండ్లల్లో పొరలాడి గాయపడితేగాని

ఇసుక పలకపై బింగన్న గీతం రూపుదిద్దుకోదు

గులకరాళ్ళతో వడిసెల విసరడం ఎవరికైన తెలిసిన విద్యే

కాని పాలకంకుల తుంచె గువ్వలను గాయపరచకుండ

ఆ వడిసెలలో వదిగిన మట్టిపెడ్డవై మెత్తగా అదిలించే గుణముంటె

నీలో రాలే రేణువులే పాటకు సవ్వడి అవుతాయి 

నాప రాయినైనా తొలుసగల పదును మొనకు నీకు నీవు పురితాడువై చుట్టుకుంటె

గిరగిర తిరిగె బొంగరంల పాట నీ అరచేతిలోనే విద్యుత్తు పుట్టిస్తుంది


నీ తాతల ఉప్పూరిన తనువులు ఎప్పటికీ లేవని నేలకన్నంటుకున్న

కాటితావుల భస్మాన్ని నుదుటికి రాసుకుంటే పలవరింతల భూపాలం నీలో ప్రవహిస్తుంది

మసికోకల తాటికాయ వన్నె పవిటమాటు బిగుపొంగులలో ఊరె పాట పరువం

యాప పూతలా రాలి అమాసనెలిగిస్తుంది

ఏపయిన జొన్నసేలలో, ఏడెముండ్లలో, కాస గడ్డిలో,

కారు కందలములో, వెచ్చని ఆవిరులలో, ఊరె ఉమ్మరపు చెమటలధార పాట


చేతులు రెక్కలు చేసుకుని సారంగి పిట్టవై వరదగూటిని తాకగలిగితె

పత్తిపువ్వులా నీ చుట్టు పాట ఆవరిస్తుంది.. 

పాట వాన, పాట గాలి, పాట ఎండ


నిన్ను నీవు ప్రకృతిలో భాగం చేసుకోగలిగితె

నీలో నిత్యం రెండు వాగులు ఇంకకుండా చూసుకుంటె 

నీ భ్రమల బెరుకుతనాలనెల్ల వదిలించుకొని 

  నునుపు శానరాయిగ మారితె

చిలికిన వెన్నముద్దయ్యి చిన్నికన్నయ్యల నీ చుట్టు చిందులేయిస్తుంది.


పాటకు నీవే మూలకర్తవనుకుంటే

పాట నిన్ను మూలకు నెడుతుంది


నీవు నిజమైన పాట చిరునామకోసం

ఆదిమానవుల రాతిగుహలలొ జొరబడు,

నీవు పాటను కవచంలా ధరించాలనుకుంటే

సూర్యభేతాళఖడ్గం ఏ మర్రితొర్రలొ ఉందో 

         అంజెనమేసిచూడు

పాటకున్న పదునేమిటో ఎరుక పడాలంటె

కారంపూడి వీర కరవాలమును కళ్ళకద్దుకో!


గోరటి వెంకన్న

Updated Date - 2020-08-24T06:30:03+05:30 IST